టేపుతో కొలతలు!

ABN , First Publish Date - 2020-11-10T06:23:18+05:30 IST

బరువు తగ్గడం అంటే శరీరంలో కొవ్వు కరగడమే! అయితే ఈ కొవ్వు వేర్వేరు శరీర భాగాల నుంచి వేర్వేరు పరిమాణాల్లో కరుగుతుంది.

టేపుతో కొలతలు!

అధిక బరువు తగ్గే క్రమంలో వర్కవుట్స్‌, ఫాస్టింగ్‌.... ఇలా ఎన్నో మార్గాలు అనుసరిస్తాం. అయితే ఎంత బరువు తగ్గామో తెలుసుకోవడం కోసం వెయింగ్‌ విషన్‌ కంటే కొలతల టేప్‌ సరైనది. అదెలాగంటే...

బరువు తగ్గడం అంటే శరీరంలో కొవ్వు కరగడమే! అయితే ఈ కొవ్వు వేర్వేరు శరీర భాగాల నుంచి వేర్వేరు పరిమాణాల్లో కరుగుతుంది. దాంతో స్థూలంగా శరీర బరువు తగ్గుతుంది. సాధారణంగా మనం వెయింగ్‌ మిషన్‌ మీద నిలబడి బరువు కొలుస్తూ ఉంటాం. కానీ ఏ శరీర భాగంలో కొవ్వు కరుగుతోంది? ఎక్కడ పేరుకుపోతోంది? అనే విషయం గ్రహించి, ఆయా శరీర భాగాలకు అవసరమైన వ్యాయామాలు చేయగలిగితే మొత్తంగా బరువు తగ్గడం తేలికవుతుంది.


అలాగే తగ్గే కొలతలను తెలుసుకోవడం కోసం మెజరింగ్‌ టేప్‌ ఉపయోగించాలి. చేతులు, తొడలు, నడుము, ఛాతీ.... ఇలా ఆయా శరీర భాగాల చుట్టుకొలతలు కొలుచుకోవాలి.

నగ్నంగా: శరీర కొలతలు కొలిచే సమయంలో దుస్తులు లేకుండా చూసుకోవాలి. దుస్తులతో కలిపి కొలిస్తే, కొలతల్లో తేడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 

వారానికోసారి: ప్రతి రోజూ బరువు తూచే యంత్రం ఉపయోగించడం సరి కాదు. అలాగే కొలతల టేప్‌తో ప్రతి రోజూ చుట్టుకొలత కొలవడమూ సరి కాదు. ఇందుకోసం కనీసం రెండు వారాల వ్యవధి పాటించాలి. అంతకంటే ముందే కొలవాలనుకుంటే కనీసం వారం వ్యవధి అయినా తీసుకోవాలి.

ఒకే ప్రదేశం: పొట్టను కొలవాలనుకుంటే ఒకే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. పొట్ట ఎగువ లేదా దిగువ... ఏ ప్రదేశాన్ని కొలిచారో, అదే చోట టేపుతో కొలుచుకోవాలి. అంతేగానీ పొట్ట ఎగువన, లేదా దిగువన ఇలా టేపును మార్చకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడైతే కొవ్వు ఎక్కువగా ఉందో, ఆ ప్రదేశాన్నే కొలతకు ఎంచుకోవాలి.

కొలతల పుస్తకం: తొడలు, చేతులు, ఛాతీ... ఈ ప్రదేశాలే కాకుండా భిన్నమైన శరీర భాగాలు కొలుచుకోవాలి. ఈ వివరాలన్నిటినీ ఓ పుస్తకంలో నమోదు చేసుకోవాలి. ఇలా రాసుకుంటే ఎంత కాలంలో, ఏ ప్రదేశంలో ఎక్కువ కొవ్వు కరిగిందీ తెలుస్తుంది.


Updated Date - 2020-11-10T06:23:18+05:30 IST