Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసముద్రం మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం

14వేల బస్తాల రాబడులు.. సగటు ధర రూ.1,700 నుంచి రూ.1,840

కేసముద్రం, నవంబరు 29: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం ధాన్యం రాబడులు పోటెత్తాయి. వర్షాల సూచనలతోపాటు రెండు రోజుల సెలవుల అనంతరం ఒక్కరోజే 14వేల బస్తాల ధాన్యం రాబడులు వచ్చాయి. ఈ మార్కెట్‌కు ధాన్యం సీజన్‌ ప్రారంభమై రెండు వారాలవుతుండగా గత సోమవారం 10వేల బస్తాలు విక్రయానికి రైతులు తీసుకురాగా, తాజాగా 13,989 బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చాయి. మార్కెట్‌కు కేవలం సన్నరకాలైన ఆర్‌ఎన్‌ఆర్‌, హెచ్‌ఎంటీ లాంటి రకాల ధాన్యమే రైతులు విక్రయానికి తీసుకువస్తున్నారు. ఎలకా్ట్రనిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌ (ఈ-నామ్‌) విధానంలోని ఈ-వేలంలో ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం క్వింటాకు గరిష్ఠంగా రూ.2089, కనిష్ఠంగా రూ.1089, సగటున రూ.1846, హెచ్‌ఎంటీ రకానికి గరిష్ఠంగా రూ.1888, కనిష్ఠంగా రూ.1549, సగటున రూ.1849 చొప్పున ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. సగటున అధిక సరుకు మాత్రం రూ.1700 నుంచి రూ.1840 వరకు ధరలతో కొనుగోలు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు ఏ గ్రేడ్‌ రకాలకు రూ.1960, కామన్‌ రకాలకు రూ.1940 ఉండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సన్న రకాలు పండించిన రైతులు అధిక శాతం మార్కెట్లోనే విక్రయిస్తుండడం గమనార్హం. దొడ్డు రకాల ధాన్యానికి మార్కెట్లో క్వింటాకు రూ.1200 నుంచి రూ.1300 వరకే ధరలు ఉండడంతో ఈ రకం ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండి అడపాదపడా చినుకులు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందారు.

 

Advertisement
Advertisement