Abn logo
Sep 26 2021 @ 23:46PM

నేడు భారత్‌ బంద్‌

మహబూబాబాద్‌ డిపో ఎదుట మాట్లాడుతున్న అఖిల పక్షం నాయకులు

రైతు వ్యతిరేక చట్టాలు, పెట్రో ధరల పెంపుపై నిరసన తెలుపనున్న విపక్షాలు

జిల్లాలో పాల్గొననున్న ఆరు పార్టీలు

విజయవంతం చేయడానికి మూడ్రోజుల ముందు నుంచే ప్రచారం


మహబూబాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : అన్నదాతలకు నష్టం కలిగే విధంగా కేంద్రం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను నిలిపివేయడంతో పాటు పెట్రోల్‌, డిజీల్‌, గ్యాస్‌ ధరలను తగ్గింపు కోసం సోమవారం దేశవ్యాప్త బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ పాలకపక్ష పార్టీలు మినహా.. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమంలో తమ నిరసనను తెలుపనున్నాయి. ఇందులోభాగంగా మానుకోట జిల్లాలో జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంతో పాటు టీడీపీ, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, తెలంగాణ జన సమితి పార్టీలు బంద్‌ పాల్గొనున్నాయి.


 విస్తృతంగా ప్రచారం..

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు చేపడుతూ.. కాలినడకన ప్రచారాన్ని నిర్వహిస్తూ.. షాపుల్లో కరపత్రాలను పంపిణీ చేసి భారత్‌బంద్‌కు సహకరించాలని ఆయా పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దుతోపాటు పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని, పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధించిన ఎక్సైజ్‌ డ్యూటీలు, సర్‌ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో బంద్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందు ఆదివారం నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువులను ప్రజలు కొనుగోలు చేశారు. ఎన్నడు లేనివిధంగా విపక్షాలన్ని ఒక్కతాటిపైకి వచ్చి ప్రచారం చేసి, భారత్‌బంద్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. 


సోమవారం ఉదయం విపక్ష పార్టీలన్నీ జిల్లా కేంద్రంతో పాటు తొర్రూరులోని బస్‌డిపోల వద్దకు చేరుకుని బస్సులను బయటకు వెళ్లనివ్వకుండా బైఠాయించి బంద్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత బైక్‌లపై ర్యాలీ నిర్వహిస్తూ బంద్‌ను పర్యవేక్షించనున్నారు. మరోపక్క విద్యార్థి సంఘాలు దీనికి మద్దతు తెలుపుతూ.. విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంఘీభావ ర్యాలీలు చేపట్టారు. మూడ్రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఆయా షాపుల యాజమానులూ స్వచ్ఛందంగా బంద్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎన్నడులేని విధం గా రైతు చట్టాలకు సంబంధించిన అంశంపై బంద్‌కు పిలుపునివ్వడంతో భారీగా మద్దతు లభిస్తోంది. అన్నివర్గాల ప్రజలు, ప్రజాసం ఘాలు మద్దతు ప్రకటించడంతో బంద్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


సీపీయూఎ్‌సఐ మద్దతు..

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ అఖిలపక్షాలు తలపెట్టిన భారత్‌బంద్‌కు ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (సీపీయూఎ్‌సఐ) మద్దతిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలంతా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న అఖిల పక్షం