మెడికల్‌ కళాశాల అనుమతులపై ఎంసీఐ వర్చువల్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-07-06T05:44:20+05:30 IST

రామగుండం మెడికల్‌ కళాశాల అను మతులపై మంగళవారం మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) ఢిల్లీ నుంచి వర్చువల్‌ తనిఖీలు చేపట్టింది.

మెడికల్‌ కళాశాల అనుమతులపై ఎంసీఐ వర్చువల్‌ తనిఖీలు
వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొన్న ప్రిన్సిపాల్‌, అధికారులు

- అభ్యంతరాలపై ప్రిన్సిపాల్‌ వివరణ 

కళ్యాణ్‌నగర్‌, జూలై 5: రామగుండం మెడికల్‌ కళాశాల అను మతులపై మంగళవారం మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) ఢిల్లీ నుంచి వర్చువల్‌ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా గోదావరిఖని డిగ్రీ కళాశాల భవనంలో వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఫిబ్రవరిలో తనిఖీలు జరిపిన ఎంసీఐ బృందం పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మంగళవారం జరి గిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ హిమబిందు ఆధ్వర్యంలో వివరణ ఇచ్చారు. ఎంసీఐ బృందంలోని నలుగురు నిపుణులైన ఇన్‌ స్పెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంసీఐ గైడ్‌లైన్స్‌ ప్రకారం భవనాలు, జనరల్‌ ఆసుపత్రి, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో రోగు లు, చికిత్స గురించి వివరించారు. నూతనంగా నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల భవనాన్ని, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన క్లాసు రూములు, ల్యాబ్‌లు, డిస్కషన్‌ హాల్‌ వీక్షించారు. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలోని ఈఎండీ బిల్డింగ్‌ వార్డుల్లోని రోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌స్పెక్టర్లు మాట్లాడారు. ఫిబ్రవరి లో ఎంసీఐ బృందం తనిఖీల్లో ముఖ్యంగా కళాశాల భవన నిర్మాణం పూర్తికాకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. దీంతో షార్ట్‌ఫాల్ట్స్‌ పెట్టారు. 20రోజుల క్రితం జగిత్యాల, మహబూబ్‌నగర్‌ జిల్లాలో నూతన మెడికల్‌ కళాశాలలకు ఎంసీఐ అనుమతులను మంజూరు చేసింది. రామగుండానికి మాత్రం అనుమతులు రాలేదు. వర్చువల్‌ మీటింగ్‌లో అభ్యంతరాలపై వివరణలను స్వీకరించిన నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ 15రోజుల్లోగా అనుమతులపై స్పష్టత ఇవ్వనున్నట్టు పేర్కొంది.

Updated Date - 2022-07-06T05:44:20+05:30 IST