Advertisement
Advertisement
Abn logo
Advertisement

నత్తే నయం

నూతన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ పూర్తయేదెన్నడో ?

మూడన్నర ఏళ్లుగా సాగుతున్న భవన నిర్మాణ పనులు 

పాలన అస్తవ్యస్తం

అరకొర వసతుల నడుమ విధుల నిర్వహణ

త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావలంటున్న ప్రజలు


మహబూబాబాద్‌ టౌన్‌, డిసెంబరు 7 : జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న కలెక్టర్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణాలు ఎప్పుడు పూర్తయి అందుబాటులోకి వస్తాయోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మూడున్నర ఏళ్ల కిందట పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో మహబూబాబాద్‌లో అట్టహాసంగా నూతన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌, జిల్లా పోలీ్‌స కార్యాలయం, మునిసిపల్‌ ఆఫీ్‌సల భవన నిర్మాణ  పనులకు శంకుస్థాపన చేశారు. మునిసిపల్‌, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు పిల్లర్ల దశలో ఆగిపోయి ఇటీవల కాలంలోనే మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక కురవి రోడ్‌లోని సాలార్‌ తండా సమీపంలో కలెక్టర్‌ కాంప్లెక్స్‌ పనులు మాత్రం మూడెళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.  ప్రారంభంలో నత్తనడకన నడిచిన నిర్మాణాలు ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలో భవనాలు పూర్తయి ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకున్నప్పటికి ఇక్కడా మాత్రం ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి. నూతన కలెక్టర్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణం పూర్తయితే అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోటకు రావడంతో అటు ఉద్యోగులు, ఇటు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండనుంది. త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 


2018 ఏప్రిల్‌ మాసంలో శంకుస్థాపన..

పాలనా సౌలభ్యం కోసం ప్రజల వద్దకే పాలన తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 11 అక్టోబరు 2016న విజయదశమి పర్వదినాన గిరిజన ప్రాబల్య మానుకోట నూతన జిల్లాగా ఆవిష్కృతమైంది. అప్పట్లో తాత్కాలికంగా పట్టణ శివార్లలో ఉన్న ఐటీడీఏ యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(వైటీసీ)భవనంలో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచే నేటి వరకు పాలన వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. అన్ని జిల్లా కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఒకే చోట ఉండాలనే సంకల్పంతో కలెక్టర్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రం శివారు సాలార్‌ తండా సమీపంలో 20.31 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 4 ఏప్రిల్‌ 2018న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీకృత కలెక్టర్‌ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వెంటనే వర్షాకాలం ఆరంభం కావడంతో ఆ సమయంలో వర్షాలు పడుతుండడంతో పిల్లర్ల పనులు జరుగుతున్న క్రమంలో వర్షపు నీళ్లు గుంతల్లో నిండడం, వాటిని మోటార్ల ద్వారా బయటకు తీసి పనులు కొనసాగించడంతో కొంత ఆలస్యమైంది. అవి మూడు సంవత్సరాలు పూర్తయి నాలుగో వసంతంలోకి అడుగిడినప్పటి వరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయి తప్ప పూర్తి కాలేదు.


భవన నిర్మాణాలు ఇలా...

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణానికి కురవి మార్గంలో ఉన్న సాలార్‌తండా సమీపంలో 21ఎకరాల 31 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించగా దాని నిర్మాణానికి రూ. 54.20 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. ఇందులో రెండు ఎకరాల రెండు గుంటల స్థలంలో పూర్తి స్థాయిలో భవనాన్ని నిర్మిస్తున్నారు. 33 శాఖల జిల్లా కార్యాలయాలు ఒకే చోట ఉండేలా జీప్లస్‌ 2 నిర్మాణాలు చేపడుతున్నారు. మొదటి అంతస్తులో దాదాపుగా 33 శాఖల జిల్లా కార్యాలయాలు వచ్చే విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. మిగతా 2.03 ఎకరాల్లో రోడ్లు, లాన్‌ ఏరియా (గ్రీనరీ కోసం) 2.19 ఎకరాలు, వెనుక భాగం పార్కింగ్‌, గ్రీనరీ కోసం 2.61 ఎకరాలు, ముందు భాగంలో పార్కింగ్‌, గ్రీనరీ ఏరియా 2.61 ఎకరాలు, ఆవరణలో ఖాళీ ప్రాంతం 30 గుంటలు, చుట్టు పక్కల సీసీ రోడ్ల కోసం 1.30 గుంటలు, రాక్‌ ఏరియా (గుట్టలు, బండలు) ఉన్న ప్రాంతం 7.22 ఎకరాలు ఉంది. 


కలెక్టరేట్‌  కాంప్లెక్స్‌ పూర్తయితేనే..

మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటు అయ్యాక కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మిగతా అన్ని శాఖల కార్యాలయాలకు మాత్రం అన్ని హంగులున్న భవనాలు లేకపోవడంతో ఐటీడీఏ పరిధిలోని ఇంగ్లీ్‌ష మీడియం పాఠశాల మూడు అంతస్థుల భవనం, దానికి సమీపంలోని పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌లో ఉన్న మూడు అంతస్థుల భవనం, వ్యవసాయ గోదాముల్లో శాఖ ఆఫీ్‌సలకు గదులను కేటాయించారు కొన్ని శాఖలు మాత్రం గతంలో ఉన్న డివిజన్‌ కార్యాలయాల్లో జిల్లా ఆఫీ్‌సలను నిర్వహిస్తున్నారు. ఒక్క భవనంలో ఐదు నుంచి ఆరు శాఖల కార్యాలయాలు ఉండడంతో ఇరుకు గదుల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వాటిలో కూడా కనీస వసతులు (మరుగు దొడ్లు) లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క జిల్లా కార్యాలయాలు కూడా ఒక్క చోట లేక పోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధులు అష్టకాష్టాలు పడుతున్నారు. జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ పనులు పూర్తయితే అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉంటాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నూతన కలెక్టరేట్‌ నిర్మాణ పనులు పూర్తయి అందుబాటులోకి వస్తేనే అందరి కష్టాలు తీరనున్నాయి. 


త్వరగా నిర్మాణాలు పూర్తిచేయాలి.. : సూర్నపు సోమయ్య, సీపీఎం మునిసిపల్‌  ఫ్లోర్‌ లీడర్‌, మహబూబాబాద్‌ 

నూతన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలు, ఉద్యోగుల ఇబ్బందులను తీర్చాలి. అన్ని శాఖల కార్యాలయాలకు భవనాలు సరిగ్గా లేకపోవడంతో ఇరుకు గదుల్లోనే విధులు నిర్వహిస్తూ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని జిల్లాల తరహాలోనే ఇక్కడ కూడా నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సేవలందించాలి.


ప్రజలు ఇబ్బంది పడుతున్నరు.. : డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు, మహబూబాబాద్‌

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. జిల్లా ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తైనప్పటికి నూతన కలెక్టర్‌ కాంప్లెక్స్‌ భవనం పూర్తికాకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఆయా శాఖల కార్యాలయాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తైతే అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండడం ద్వారా ప్రజల రవాణా ఇబ్బందులు తొలగుతాయి. 

Advertisement
Advertisement