మిర్చి ధర తగ్గించారని రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2022-01-22T05:42:39+05:30 IST

మిర్చి ధర తగ్గించారని రైతుల ఆందోళన

మిర్చి ధర తగ్గించారని రైతుల ఆందోళన
కేసముద్రంలో పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు

కేసముద్రం-తొర్రూరు రహదారిపై రాస్తారోకో 

శాంతింపజేసిన పోలీసులు

కేసముద్రం, జనవరి 21 : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో శుక్రవారం సుమారు 1200 బస్తాల మిర్చి  విక్రయానికి రాగా సాయంత్రం ఆలస్యంగా 4 గంటలకు బహిరంగ వేలం పాటలు ప్రారంభించారు. అయితే తొలుత కొద్ది రాశులకు వేలం పాటల్లో మిర్చి క్వింటాకు రూ.13,000 నుంచి రూ.14,000 మధ్యనే వ్యాపారులు ధరలు పెట్టారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నాటి మార్కెట్లో రూ.16,000 నుంచి రూ.17,000 ధరలతో కొనుగోలు చేయగా ఈ రోజు అమాంతం ధర తగ్గించి కొంటున్నారని ఆరోపించారు. యార్డులో ధర విషయంలో కొద్దిసేపు వివాదం నెలకొనడంతో వేలం పాటలు నిలిచిపోయాయి. అనంతరం రైతులు అదే ఆగ్రహంతో మా ర్కెట్‌ గేటు ఎదుటనున్న కేసముద్రం-తొర్రూరు, వరంగల్‌ రహదారిపై బైఠాయించారు. ఈ రాస్తారోకోలో మార్కెట్‌ కమిటీకి, వ్యాపారులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడు తూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో సరైన ధర పెట్టడంలేదని అన్నారు. ఇప్పటికే మిర్చి పంటలో తెగుళ్లతో, అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, వచ్చిన అరకొర దిగుబడిని మార్కెట్‌కు తీసుకువచ్చామని తెలిపారు. తీరా మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై అమాంతం క్వింటాకు రూ.2వేల చొప్పున ధర తగ్గించి వేలం పాటలు పాడుతుండడంతో తాము మరింత నష్టపోతామని తెలిపారు. ఈ రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రమే్‌షబాబు తన బృందంతో రాస్తారోకో ప్రాంతానికి చేరుకున్నారు. ఆయనతో రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. రైతులను శాంతింపజేసి ధర అధికంగా వచ్చే విధంగా మార్కెట్‌ పాలకులతో మాట్లాడుతానని రాస్తారోకో విరమించాలని సూచించారు. ఆ వెంటనే ఆందోళన చేస్తున్న రైతులను ఎస్‌ఐ తన వెంటబెట్టుకొని మార్కెట్లోకి తీసుకువెళ్లారు. అనంతరం జరిగిన వేలం పాటల్లో మిర్చికి కొంత ధర పెంచి నాణ్యతను బట్టి రూ.13,000 నుంచి రూ.16,500 మధ్యన ధరలతో ఖరీదులు చేశారు. 

Updated Date - 2022-01-22T05:42:39+05:30 IST