Abn logo
Nov 18 2020 @ 03:57AM

భయపడాల్సిందేమీ లేదు

ఆసీస్‌ పిచ్‌లపై మెక్‌గ్రాత్‌


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన అంటేనే బ్యాట్స్‌మెన్‌ వణికిపోతుంటారు. ఎందుకంటే అక్కడి బౌన్సీ పిచ్‌లపై బంతులను ఆడుతూ వికెట్‌ను కాపాడుకోవడం సాహసమే అవుతుంది. అందుకే  ఆ దేశంలో పర్యటించే జట్లు విజయంపై పెద్దగా ఆశలు పెట్టుకోవు. వాస్తవానికి ఆసీ్‌సలో ఓ టెస్టు సిరీస్‌ను గెలిచేం దుకు భారత్‌కు దశాబ్దాల కాలం పట్టడానికి కారణం కూడా ఈ పిచ్‌లే. అయితే ఇదంతా గతమని, ప్రస్తుతం తమ దేశంలో పిచ్‌లు మరీ భయపెట్టే విధంగా లేవని దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ చెబుతున్నాడు. ఇక కోహ్లీ ఒక్క టెస్టు మాత్రమే ఆడనుండడం కూడా భారత్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పాడు. భారత టూర్‌ సందర్భంగా మెక్‌గ్రాత్‌ చెప్పిన అంశాలు అతని మాటల్లోనే.. 


పిచ్‌లు:

గతంలోలాగా మా దగ్గర బౌన్సీ పిచ్‌లు లేవు. అయితే భారత్‌తో పోలిస్తే కాస్త వేగంగానే స్పందిస్తుంటాయి. భారత శిబిరంలో బౌన్స్‌పై ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా అయితే భయపడాల్సిందేమీ లేదు. 1993లో నా కెరీర్‌ ఆరంభమైనప్పుడు ఆసీ్‌సలో ప్రతీ స్టేడియానికి ఓ ప్రాధాన్యత ఉండేది. వాకా బౌన్స్‌కు, సిడ్నీ స్పిన్‌కు అనుకూలంగా ఉండగా, అడిలైడ్‌లో నాలుగు, ఐదోరోజు ఆటలో పిచ్‌ భిన్నంగా స్పందించేది. గాబాలో రివర్స్‌ స్వింగ్‌కు ఆటగాళ్లు కుదేలయ్యేవారు. అందుకే ఆసీస్‌ జట్టు అత్యంత పటిష్ఠంగా కనిపించేది. కానీ నా కెరీర్‌ చరమాంకంలో ఈ పరిస్థితి మారింది.


భారత్‌కు అనుకూలమే:

క్రితంసారి టీమిండియా ఆస్ర్టేలియాలో విజయవంతమైంది. ఇక్కడి పరిస్థితులు వారికి అలవాటే. ఐపీఎల్‌లో ఆసీస్‌ ఆటగాళ్లతో కలిసి చాలా క్రికెట్‌ ఆడారు. దీంతో ప్రత్యర్థి కూడా మామూలు జట్టేనన్న అభిప్రాయం నెలకొంటుంది. ఇక ఆసీస్‌లో భారత జట్టు డే అండ్‌ నైట్‌ టెస్టును తొలిసారిగా ఆడనుండడం ఆసక్తికరంగా ఉండనుంది. కోహ్లీ లేకపోయినా రహానె, పుజార, రాహుల్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే ఉంది.


మైండ్‌గేమ్‌ ముఖ్యం:

టెస్టు క్రికెట్‌లో మైండ్‌గేమ్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మానసికంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చూపాలి. అయితే ఇందుకు స్లెడ్జింగ్‌ను ఆశ్రయించడం తప్పు. దుర్భాషలాడడం కాకుండా కొంతవరకు ఎగతాళిగా మాట్లాడి అతడి ఏకాగ్రతను చెడగొట్టేలా ప్రయత్నించవచ్చు. అయితే కోహ్లీలాంటి ఆటగాళ్లు ఇందుకు మినహాయింపు. అతడిని రెచ్చగొడితే ఫలితం మరోలా ఉంటుంది.


ఆసీస్‌ పేసర్లతో పోలిస్తే:

ఇప్పటి బౌలర్ల మానసిక దృక్పథం విభిన్నంగా ఉంటోంది. చక్కటి పేస్‌తో కూడిన బంతులు వేస్తున్నారు. బుమ్రా తన రెండు, మూడో స్పెల్‌ను.. మొదటిదాని కన్నా వేగంగా వేస్తుంటాడు. షమి రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేయగలడు. అయితే స్టార్క్‌లాంటి లెఫ్టామ్‌ పేసర్లతో ఆసీస్‌ బౌలింగ్‌దళం భారత్‌కన్నా కాస్త ముందుంటుంది.