మెప్మాలో మెక్కినోళ్లకు.. మెక్కినంత

ABN , First Publish Date - 2022-05-02T05:57:44+05:30 IST

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మహిళలను ప్రోత్సహిస్తూ కుటీర పరిశ్రమలకైన, చిన్నపాటి వ్యాపారానికైనా తక్కువ వడ్డీతో రుణాలను అందించేందుకు 10 మందితో కలిసి ఓ పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేశాయి.

మెప్మాలో మెక్కినోళ్లకు.. మెక్కినంత
ఎల్లారెడ్డిలో మహిళా సంఘ సభ్యుల డబ్బులు పక్కదారి పట్టడంపై విచారణ జరుపుతున్న అధికారులు

- జిల్లాలో మహిళా సంఘాల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఆర్‌పీలు

- కామారెడ్డిలో గతంలో ఓ ఆర్‌పీ కమీషన్ల పర్వంపై విచారణ జరపని అధికారులు

- ఆ ఆర్‌పీపై విచారణ జరుపకపోవడంపై మరికొంత మంది ఇదేతరహాలో కమీషన్ల దందా

- తాజాగా ఎల్లారెడ్డి ఓ సంఘ సభ్యురాలి డబ్బులను సొంతానికి వాడుకున్న ఆర్‌పీ

- ఇదేంటని ప్రశ్నిస్తే మరోసారి లోన్‌ రాకుండా చేస్తా అంటూ బెదిరింపులు

- ఆర్‌పీల ఆగడాలకు అడ్డుకట్ట వేయని ఉన్నతాధికారులు

-  క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే బయటపడనున్న ఆర్‌పీల బాగోతాలు


కామారెడ్డి టౌన్‌, మే 1: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి మహిళలను ప్రోత్సహిస్తూ కుటీర పరిశ్రమలకైన, చిన్నపాటి వ్యాపారానికైనా తక్కువ వడ్డీతో రుణాలను అందించేందుకు 10 మందితో కలిసి ఓ పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేశాయి. ఈ 10 మందితో కూడిన సంఘాల్లోని 15 నుంచి 20 సంఘాలను కలిపి సమైక్య సంఘాలు ఏర్పాటు చేశారు. వీరిని మానిటరింగ్‌ చేసేందుకు ఈ సంఘాల నుంచి ఓ ఆర్‌పీ(రిసోర్స్‌ పర్సన్‌)ని ఎన్నుకుని వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వారిని ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు వీరికి మున్సిపల్‌ కార్యాలయాలలో మెప్మా(పట్టణ పేదరిక నిర్మూలన) కార్యాలయం ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి అందే ప్రతీ సౌకర్యాన్ని మహిళలకు చేరేలా చేస్తోంది. అయితే తమ ఆర్థిక అభివృద్ధికి తోడుగా ఉంటారని ఎంచుకున్న ఆర్‌పీల వల్లే మహిళ సంఘాల సభ్యులు భారీ దోపిడీకి గురవుతున్నారు. నిరాక్షరాస్యత, అమాయకత్వమే ఆర్‌పీలకు ఆదాయవనరుగా మారుతోంది. ప్రత్యేక నిబంధనలు చెబుతూ లోన్‌లు వచ్చిన ప్రతీసారి పెద్దఎత్తున కమీషన్లు తీసుకుంటూ మహిళ సంఘాల సభ్యులను దోచుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సంఘం నుంచి తప్పించి వేస్తా, మరోసారి లోన్‌ రాకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో మహిళ సంఘాల సభ్యులు అడిగినంత ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఇదే తరహ దందా సాగుతున్నా ఉన్నతాధికారులు ఆర్‌పీల ఆగడాలకు మాత్రం ఉన్నతాధికారులు అడ్డుకట్టవేయకపోవడం వల్లనే ఒకరిని చూసి మరొకరు దోపిడీ పర్వానికి తెరలేపుతున్నారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ జరిపితే పెద్దఎత్తున ఆర్‌పీల దోపిడీ బయటపడే అవకాశం ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

