కళ్లల్లో కారం చల్లి..

ABN , First Publish Date - 2022-01-21T05:38:18+05:30 IST

కళ్లల్లో కారం చల్లి..

కళ్లల్లో కారం చల్లి..
లక్‌పతి (ఫైల్‌)

వ్యక్తిని కడతేర్చిన దుండగులు

మానుకోటలో మటన్‌ వ్యాపారి దారుణ హత్య 

వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు

మహబూబాబాద్‌ రూరల్‌, జనవరి 20: మహబూబాబాద్‌ నడిబొడ్డున గురువారం ఉదయం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.  స్థానిక నందినగర్‌ కాలనీ వద్ద పక్కా ప్లాన్‌ ప్రకారం యువకుడి కంట్లో కారం చల్లి రాడ్‌, కర్రలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. మానుకోట టౌన్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపిన  వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శివారు సున్నపురాళ్ల తండాకు చెందిన బానోత్‌ లక్‌పతి (35)కి మహబూబాబాద్‌ పట్టణ శివారు గుండ్లబోడు తండాకు చెందిన నీలావతితో 2009లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఫాతిమా స్కూల్‌ సమీపంలో సొంత ఇంటిని నిర్మించుకుని నివాసముంటున్నారు. స్థానిక సర్వేపల్లి రాఽధాకృష్ణ విగ్రహం సమీపంలో మటన్‌ షాపును నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. 

అయితే లక్‌పతి యేడాది నుంచి సున్నపు రాళ్ల తండాకు చెందిన ఓ వివాహిత మహిళతో చనువుగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళను తొర్రూరులో ఓ ఇంటిలో ఉంచాడు. కేసముద్రంలో మరో మహిళతో చనువుగా ఉంటున్నట్లు సమాచారం. గతంలో కేసముద్రానికి చెందిన మహిళ బంధువులు లక్‌పతిపై దాడిచేయగా అప్పట్లో తప్పించుకుని బయటపడ్డాడు. తాజాగా సున్నపు రాళ్లకు చెందిన మహిళ భర్తతో పాటు నలుగురు బంధువులు గురువారం ఉదయం వేళలో లక్‌పతికి ఫోన్‌ చేసి తమకు మటన్‌ కావాలని, నందినగర్‌కు రావాలని కోరారు. వారిని గుర్తించని  లక్‌పతి మటన్‌ ఆర్డర్‌ కోసం ఫోన్‌ చేశారేమోనని తన బైక్‌పై నందినగర్‌కు చేరుకున్నాడు.  అక్కడ కాపు కాసి ఉన్న ఐదుగురు వ్యక్తులను చూసి  పారిపోయేందుకు ప్రయత్నించగా, దుండగులు ఆయన కళ్లలో కారం చల్లి ఇనుపరాడ్‌, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసి అక్కడ నుంచి పరారీ అయ్యారు. 

మహబూబాబాద్‌ డీఎస్పీ పి.సదయ్య, టౌన్‌ సీఐ వెంకటరత్నం, ఎస్సైలు రమాదేవి, రవి, క్రాంతికిరణ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని లక్‌పతి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసిం దా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా ? అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్‌పతి తండ్రి రాజ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ వెంకటరత్నం తెలిపారు. 

 

Updated Date - 2022-01-21T05:38:18+05:30 IST