ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-05-17T06:50:53+05:30 IST

భీమిలి నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూముల సమస్య పరిష్కారానికి వారం రోజులలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు.

ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు
రైతు భరోసా చెక్కును పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, ఎమ్మెల్యే ముత్తంశెట్టి, ఎమ్మెల్సీ కల్యాణి

కలెక్టర్‌ మల్లికార్జున 


పద్మనాభం, మే 16: భీమిలి నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూముల సమస్య పరిష్కారానికి వారం రోజులలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. మండలంలోని కోరాడలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి రైతు భరోసా పథకం ఆర్థిక సాయం విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇనాం గ్రామాలలోని భూములను సాగు చేస్తున్న రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేతో కలిపి జిల్లా కేంద్రంలో వారం రోజులలో సమావేశం నిర్వహించి చర్చిస్తామన్నారు. ఇప్పటికే బీఆర్‌ తాళ్లవలస భూముల సర్వేను పూర్తి చేశామని, కోర్టులో కేసు నడుస్తున్న కారణంగా అమలుకు నోచుకోలేదన్నారు. కోర్టు వ్యాజ్యం పరిష్కారమైన వెంటనే ఆ గ్రామంలోని అర్హులకు పట్టాలు జారీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే చేసి సమగ్రమైన రికార్డులు తయారు చేయడానికి సంకల్పించిందన్నారు. జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించి నియోజకవర్గంలో మూడు గ్రామాలలో కోర్టు వివాదాలు నడుస్తున్నాయని, త్వరలోనే కోర్టు కేసులను పరిష్కారం చేయించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 26,539 మంది అర్హులైన రైతులకు రూ.14.60 కోట్లు తొలి విడతగా విదుడల చేసిందన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, సేంద్రియ వ్యవసాయాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్‌,  ఎమ్మెల్యే ప్రారంభించి వాటిని పరిశీలించారు. అనంతరం రైతులకు రైతు భరోసా చెక్కును, విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా వ్యవసాయాధికారి అప్పలస్వామి, ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌, పద్మనాభం, భీమిలి ఎంపీపీలు కె.రాంబాబు, వాసురాజు, జడ్పీటీసీ సభ్యుడు ఎస్‌.గిరిబాబు, భీమిలి మార్కెట్‌ కమిటీ చైౖర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఎలమంచిలి సూర్యనారాయణ, బి.అప్పలనాయుడు, వైస్‌ ఎంపీపీలు మంజు, రాజేశ్వరి, సర్పంచ్‌ కె.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:50:53+05:30 IST