Abn logo
Aug 22 2020 @ 21:27PM

బాలూ అంటే.. ఎందుకింత అభిమానం?

వారం రోజులుగా జనాలందరూ బాలుగారి గురించి ఒకరినొకరు వాకబులు చేసుకుంటున్నారు. ఎలా వున్నారట, ఫర్వాలేదు కదా అంటూ. ఆయన మామూలుగా అయ్యేవరకు ఏదో గుబులు. ఆయన ఆసుపత్రిలోంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన రోజున యీ జనాలంతా విడిచే పేద్ద నిట్టూర్పుతో వాయుగుండం ఏర్పడుతుందేమో! కరోనా ఎవర్నీ వదిలిపెట్టటం లేదు. బాలూది కూడా అలాటి కేసే అనుకుని ఊరుకోవచ్చు కానీ ఊరుకోబుద్ధి కావటం లేదు. అది వారం, పదిరోజులు యిబ్బంది పెడుతుంది కానీ ప్రాణానికి హాని చేయదని మనందరికీ తెలుసు. అయినా యింత ఆందోళన చెందుతున్నామంటే, యీ స్థాయిలో తల్లడిల్లుతున్నామంటే, ప్రార్థనలు చేస్తున్నామంటే బాలూ మనతో మానసికంగా పెనవేసుకుని పోయాడనేగా అర్థం! బాలును రోగిగా మనం ఎప్పుడూ ఊహించలేదు. పేరుబలం వలన కాబోలు బంతిలా తుళ్లుతూ, ఫారెక్స్ బేబీలా నవ్వుతూ, ఆరోగ్యానికి కొండగుర్తుగా కనబడతారు. నవ్వుతూ, తుళ్లుతూ, జోకులేస్తూ, హుషారుగా, సందడిసందడిగా వుంటాడు. ఆయన వయసు ఛట్టున గుర్తుకు రాదు. ఘంటసాల గారి విషయంలో ‘ఫలానా పాట ఆయన పాడాల్సింది, కానీ అనారోగ్యం చేత పాడలేక పోయారు’ వంటి ఉదంతాలు వింటాం. అలాంటివి 74 ఏళ్ల బాలు విషయంలో ఎప్పుడూ వినలేదు. ఏ రోజూ ఖాళీగా వుండరు. 54 ఏళ్ల కెరియర్ యింకా సాగుతూనే వుంది. రిటైర్మెంటు కనుచూపు మేరలో లేదు. ఎందుకంటే ఆయనకు అనేక విద్యలు వచ్చు. ఏదో రకంగా ఎప్పుడూ డిమాండులో వుంటారు. ఎక్కడో ఒకచోట ఏదో ఒక సభను అలంకరించిన వార్తలు పేపర్లో వస్తూనే వుంటాయి. టీవీల పుణ్యమాని మన యింట్లోనే కళ్ల ముందే వుంటారు. మనతో ఆత్మీయంగా, ముఖాముఖీ సంభాషిస్తూనే వుంటాడు. అందుకే ఆయన ఆసుపత్రిలో మంచంపై వున్నాడంటే మనసు విలవిలలాడుతోంది.


