నాడు టాంగావాలా..నేడు వెయ్యి కోట్ల కంపెనీకి అధిపతి

ABN , First Publish Date - 2020-12-03T17:53:29+05:30 IST

నాడు ఢిల్లీ వీధుల్లో గుర్రపు బగ్గీ నడిపిన టాంగావాలా నేడు రూ.1000కోట్ల ఎండీహెచ్ కంపెనీ అధినేతగా ఎదిగిన ధరంపాల్ గులాటీ విజయానికి మారుపేరుగా చరిత్రలో నిలిచారు.....

నాడు టాంగావాలా..నేడు వెయ్యి కోట్ల కంపెనీకి అధిపతి

రూ.1500రూపాయల నుంచి రూ.1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన గులాటీ విజయగాథ

న్యూఢిల్లీ : నాడు ఢిల్లీ వీధుల్లో గుర్రపు బగ్గీ నడిపిన టాంగావాలా నేడు రూ.1000కోట్ల ఎండీహెచ్ కంపెనీ అధినేతగా ఎదిగిన ధరంపాల్ గులాటీ విజయానికి మారుపేరుగా చరిత్రలో నిలిచారు. గురువారం గులాటీ గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ఆయన విజయగాథ అందరికీ స్ఫూర్తినిస్తోంది. దేశ విభజన సమయంలో నాడు పాకిస్థానులోని సియాల్ కోట్ నుంచి ధరంపాల్ గులాటీ కేవలం 1500రూపాయల నగదుతో ఢిల్లీకి వలస వచ్చారు. 


ఎండీహెచ్ సుగంధ ద్రవ్యాలకు భారతదేశంతోపాటు విదేశాల్లో 1000కి పైగా స్టాకిస్టులు, 4లక్షలకు పైగా రిటైల్ డీలర్లు ఉన్నారు. ఎండీహెచ్ సుగంధద్రవ్యాలు, కుంకుమపువ్వులను విక్రయిస్తున్నారు.2017లో గులాటి భారతదేశంలోనే అత్యధిక పారితోషికం పొందిన ఎఫ్ఎంసీజీ సీఈవోగా 21 కోట్ల వార్షిక వేతనం పొందారు. ఎండీహెచ్ నికరలాభం 213 కోట్ల రూపాయలుగాఉంది. గోద్రెజ్, హిందూస్థాన్ యూనిలీవర్ కంపెనీల సీఈవోల కంటే గులాటీ అధిక జీతం తీసుకొని చరిత్ర సృష్టించారు. 


ఢిల్లీ వీధుల్లో టాంగా నడిపిన గులాటీ కరోల్ బాగ్ లోని అజ్మల్ ఖాన్ రోడ్డుపై చిన్న చెక్క తలుపులతో దుకాణం ప్రారంభించారు. తన తండ్రి నుంచి నేర్చుకున్న మసాలా దినుసుల వ్యాపారాన్ని డెగ్గి మిర్చవేల్ బ్యానరుతో ఆరంభించారు. నాడు ఢిల్లీలో గులాటీ తెరచిన చిన్న దుకాణం విస్తరిస్తూ నేడు రూ1000 కోట్ల ఎండీహెచ్ మసాలా కంపెనీగా ఎదిగింది. మసాలాదినుసుల తయారీలో పెద్ద కంపెనీగా ఎదిగిన ఎండీహెచ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా స్విట్జర్లాండ్, జపాన్, అమెరికా, కెనడా దేశాలకు సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తోంది. 


తన వద్ద ఉన్న రూ.1500ల్లో 650 రూపాయలతో టాంగాను కొని న్యూఢిల్లీ రైల్వేస్టేషను నుంచి కుతుబ్ మినార్ రోడ్డు, కరోల్ బాగ్, బారాహిందూరావు వరకు నడిపారు. ధరంపాల్ తండ్రి చునీలాల్ కు సియాల్ కోట్ లో సుగంధ ద్రవ్యాలు అమ్మే దుకాణం ఉండేది. దుకాణంతో తన తండ్రికి సహాయం చేయడానికి చిన్నవయసులోనే ధరంపాల్ చదువును విడిచిపెట్టాడు. స్పైస్ కింగ్ గా గులాటీ ఎండీహెచ్ కంపెనీ అధినేతగా 1500రూపాయల నుంచి వెయ్యికోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి రాష్ట్రపతి నుంచి తన విజయాలకు గుర్తింపుగా పద్మభూషణ్ అవార్డు పొందారు. 

Updated Date - 2020-12-03T17:53:29+05:30 IST