పీఛే... మూడ్‌!

ABN , First Publish Date - 2021-03-02T06:36:46+05:30 IST

జిల్లాలో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్లు సివిల్‌ సప్లయిస్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు.

పీఛే... మూడ్‌!

విధులకు దూరంగా ఎండీయూ ఆపరేటర్లు 

డీలర్ల చేత రేషన్‌ పంపిణీ చేయించాలని నిర్ణయం 

బాపులపాడు మండలంలో డీలర్ల మనస్తాపం 

రంగంలోకి దిగిన నూజివీడు డివిజినల్‌ ఏఎస్‌వో 


విజయవాడ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్లు సివిల్‌ సప్లయిస్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వం రూ.21 వేలు డబ్బులు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినా.. బండ చాకిరీ చేయటం మా వల్ల కాదని 100 మందికి పైగా ఆపరేటర్లు విధులు బహిష్కరించారు. ఇతర ఆపరేటర్లు కూడా ఇదే బాట పట్టనున్నట్టు తెలుస్తోంది. సివిల్‌ సప్లయిస్‌ అధికారులు, జిల్లా యంత్రాంగం మాత్రం ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచి ప్రత్యామ్నాయంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నగరంలో కార్పొరేషన్‌ యూసీడీ విభాగాధికారులను, గ్రామీణ ప్రాంతాల్లో ఎండీవోలను కోరుతోంది. వీఆర్వోల లాగిన్‌ ద్వారా రేషన్‌  పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించింది.


జిల్లావ్యాప్తంగా మార్చి నెలలో ప్రారంభమైన రేషన్‌ డోర్‌ డెలివరీ పంపిణీలో అపశృతి చోటు చేసుకుంది. జిల్లావ్యాప్తంగా ఏకంగా వంద మందికి పైగా ఎండీయూ ఆపరేటర్లు వాహనాలను వదిలివేసి వెళ్లిపోవటంతో పెద్ద చిక్కే వచ్చి పడింది. జిల్లాలో వంద మందికి పైగా ఎండీయూ ఆపరేటర్లు వెళ్లిపోవటంతో.. వీరి స్థానంలో వేరొకరిని ఎంపిక చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగం ఆయా  శాఖలను కోరుతోంది. 


వీఆర్వో లాగిన్‌లో రేషన్‌ పంపిణీ చేయాలని ఆదేశం  

డోర్‌ డెలివరీలో ఎండీయూ ఆపరేటర్ల గైర్హాజరుతో జిల్లా పౌరసరఫరాల విభాగం మళ్లీ డీలర్లనే రేషన్‌ పంపిణీ చేయాలని కోరింది. బాపులపాడు మండలంలోని డీలర్లకు సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. వీఆర్వో లాగిన్‌లోనే రేషన్‌ పంపిణీ చేయాలని సూచించారు. వీఆర్వో లాగిన్‌లో పంపిణీ చేస్తే ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇచ్చినట్టు అవుతుంది. ప్రభుత్వం దృష్టిలో పడదు. అదే డీలర్‌ లాగిన్‌ ద్వారా ఇస్తే జవాబిచ్చుకోవాల్సి వస్తోంది. ఈ భయంతో అడ్డదారిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.


డీలర్ల మనస్తాపం 

డీలర్లు మాత్రం ఈ ఆదేశాల పట్ల తీవ్ర మనస్తాపం చెందారు. రేషన్‌ పంపిణీ చేయటానికి తమకేమీ ఇబ్బంది లేదని, తమ లాగిన్‌లోనే చేస్తామని పట్టుబట్టారు. వీఆర్వో లాగిన్‌లో చేయటం వల్ల తమను తాము అన్యాయం చేసుకున్నవారమవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది డీలర్లు అసలు పంపిణీ ప్రారంభించలేదు. దీంతో నూజివీడు డివిజినల్‌ ఏఎస్‌వో రంగంలోకి దిగి, డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాము నిర్దేశించిన విధంగా వీఆర్వో లాగిన్‌లోనే రేషన్‌ ఇవ్వాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయారు. 

Updated Date - 2021-03-02T06:36:46+05:30 IST