ఘంటసాల దైవాంశ సంభూతుడనే ఫీలింగు గట్టిగా కలిగి మనం ఆయనను కాస్త దూరం నుంచే ఆరాధించాం. పేరు చివర ‘మాస్టారు’ అని చేర్చాం. బాలూ మాత్రం స్నేహితుడిలాగానే అనిపిస్తాడు. మేస్టారు కాదు, క్లాస్‌మేట్, మహా అయితే సీనియరు. గౌరవం, ప్రేమా వున్నాయి కానీ భయభక్తులు లేవు. బాలు పాడిన భగవద్గీత ఆవిష్కరణ సభలో ఓ వక్త అన్నారు – ‘ఘంటసాల పాడిన భగవద్గీత తండ్రి పాఠం చెప్పినట్లు వుంటే, బాలు పాడిన భగవద్గీత తల్లి లాలి పాడినట్లు వుంది’ అని. మనకు తండ్రి దగ్గర భయం వుంటుంది తప్ప తల్లి దగ్గర వుండేది చనువే కదా! ‘‘పాడుతా తీయగా’’, ‘‘స్వరాభిషేకం’’ వంటి ప్రోగ్రాముల్లో గాయనీగాయకులలో తప్పులు సవరించినప్పుడు తల్లిలా, చాలా సుతారంగా, వాళ్లు నొచ్చుకోకుండా చెప్పడం బాలు మార్కు. గాయకులందరూ యితరులలో లోపాలు కనిపెట్టలేరు. ఒక సంగీత దర్శకుడికి మాత్రమే గాయకుడు ఎక్కడ తప్పుదారి పట్టాడు అని గ్రహించే శ్రవణశక్తి వుంటుంది. బాలు సంగీతదర్శకుడే కాకుండా ఆర్కెస్ట్రా నిర్వాహకుడు కూడా. వేలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో ఔత్సాహిక గాయనీగాయకులకు, సంగీత కళాకారులకు అవకాశాలు కల్పించాడు. అందుకే టీవీ కార్యక్రమంలో పాల్గొన్నవారి పాటలో మనకు వినబడని దోషాలు ఆయన యిట్టే పట్టేస్తాడు. రీప్లే చేసి వినిపించినప్పుడే మనకు ‘ఔను కదూ’ అనిపిస్తుంది. తమ కళను మెరుగు పరచుకోవాలనుకునే వారికి యిది చక్కటి అవకాశం. అందుకే ఆయన ఎదురుగా పాడే అవకాశం వస్తే బాగుండునని అందరూ ఎదురు చూస్తారు. పాడేవాళ్లే కాదు, వాయిద్యకారులు కూడా. ఎందుకంటే వాళ్లనీ హైలైట్ చేస్తాడాయన. వలపక్షం చూపించాడని కాని, పరుషంగా మాట్లాడాడని కాని, నిరుత్సాహ పరచాడని కాని ఆయన మీద ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఫిర్యాదు చేసినవారు ఎవరూ లేరు.

ఇవి కూడా చదవండిImage Caption

ఈ యుగ గాయకుడు బాలు!పాడుతూ ఉండాలి తియ్యగా...

నిజానికి సినీపరిశ్రమ చాలాకాలం ఆయనను చిన్నచూపు చూసింది. ఘంటసాల ఆరోగ్యం దెబ్బ తిని పాడలేనప్పుడు ఆయన వారసుడిగా రామకృష్ణను అనుకున్నారు తప్ప బాలును అనుకోలేదు. ద్వితీయశ్రేణి నటుల్లో కొందరికి అప్పుడప్పుడు పాడే అవకాశం మాత్రమే వచ్చింది. తమిళంలో అనుకోకుండా ఎమ్‌జిఆర్ అవకాశం యిచ్చారు కానీ అక్కడ నిలదొక్కుకునే లోపున యేసుదాసు పాటలు ఎక్కువ హిట్‍ అయ్యాయి. దాంతో బాలు అక్కడా వెనకబడ్డాడు. తర్వాతి రోజుల్లో రామకృష్ణకు ఛాన్సులు తగ్గి బాలూకి వచ్చాయంటే బాలూ కృషి, పట్టుదలే కారణం అని గుర్తుంచుకోవాలి. వచ్చాక నిర్మాతలతో కానీ, సహగాయకులతో కానీ, సంగీతదర్శకులతో కానీ అహంభావంగా ప్రవర్తించినది లేదు. అప్పుడెప్పుడో నటుడు కృష్ణ గారితో, యిటీవల ఇళయరాజాతో వివాదం వచ్చినప్పుడు కూడా బాలు ఎంత హుందాగా స్పందించారో చూశాం.


