Abn logo
Oct 17 2021 @ 01:09AM

మద్యం, మాంసం..

పండుగ రోజున భారీగా అమ్మకాలు 

జిల్లాలో ఒక్కరోజే రూ.12.95 కోట్ల మందు అమ్మకం

సాధారణ రోజుల్లో కంటే 25 శాతం అధికం

గత ఏడాది కంటే ఐదు శాతం పెరుగుదల

రూ.15 కోట్ల మాంసం విక్రయం

నేడు కూడా అదేస్థాయిలో విక్రయాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దసరా కావడంతో జిల్లాలో శుక్రవారం మద్యం, మాంసం విక్రయాలు భారీగా జరిగాయి. అయితే ఈ ఏడాది పండుగ శుక్రవారం రావడంతో కొంతమంది మాంసాహారానికి దూరంగా ఉన్నారు. ఆ ప్రభావం కొంత మద్యం విక్రయాలపై పడిందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

నగరంతోపాటు జిల్లాలో 266 మద్యం దుకాణాలు, 124 బార్‌లు ఉన్నాయి. వీటిలో 70 మద్యం దుకాణాలు, 116 బార్‌లు నగరంలో వుండగా, మిగిలినవి రూరల్‌ పరిధిలో ఉన్నాయి. వీటన్నింటికీ ఆనందపురం, అనకాపల్లి, నరవల్లో గల ఐఎంఎల్‌ డిపోల ద్వారా మద్యం సరఫరా జరుగుతుంది. నగరంతోపాటు తగరపువలస, భీమిలి ప్రాంతాల్లోని దుకాణాలకు డిపో-1 ద్వారా, పెందుర్తి సర్కిల్‌తోపాటు గాజువాక ప్రాంతాల్లోని దుకాణాలకు నరవ డిపో ద్వారా, రూరల్‌ జిల్లాలోని దుకాణాలన్నింటికీ అనకాపల్లిలోని డిపో-3 ద్వారా మద్యం సరఫరా జరుగుతుంది. దసరా సందర్భంగా మూడు డిపోల ద్వారా 7,526 కేసుల మద్యం, 5,732 కేసుల బీరు అమ్ముడైంది. వీటి విలువ రూ.12.95 కోట్లుగా ఎక్సైజ్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది దసరా సందర్భంగా రూ.12.3 కోట్లు మద్యం అమ్ముడైతే ఈ ఏడాది సుమారు ఐదు శాతం అధికంగా అమ్ముడైంది. నెలలో ప్రతిరోజూ సగటున రూ.తొమ్మిది కోట్లు సరకు అవుతుంటుంది. అయితే దసరా సందర్భంగా శుక్రవారం ఒక్కరోజే 25 శాతానికి పైగా అదనపు విక్రయాలు జరిగాయి. ఇక, ఈ ఏడాది దసరా పండుగ శుక్రవారం కావడంతో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉన్నారు. దీనివల్లే ఆశించిన స్థాయిలో మద్యం విక్రయాలు కూడా జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు. శుక్రవారం సెంటిమెంట్‌గా భావించి మాంసానికి దూరంగా వున్నవారంతా ఆదివారం పండుగను జరుపుకోవాలని భావిస్తున్నారు. దీనివల్ల ఆదివారం మద్యం విక్రయాలు కూడా పెరిగే అవకాశం వుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే సరకును దుకాణాలకు సరఫరా చేసేశారు.   

రూ.15 కోట్ల మాంసం అమ్మకం

దసరా పండుగ ఈ ఏడాది శుక్రవారం రావడంతో మాంసం విక్రయాలపై కొంత ప్రభావం పడింది. చికెన్‌, మటన్‌ దుకాణాల్లో విక్రయాలు మామూలుగానే కనిపించినప్పటికీ మార్కెట్లు, పరిశ్రమలలో మేక/గొర్రెపోతులను మొక్కుబడులు  చెల్లించుకున్నారు. నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా 1,200 వరకూ మటన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ సగటున మూడు చొప్పున మేక/గొర్రెపోతులు అమ్ముడయ్యాయి. అంటే ఒక్కో మేక/గొర్రెపోతు సగటున 15 కిలోలు వుంటుందనుకుంటే 54 కిలోల మటన్‌ అమ్ముడైంది. మటన్‌ కిలో రూ.800. ఈ లెక్కన రూ.4.32 కోట్లు విలువైన మటన్‌ విక్రయం జరిగింది. ఇది కాకుండా మొక్కుబడుల పేరుతో జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 వరకూ మేక/గొర్రెపోతులను మొక్కుబడుల రూపంలో చెల్లించుకున్నారు. అంటే అదో 18 వేల కిలోలు...దీని విలువ రూ.1.44 కోట్లు ఉంటుంది. మొత్తం జిల్లాలో దసరా సందర్భంగా రూ.5.76 కోట్లు విలువైన మటన్‌ను జిల్లా వాసులు బ్రేవ్‌ మనిపించేశారు. ఇది కాకుండా జిల్లాలో నాలుగు లక్షల కిలోల వరకూ చికెన్‌ అమ్ముడైనట్టు బ్యాగ్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. చికెన్‌ కిలో రూ.230కి విక్రయించడంతో వీటి విలువ రూ.9.2 కోట్లు వరకూ ఉంటుంది. దసరా పండుగ సందర్భంగా సుమారు రూ.15 కోట్ల విలువైన మాంసాన్ని నగరవాసులు కొనుగోలు చేశారని చెప్పుకోవాలి.వస్త్ర వ్యాపారం రూ.200 కోట్లు

కలిసొచ్చిన పెళ్లిళ్ల సీజన్‌

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్ర జ్యోతి): దసరా పండుగ సందర్భంగా సుమారు రూ.200 కోట్ల వస్త్ర వ్యాపారం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. పండుగకు తోడు పెళ్లిళ్లు కూడా వుండడం విక్రయాలు పెరగడానికి దోహదపడిందని వ్యాపారులు చెబు తున్నారు. నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి వస్త్ర దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఏటా దసరా పండుగకి రూ.180 కోట్లు వరకూ విక్రయాలు జరుగుతుంటాయి. గత ఏడాది కరోనా కారణంగా పెద్దగా జరగలేదు. కొంతమంది వ్యాపారులైతే దుకాణాలను కూడా తెరవలేదు. ప్రస్తుతం కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో దుకాణాలన్నీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాయి. దసరాతోపాటు ఈ ఏడాది అక్టోబరు నుంచి జనవరి వరకూ పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి. దాంతో విక్రయాలు గణనీయంగా పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. 2019తో పోల్చితే ఈ ఏడాది పది శాతం వరకూ విక్రయాలు పెరిగినట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది దసరా పండుగ ముందురోజు వరకూ రూ.200 కోట్ల విలువైన వస్త్రాలను విక్రయించినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు.