దలైలామాకు మోదీ శుభాకాంక్షలపై చైనా ఆగ్రహం... దీటుగా జవాబిచ్చిన భారత్...

ABN , First Publish Date - 2022-07-08T00:46:51+05:30 IST

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ

దలైలామాకు మోదీ శుభాకాంక్షలపై చైనా ఆగ్రహం... దీటుగా జవాబిచ్చిన భారత్...

న్యూఢిల్లీ : టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పడంపై చైనా విమర్శలు గుప్పించింది. దీంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం చైనాకు ఘాటుగా సమాధానం చెప్పింది. దలైలామా భారత దేశానికి అతిథి అని, ఆయనను తాము ఎంతో గౌరవిస్తామని స్పష్టం చేసింది. 


దలైలామా 87వ జన్మదినోత్సవాలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘పూజనీయులైన దలైలామాకు 87వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను. ఈరోజు ఉదయం ఆయనతో టెలిఫోన్ ద్వారా మాట్లాడాను. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించాను’’ అని పేర్కొన్నారు. 


ఈ నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియాతో మాట్లాడుతూ, 14వ దలైలామా చైనా వ్యతిరేక వేర్పాటువాద స్వభావాన్ని భారత దేశం సంపూర్ణంగా గుర్తించాలన్నారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ సంబంధిత అంశాలను ఉపయోగించుకోవడాన్ని భారత దేశం మానుకోవాలన్నారు. దలైలామాకు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అమెరికాపై కూడా ఝావో లిజియాన్ మండిపడ్డారు. 


చైనా విమర్శలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియా సమావేశంలో స్పందిస్తూ, దలైలామాతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది కూడా మాట్లాడారని చెప్పారు. భారత దేశానికి దలైలామా అతిథి అని, ఆయనను ఆ విధంగా పరిగణించడం భారత ప్రభుత్వ  స్థిర విధానమని చెప్పారు. దేశంలో ఆయనను అనుసరించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఆయన పుట్టిన రోజును భారత దేశంతోపాటు విదేశాల్లో కూడా జరుపుకుంటారన్నారు. 


Updated Date - 2022-07-08T00:46:51+05:30 IST