తారస్థాయి చేరుకునేదాకా అప్పుడో పాట, ఇప్పుడో పాట వస్తూ వుంటే భుక్తి ఎలా గడుస్తుంది? ఊరూరా తిరిగి మ్యూజిక్ ప్రోగ్రాంలు యిచ్చేవాడు. అవకాశాలు రానప్పుడు ఘంటసాల నాటకాలు వేశారు. బాలు యిలా సంగీత విభావరులు నిర్వహించేవాడు. పిబి శ్రీనివాస్ అలాటి కార్యక్రమాలు పెట్టుకోకపోవడం చేతనే రావలసినంత కీర్తి తెచ్చుకోలేక పోయారనిపిస్తుంది. చిన్నచిన్న ఊళ్లు కూడా తిరుగుతూ ప్రదర్శనలు యివ్వడం మామూలు విషయం కాదు. చాలా శ్రమ పడాలి. ప్రయాణాలు, వాయిద్యాల రవాణా, అక్కడి సభ ఏర్పాట్లు, ఉండడానికి వసతులు నచ్చకపోయినా సర్దుకోవడాలు, అందర్నీ సమీకరించుకోవడాలు, అలకలు వస్తే సముదాయించు కోవడాలు, నిర్వాహకులకులతో వచ్చే డబ్బు యిబ్బందులు, టీమును నిలబెట్టుకోవడాలు.. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడియన్సు నాడి తెలుసుకుని కార్యక్రమాన్ని రక్తి కట్టించడాలు! చిన్నప్పుడు జీవనోపాధి కోసం ఊళ్లు తిరిగారంటే సరే అనుకోవచ్చు. 70 ఏళ్లు దాటాక కూడా ప్రజాహిత కార్యక్రమాల కోసం రమ్మనమంటే చిన్నచిన్న ఊళ్లు వెళ్లిన ఓపిక బాలూది!  చిన్నచిన్న సభలకు పిలిచినా ఏ బెట్టూ లేకుండా వస్తాడాయన.

ఈ టూర్లతో బాలు రాటు దేలాడు. బాలూకి వచ్చిన అనేక విద్యల్లో మ్యూజిక్‍ కంపోజింగ్‍ ఒకటి. తొలి రోజుల్లో బయట కచేరీలు యిచ్చేటప్పుడు తను పాడిన పాటలో కూడా ఏదో మార్పులు ప్రవేశపెట్టి ప్రజలనాడి తెలుసుకునేవాడు. సినిమాలో అయితే సంగీతదర్శకుడు చెప్పినట్లే పాడాలి. స్టేజి మీద కాస్త స్వేచ్ఛ తీసుకుని, మార్పులు చేసి, తన సృజనాత్మకతను చూపించి ఎక్కడో రాగం ఎక్కువగా తీసి, మరో మలుపు ఎక్కువ తిప్పి, పై సంగతి వేసి... ఏవేవో ప్రయోగాలు చేసేవాడు. భేష్ అనిపించుకునేవాడు. ఆర్థికంగా పెద్దగా లాభించిందో లేదో తెలియదు కానీ, పట్టణాల్లో ప్రదర్శనల కారణంగా బాలు జనసామాన్యంలోకి దూసుకుపోయాడు. అప్పట్లో ఘంటసాల ఎక్కడో సుదూరంగా మద్రాసులో వుండేవారు. ఈ బాలు అయితే మనింటి కుర్రాడిలా ప్రతీ పండగకు మనూరు వచ్చేసేవాడు. పందిళ్లలో పాడేసేవాడు. అందుకే ఆత్మీయత పెరిగిపోయింది. ఈ కార్యక్రమాల కారణంగా స్టేజ్‍ మీద ఎలా పెర్‍ఫార్మ్ చేయాలో బాగా వంటపట్టేసింది. అవతలివాళ్లను ప్రోత్సహించడం, లేదా సున్నితంగా విమర్శించడం, ఏమీ చేయలేనప్పుడు చిరునవ్వుతో సరిపెట్టడం, సభలో సదస్యులు క్రమశిక్షణతో లేనప్పుడు మెత్తగా చివాట్లు వేయడం - ఇలా రకరకాలుగా ఏ షోనైనా రక్తి కట్టించగల సత్తా వుంది ఆయనకు.  స్టేజ్‍క్రాఫ్ట్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనిపిస్తుంది. ఏది ఎంతవరకు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. తనే కాదు, పక్కవాళ్లు కూడా బాగా మాట్లాడేట్లు చూడగలడు. పాటకు వ్యాఖ్యానం ఏ పాళ్లలో వుండాలో చక్కగా తెలుసు. ఇక సమయస్ఫూర్తి, హాస్యచతురత అయితే చెప్పనే అక్కరలేదు. ఆయన పాడకపోయినా కంపియర్‍గా వున్నారన్నా సరే సభకు వెళ్లవచ్చు. ఇక టీవీకి వచ్చేసరికి హోస్ట్‌గా హీ ఈజ్‍ అల్టిమేట్. అందర్నీ కలుపుకుని పోతూ, మంచి టీము ఏర్పరుచుకుని, హోం వర్క్ చేసుకుని, అతిథుల గురించి, పాటల గురించి సందర్భోచితంగా ఎన్నో పాత సంగతులు, మధ్యమధ్యలో తెలుగు పద్యాలు, సూక్తులు, మంచిమాటలు, చెప్తూ శ్రోతలను ఎడ్యుకేట్‍ చేస్తూనే వుంటాడు. కనబడ్డ మంచి గురించి కాన్వాస్‍ చేస్తూనే వుంటాడు. టీవీ కార్యక్రమాల కారణంగా ఆయన పరిధి పెరుగుతూ పోయింది. పాటలే కాదు, మాటలు కూడా ఎలా వాడాలో ఆయనకు బాగా తెలుసు. ఏదైనా పద్ధతి ప్రకారం చేసే అలవాటు, మంచి టీముని మేన్‌టేన్‌ చేయగల నేర్పు ఉన్నాయి కాబట్టి విదేశీ పర్యటనలు చాలా చక్కగా ఆర్గనైజ్‍ చేయగలరట.