అక్రమ వసూళ్లకు ప్రత్యేక నిబంధనల సృష్టి

మహిళ సంఘాలు ఆర్థికంగా ఎదగాలని తక్కువ వడ్డీకి ఎక్కువ వెసులుబాటు కలిగేలా రుణాలు అందిస్తూ ప్రభుత్వాలు వారి కష్టాలను దూరం చేసే ప్రయత్నాలు చేస్తుంటే  మహిళలు ఆర్థికంగా ఎదగడం దేవుడెరుగు కానీ వారి అమాయకత్వాన్ని మాత్రం తమ ధనార్జనకు మార్చుకుంటూ ఆర్‌పీలు మాత్రం ఆర్థికంగా ఎదుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్లకు వీరు ప్రత్యేక నిబందనలు సృష్టించి మహిళ సంఘాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని అక్షరాస్యులైన మహిళ సంఘ సభ్యులు పేర్కొంటున్నారు. ఆర్‌పీలే ప్రత్యేకంగా బుక్‌ ట్రెనింగ్‌ అంటూ.. ఆడిట్‌ నిర్వహణ అంటూ ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలనే ప్లాన్‌లను అమలు పరుస్తున్నారంటే ఏ తరహాలో దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎవరికైన లోన్‌ డబ్బులు అవసరం లేవని చె బితే చాలు సంఘ సభ్యులలోనే మిగితా వారికి అప్పగించాల్సింది పోయి సదరు సభ్యురాలి పైన డబ్బులు తీసుకుంటున్న ఆర్‌పీలు వడ్డీ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. లేని నిబంధనలు సృష్టించి మహిళ సంఘాల నుంచి అక్రమంగా డబ్బులు దోచుకోవడం దారుణమని మహిళ సంఘాల అభివృద్ధి కంటే వీరి ఆర్థిక అభివృద్ధికే ప్రాధాన్యతను ఇస్తున్నారని, ఒక్కో ఆర్‌పీకి జీతం, సంఘ సభ్యులు అందించే డబ్బుల రూపంలో నెలకు కేవలం రూ.8వేలు మాత్రమే చేతికి అందుతుండగా ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, వ్యాపారుల స్థాయిలో రెండు, మూడు ఇంటి నిర్మాణాలు, స్థలాలను కొనుగోలు చేయడం చూస్తేనే ఏ తరహ దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఎల్లారెడ్డిలో మహిళ సంఘ సభ్యురాలి డబ్బును సొంతానికి వాడుకున్న ఆర్‌పీ

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన అంబిక మహిళ సంఘం సభ్యురాలైన లక్ష్మీ అనే మహిళ స్త్రీ నిధిలో రూ.1లక్ష లోన్‌ తీసుకుని ప్రతినెల రూ.5 వేల చొప్పున రూ.98,200 చెల్లించింది. మిగిలిన డబ్బులు చెల్లించి మరోమారు లోన్‌ తీసుకునేందుకు స్త్రీనిధి మేనేజర్‌ వద్దకు వెళ్లి ప్రయత్నించగా పాత బకాయి ఇంకా రూ.74,462 ఉందని తెలుపడంతో షాక్‌కు గురైంది. తాను తమ మహిళ సంఘ లావాదేవీలు చూసే ఆర్‌పీకి డబ్బులు చెల్లించానని, మాన్యువల్‌ బుక్‌లో సైతం నెలనెల వాయిదాలు కట్టినట్లు రాసి ఉందని తెలిపింది. అయితే సదరు ఆర్‌పీ మాత్రం బ్యాంకులో నెలనెల చెల్లించకుండా తన సొంతానికి వినియోగించుకున్నారు. ఇదేంటని ప్రఽశ్నిస్తే మరోసారి లోన్‌ రాకుండా చేస్తానని, అవసరమైతే సంఘం నుంచే తీసివేయిస్తానని చెప్పడంతో లక్ష్మీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళ సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించగా వాస్తవమేనని విచారణ అధికారులు తేల్చారు. ఎల్లారెడ్డిలోనే కాకుండా కామారెడ్డి మండలంలోని ఓ వీఓఏ సైతం ఇదే తరహాలో  సంఘ సభ్యుల డబ్బులను వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కామారెడ్డిలో జరిగిన అక్రమాలపై అటకెక్కిన విచారణ

