మెకాయ్‌ ‘సిక్సర్‌’

ABN , First Publish Date - 2022-08-02T09:03:26+05:30 IST

వెస్టిండీస్‌ లెఫ్టామ్‌ పేసర్‌ ఒబెడ్‌ మెకాయ్‌ (6/17) నిప్పులు చెరిగే బంతులతో భారత్‌ను వణికించాడు.

మెకాయ్‌ ‘సిక్సర్‌’

భారత్‌ 138 ఆలౌట్‌

విండీస్‌తో రెండో టీ20

నేడే మూడో టీ20


సెయింట్‌ కిట్స్‌: వెస్టిండీస్‌ లెఫ్టామ్‌ పేసర్‌ ఒబెడ్‌ మెకాయ్‌ (6/17) నిప్పులు చెరిగే బంతులతో భారత్‌ను వణికించాడు. టీ20ల్లో తమ జట్టు తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ కనబరిచిన అతడి ధాటికి రోహిత్‌ సేన 20 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్‌ (31), జడేజా (27), పంత్‌ (24) మాత్రమే రాణించారు. హోల్డర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇరు జట్ల ఆటగాళ్ల లగేజి ఆలస్యంగా చేరడంతో భారత కాలమాన ప్రకారం రాత్రి 11 గంటలకు మ్యాచ్‌ ఆరంభమైంది.  


తొలి బంతికే షాక్‌:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ను పేసర్‌ మెకాయ్‌ తొలి ఓవర్‌ నుంచి చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించాడు. మొదటి బంతికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మను గోల్డెన్‌ డకౌట్‌ చేయడంతో ఖాతా తెరువకుండానే జట్టు వికెట్‌ కోల్పోయింది. అయితే రెండో ఓవర్‌లో మరో ఓపెనర్‌ సూర్యకుమార్‌ (11), శ్రేయాస్‌ (10) చెరో సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టారు. కానీ మెకాయ్‌ ఆ జోరును ముందుకు సాగనీయలేదు. తన తర్వాతి ఓవర్‌లోనే  సూర్యను పెవిలియన్‌కు చేర్చాడు. స్వల్ప వ్యవధిలోనే శ్రేయాస్‌ కూడా అవుట్‌ కావడంతో జట్టు పవర్‌ప్లేలో 56 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఉన్న కాసేపు దూకుడుగా ఆడిన పంత్‌ (24) ఏడో ఓవర్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో  వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ హార్దిక్‌, జడేజా జోడీ కాసేపు విండీస్‌ బౌలర్లను ఎదుర్కొంది. ఐదో వికెట్‌కు వీరు 43 పరుగులను జోడించారు. 13 ఓవర్లలో స్కోరు వందకు చేరగా.. తర్వాతి ఓవర్‌లోనే హార్దిక్‌ను హోల్డర్‌ దెబ్బతీశాడు. ఇక డెత్‌ ఓవర్లలో పేసర్‌ మెకాయ్‌ సంచలన రీతిలో బౌలింగ్‌ చేశాడు. 17వ ఓవర్‌లో జడేజాను.. 19వ ఓవర్‌లో దినేశ్‌ కార్తీక్‌ (7), అశ్విన్‌ (10), భువనేశ్వర్‌ (1)లను అవుట్‌ చేయడంతో భారత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

Updated Date - 2022-08-02T09:03:26+05:30 IST