Abn logo
Oct 18 2021 @ 23:34PM

మెడికల్‌ కళాశాల నిర్మాణాలు ఆపాలని..

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి రైతుల ఆందోళన

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి రైతుల ఆందోళన 

ఆరు గంటల పాటు ఉద్రిక్తత

మహబూబాబాద్‌ టౌన్‌, అక్టోబరు 18 : తమ భూముల్లో మెడికల్‌ కళాశాల నిర్మాణాలను నిలిపివేయాలని మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో గిరిజన మహిళా రైతులు సోమవారం వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ట్యాంక్‌ ఎక్కిన రైతులు దాదాపు ఆరు గంటల పాటు అక్కడే ఉండడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో కిందికి దిగడందో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌ బీసీ కాలనీ సమీపంలో మెడికల్‌ కళాశాల కోసం 551 సర్వే నంబర్‌లో రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించారు. అయితే  బాబునాయక్‌తండా, సాంక్రియాతండాలకు చెందిన గిరిజన రైతులు అది తమ భూమి అని న్యాయం చేయాలని ఆందోళనలు చేపడుతూవస్తూన్నారు. ఈక్రమంలో పనులను అడ్డుకోవడంతో పాటు ఇటీవల పట్టణంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దాదాపు నాలుగు గంటల తర్వాత కిందకి దిగారు. తాజాగా సోమవారం తమ భూముల్లో పనులు చేయవద్దని హైకోర్డును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నామని.. ఐనా అధికారులు పనులు చేస్తున్నారని మహిళా గిరిజన రైతులు అనసూయ, బానోత్‌ పద్మ, భారతి, బుజ్జి, మంగ, మంజుల, కమ్లి, పద్మలు అడ్డుకునేందుకు వెళ్లగా వారిని అరెస్టు చేసి బయ్యారం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మరో ఎనిమిది మంది మహిళా రైతులు భూక్య సరిత, రంగి, మల్లి, పద్మ, గాయత్రి, బుజ్జి, సరిత, అజ్మీర సునీత సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో జిల్లా ఆస్పత్రిలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కారు. విషయం తెలుసుకున్న టౌన్‌ సీఐ వెంకటరత్నం, ఎస్సై రమాదేవి అక్కడకు చేరుకుని వారితో మాట్లాడడంతో ఐదుగురు రైతులు సాయంత్రం నాలుగుగంటల ప్రాంతంలో కిందకు దిగారు. ఇందులో భూక్య సరిత, అజ్మీర సునిత, సరితలు మాత్రం రాత్రి 8గంటల వరకు ట్యాంక్‌పైనే ఉండి ఆందోళనను కొనసాగించారు. తమకు అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు దిగమని భీష్మించుకూర్చున్నారు. దీంతో జిల్లా ఆస్పత్రిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చివరకు వారు కూడా దిగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో మెడికల్‌ కళాశాల పనుల వద్ద విధుల ఆటంకం కల్పించిన, వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన గిరిజన మహిళలు 16 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.