బాలుకు వున్న పరిశీలనాశక్తి, అనుకరణశక్తి వలన కారణంగా ప్రతి నటుడు తనకు బాలు పాడాలని అడగడం, ఆయనకు ఛాన్సులు పెరగడం జరిగింది. ఇది గ్రహించక కొంతమంది ఘంటసాల ఎందరో గాయకులకు అవకాశాలు యిచ్చారని బాలు తనే అన్ని పాటలూ పాడేసి తక్కినవాళ్లను తొక్కేశాడని అంటూంటారు. ప్రేక్షకుల అభిరుచి, నిర్మాతల యిష్టంపై యీ ఎంపికలు ఆధారపడి వుంటాయి తప్ప, ఒక గాయకుడు సాటి గాయకుణ్ని పక్కకు నెట్టేయలేడు. అంతెందుకు, బాలుకి గత కొన్నేళ్లగా సినిమాల్లో పాడే అవకాశాలు తగ్గిపోయాయి కదా, మరి ఆయన్ని ఎవరు తొక్కేశారందాం? అలాటాయన మంచం మీద నిస్సహాయంగా పడుక్కుని వున్నాడంటే దిగులు పుడుతోందందుకే!

బాలూగారిపై నేను విన్న మరో ఫిర్యాదు టీవీ తెరపై ఆయన కనబరిచే వినయం! ‘ఈయనేమిటండీ, అందర్నీ మామయ్యో, బాబయ్యో అంటాడు. వంగి నమస్కారాలు పెడతాడు. అంతా డ్రామా’ అనే వారున్నారు. ఆయన నిజజీవితంలో కూడా చాలా వినయవంతుడు. మర్యాదస్తుడు. అది నికార్సయిన వినయమే, అభినయం కాదు. మీకెలా తెలుసు అంటారేమో, నేను మద్రాసులో వుండే రోజుల్లో చిన్నచిన్న సభలకు, సమావేశాలకు అతిథిగా వచ్చినపుడు, ఆయన ప్రవర్తించే తీరు గమనించి వున్నాను. వేదికపై ఎవరికైనా కుర్చీ లేకపోతే లేచి ఆఫర్ చేసి తను నిల్చునేవాడు. అటుయిటూ మసలడంలో ఆడవాళ్లు ఏదైనా యిబ్బంది పడుతూంటే వెంటనే గమనించి, సర్దుబాట్లు చేసేవాడు. నాటక ప్రదర్శనలకు ఆలస్యంగా వచ్చిన సందర్భాల్లో గుట్టుగా వెనక్కి వెళ్లి కూర్చునేవాడు. నిర్వాహకులు వచ్చి ముందుకు రమ్మనమన్నా ఒప్పుకునేవాడు కాదు. ఇవన్నీ ఎవరో చూస్తున్నారనో, మర్నాడు పేపర్లో పడుతుందనో చేసిన పనులు కావు. స్వతహాగా వున్న సంస్కారం. చాలా బేలన్స్‌డ్‌గా వుండే మనిషి. ఆవేశకావేషాల ప్రదర్శన వుండదు. దేని గురించైనా మంచిచెడుల విచారించి ఒక అభిప్రాయానికి వస్తాడు తప్ప తొందరపాటు లేదు. ఆలోచనలో తూకం తప్పడు, మాట కూడా ఆచితూచి మాట్లాడతాడు. దూకుడు వుండదు. ప్రయివేటు సమావేశాల్లో అభిమానులు విరుచుకు పడిపోతున్నపుడు సైతం సంయమనం కోల్పోకుండా, ప్రతివారినీ పలకరిస్తూ ఒక పర్శనల్ టచ్ యివ్వడం ఆయన ప్రత్యేకత. పాటే కాదు, మాట కూడా శ్రావ్యంగా, ఎంతసేపు మాట్లాడినా వినసొంపుగా వుంటుంది. ఆయనతో ప్రయివేటుగా ఒకసారి కలిస్తే కలకాలం మనకు గుర్తుండిపోయేట్లా చేయగల ఘనత ఆయనది. ఆయన మాటలో స్వచ్ఛమైన తెలుగు వుంటుంది. ఏ జిల్లాయాస వినబడదు. ఆయనది నెల్లూరు జిల్లా, చదివినది చిత్తూరు జిల్లా. రెండు జిల్లాలకూ తమదైన యాస వుంది. కానీ ఆయన మాటలో యాస అస్సలు వుండదు. ఆయన ఉత్తరాలు కూడా చాలా బాగుంటాయి. పొందికగా, ఆచితూచి పదాలు వాడినట్టు, చక్కని చేతిరాతతో కలకాలం దాచుకునేట్టు వుంటాయి. అంత గట్టిగా ఎలా చెప్పగలవు అంటే నా దగ్గిర వున్నాయి కనుక!


దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఆయనకు నేను పరిచయమయ్యాను. ముళ్లపూడి వెంకటరమణ గారి సాహితీసర్వస్వం సంకలనాల ద్వారా, బాపురమణల ప్రస్తావన ద్వారా పరోక్షంగా తెలిశాను. మేం ‘హాసం’ పత్రిక నడిపేటప్పుడు ప్రత్యక్షంగా కలిశాను. ఆయనలో హాస్యం, సంగీతం రెండూ పుష్కలంగా వున్నాయి కాబట్టి ఆ రెండూ రంగరించిన ‘‘హాసం’’ పత్రిక ఆయనకు తెగ నచ్చేసింది. టేలెంటు ఎక్కడ వున్నా ప్రోత్సహించడంతో బాటు మంచిపనులకు చేయూత నివ్వడం ఆయన నైజం. అందుకే అనేక చారిటీ కార్యక్రమాల విరాళాల సేకరణకు ఉచితంగా ప్రోగ్రాంలు చేశారు, లాభాపేక్ష లేకుండా మంచి పుస్తకాలు ప్రచురించారు. ఇలాటి వ్యక్తి ‘‘హాసం’’ వంటి ప్రయత్నాన్ని హర్షించకుండా, ప్రోత్సహించకుండా ఎందుకుంటారు? ‘‘మీ పదసంపద’’ పేరుతో మా పత్రికలో ఒక శీర్షిక నిర్వహించారు. బాపుగారి గురించి మాకు వ్యాసాలు రాసి పంపారు. దొరికిన ప్రతి వేదికపైనా పత్రిక గురించి చెప్పేవారు. ఆ పబ్లిసిటీకి మేము ఆయనకు పైసా యివ్వలేదు. పుస్తకం కూడా ఆయన కాంప్లిమెంటరీగా తీసుకునేవాడు కాడు. పత్రికకు జీవిత చందా కట్టి తెప్పించుకునేవారు. ఆయనను బ్రాండ్ ఎంబాసిడర్‌గా వాడేసుకున్నాం. మా పబ్లిసిటీ బ్రోషర్ మీద ఆయన ఫోటో వేసేశాం.

‘‘హాసం’’ ద్వారానే పబ్లిషరైన మా వరప్రసాద్ (శాంతా బయోటెక్నిక్స్) బాలూకి పరిచయమయ్యారు. ఇద్దరి అభిరుచులూ ఒక్కటే. స్నేహస్వభావమూ గాఢమైనదే. పైగా నెల్లూరు కనక్షన్ వుంది. అందుకని వరప్రసాద్‌ను ఆప్యాయంగా ‘‘చిన్నబ్బయా’’ అంటూ నెల్లూరు యాసలో పిలుస్తూంటారు. వాళ్లిద్దరి కలయికతో ఎన్నో అద్భుతమైన సిడిలు రూపొందాయి, చాలా సత్కర్యాలు జరిగాయి. వరప్రసాద్ యింట్లో బాలుగారిని అనేకసార్లు కలిశాను. ఆంతరంగిక సమావేశాల్లో ఆయన బోల్డు కబుర్లు చెప్తారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి. వందలాది కళాకారుల గురించి అలవోకగా ఉదంతాలెన్నో చెప్పగలరు. ఆయన కబుర్లకు, పాటలకు పరవశించి పోయే బాపురమణలను చూడడం, మరపురాని దృశ్యం. ఆయనకు పెద్దలంటే గౌరవం వుంది. ప్రతిభావంతులను గుర్తుంచుకుని ఆదరించే స్వభావం వుంది. యువతరాన్ని ప్రోత్సహించే గుణం వుంది. హీ ఈజ్‍ జెమ్‍ ఆఫ్‍ ఏ మ్యాన్‍.


సినిమాలు తీసి, రికార్డింగు స్టూడియో నడుపుతూ, ప్రోగ్రాములు చేస్తూ ఎన్నో కుటుంబాలను పోషిస్తున్నారు. అజాతశత్రువు. ఆయన అందరి బాగు కోరే వ్యక్తి. అందుకే యావన్మంది ఆయన బాగుపడాలని, కుదుటపడాలని కోరుతున్నారు. ‘గాడ్ బ్లెస్ యూ’ అంటూ ఆయన ఊతపదాన్నే ఆయనకు అప్పచెపుతున్నారు.  తన గురించి యింత కాన్వాస్ చేసిన బాలుని దేవుడు క్షేమంగా, ఆరోగ్యంగా యింటికి తప్పక పంపిస్తాడు. ఆ పంపేదేదో త్వరగా పంపితే మన మనసు అంత త్వరగా కుదుటపడుతుంది. మన శ్రేయస్సు కోసమైనా ఆయన చప్పున కోలుకోవాలని మీ అందరితో బాటు నేనూ ప్రార్థిస్తున్నాను.

-ఎమ్బీయస్ ప్రసాద్

9849998139

[email protected]

Advertisement
Advertisement
Advertisement