నిరీక్షణ

ABN , First Publish Date - 2021-10-23T05:53:17+05:30 IST

నిరీక్షణ

నిరీక్షణ

నోటిఫికేషన్‌ ఇచ్చారు.. నియామకం మరిచారు..!

తొమ్మిది నెలలుగా ఏర్పాటు కాని కొత్త మీ సేవ కేంద్రాలు

జిల్లాలో 150 మంది నిరుద్యోగుల ఎదురుచూపులు


కేసముద్రం, అక్టోబరు 22 : వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ప్రజలకు అందుబాటులోకి చేర్చే మీసేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీ చేసి నెలలు గడుస్తున్నా ఏర్పాటు కావడం లేదు. జిల్లాలోని కురవి మండలం గుండ్రాతిమడుగు, గార్ల మండలం పుల్లూరు, కేసముద్రం మండలం కోరుకొండపల్లి, బయ్యారం మండల కేంద్రం, డోర్నకల్‌ మండలంలో ఉయ్యాలవాడ, డోర్నకల్‌, పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి, దంతాలపల్లి మండలం దాట్ల, తొర్రూరు మండలం హరిపిరాల, నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెంలలో కొత్తగా మీసేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది జనవరి 19న నోటిఫికేషన్‌ను జిల్లా అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు 18–35 ఏళ్ల వయస్ను ఉండి స్థానికులై డిగ్రీ ఉత్తీర్ణులై కంప్యూటర్‌ అవగాహన ఉండాలని అర్హతల్లో పేర్కొన్నారు. అదే నెల 20 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుదారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన మహబూబాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియామక పరీక్ష సైతం నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని ఔత్సాహిక డిగ్రీ చదివిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా అందులో 150 మందిని అర్హులుగా తేల్చారు.


తొమ్మిది నెలలుగా జాప్యం...

నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా ఫిబ్రవరి 4న దరఖాస్తులకు నియామక పరీక్ష నిర్వహించలేదు. కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు జిల్లా అధికారిక పోర్టల్‌లో సందేశాన్ని పెట్టారు. ఆనాటి నుంచి అభ్యర్థులు తమకు నియామక పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారోనని పడిగాపులుపడుతున్నారు. డిగ్రీలు చదివి ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తరుణంలో మీసేవా కేంద్రాల ఏర్పాటుతోనైనా ఉపాధిని పొందాలనుకున్న నిరుద్యోగులు ప్రభుత్వ జాప్యంపై నిరాశకు గురవుతున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ పరిశీలనలో ఉందని త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికైనా కొత్త మీసేవా కేంద్రాల ఏర్పాటును త్వరితగతిన చేపట్టి తమకు ఉపాధి కల్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-23T05:53:17+05:30 IST