గతంలో కామారెడ్డి మెప్మా కార్యాలయంలో సైతం ఓ ఆర్‌పీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతుందని నిబంధనలకు విరుద్ధంగా బుక్‌ ట్రేనింగ్‌, ఆడిట్‌ పేర్లతో భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతుందని తోటి ఆర్‌పీలే ఆరోపించిన సంఘటనలు ఉన్నాయి. సదరు ఆర్‌పీ తన సమైఖ్య పరిధిలోనే పని చేయాల్సి ఉండగా కార్యాలయ పనులలో తలదూర్చడంతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో బుక్‌ ట్రేనింగ్‌, ఆడిట్‌ అంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ సమైఖ్య సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిందని ఆరోపణలు ఉండడం, రూ. లక్షల్లోనే అక్రమంగా సభ్యుల నుంచి లబ్ధిపొందిన విషయం జగమెరిగిన సత్యం. ఈ ఆర్‌పీపై విచారణ జరుపుతామంటూ  తూతూ మంత్రంగా సమావేశం నిర్వహించి మమ అనిపించేశారు. ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగిన ఉన్నతాధికారులు ఎలాంటి విచారణకు, చర్యలకు పూనుకోకపోవడంతో మరికొంతమంది ఆర్‌పీలు ఇదే తరహాలో మహిళ సంఘ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోన్‌లు వస్తే చాలు రూ. 1లక్షకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తుండగా మొత్తం 10 మంది సభ్యుల నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన అక్రమాలకు పాల్పడుతున్న ఒక్కో ఆర్‌పీ తన సమైక్య పరిధిలో లోన్‌లు వచ్చినప్పుడల్లా రూ.లక్షల్లో మహిళ సంఘాల సభ్యురాలి నుంచి కమీషన్ల రూపంలో పొందుతున్నారని సమాచారం. ఈ వ్యవహరమేకాకుండా సమైఖ్య సభ్యులు ఎంపిక చేసిన వారిని ఆర్‌పీలుగా నియమించాలి. వారే ఆ సమైఖ్యల యొక్క లావాదేవీలు చూడాల్సి ఉంటుంది. కానీ సమైఖ్యలకు ఎటువంటి సంబంధం లేకుండా డబ్బులు తీసుకుని ఏ మాత్రం సంఘాలకు సంబంధం లేని వారిని ఆర్‌పీలుగా ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతలా అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందని క్షేత్రస్థాయిలో కొందరు ఆర్‌పీలు చేస్తున్న దోపిడీ, ఆర్‌పీలుగా వారు చేరకముందు వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఏ తరహాలో ఆర్థికంగా స్థిరపడ్డారనేది విచారణ జరిపితే అక్రమాలు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందని సొంత శాఖలోని ఆర్‌పీలు పేర్కొనడం గమనార్హం.


లోన్‌ డబ్బులను సొంతానికి వాడుకున్న ఆర్‌పీ

- లక్ష్మీ, మహిళ సంఘ సభ్యురాలు, ఎల్లారెడ్డి

స్త్రీ నిధిలోన్‌లో రూ.1లక్ష తీసుకోగా ప్రతీనెల వాయిదాల రూపంలో డబ్బులు చెల్లించాను. మొత్తం రూ.98,200 చెల్లించగా మిగిలిన డబ్బులను సైతం చెల్లించి మరోమారు లోన్‌ తీసుకుంటానని స్త్రీనిధి మేనేజర్‌ దగ్గరకు వెళ్లగా మరో రూ.74,462ల లోన్‌ అమౌంట్‌ చెల్లించేది ఉందని పేర్కొన్నారు. దీంతో ఎక్కడ పొరపాటు జరిగిందని పరిశీలించగా సంఘం లావాదేవీలు చూస్తే ఆర్‌పీ తన సొంతానికి డబ్బులు వాడుకున్నట్లు తేలింది. సదరు ఆర్‌పీపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశాను.

Updated Date - 2022-05-02T05:57:44+05:30 IST