సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-06-26T06:13:04+05:30 IST

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు.

సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో హరితహారం, సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి, క్రీడా ప్రాంగణాలకు స్థలాల గుర్తింపు, తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కలు వంగిపోకుండా ఉండడానికి ఊతకర్రలు కట్టి ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో నీరు నిల్వ ఉంటే చీడ పురుగులు వస్తాయని, తద్వారా మొక్కలు చనిపోతాయన్నారు. నర్సరీల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్‌, బ్లాక్‌ ప్లాంటేషన్‌లో భాగంగా రోడ్లకు ఇరువైపులా గుంతలు తీసి మొక్కలు నాటాలని అన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించే విధంగా చూడాలని అన్నారు. సీజనల్‌ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, తదితర వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, చెరువు గట్లపై మొక్కలు నాటాలని కలెక్టర్‌ తెలిపారు. మండల సమాఖ్యలో మహిళా సంఘాలకు, ఉపాధిహామీలో పని చేసేవారిని సమన్వయం చేసుకొని గూగుల్‌ పేకు బదులుగా ఇండియన్‌ పోస్టు భారత్‌ పే(ఐపీబీపీ) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి వారిని అకౌంట్లు ఓపెన్‌ చేయించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, డీపీవో వీరబుచ్చయ్య, జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, సీపీవో కొమురయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:13:04+05:30 IST