ధాన్యం దిగుమతికి నో ఎంట్రీ

ABN , First Publish Date - 2021-06-13T05:49:11+05:30 IST

ధాన్యం దిగుమతికి నో ఎంట్రీ

ధాన్యం దిగుమతికి నో ఎంట్రీ
మార్కెట్‌ గేటు ఎదుట రాస్తారోకోతో స్తంభించిన వాహనాలు

కేసముద్రం మార్కెట్‌ గేటు ఎదుట రైతుల రాస్తారోకో

కేసముద్రం, జూన్‌ 12: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం దిగుమతికి నిరాకరించడంతో రైతులు గేటు ఎదుట శనివారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోయింది. పోలీసులు వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. వివరాలిలా ఉన్నాయి. 

మహబూబాద్‌ జిల్లా కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఖరీదు చేసిన ధాన్యాన్ని కేసముద్రంలోని బాలాజీ ఆగ్రోటెక్‌ ఇండస్ట్రీ్‌సకు కేటాయించారు. ఈ ధాన్యాన్ని సదరు మిల్లులో దిగుమతి చేసుకునేందుకు స్థలం లేక కొద్దిరోజులుగా మార్కెట్లోని కవర్‌షెడ్లలో దిగుమతి చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం మార్కెట్‌ మొదటి, రెండు గేట్లకు తాళాలు వేశారు. సా యంత్రం నుంచి వివిధ ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యం లోడుతో మార్కెట్లో దిగుమతి చేసేందుకు తరలివచ్చాయి. మార్కెట్‌ గేట్లు వేయడంతో రోడ్డువెంట వాహనాలు బారులు తీరాయి. ఇరువైపులా రోడ్డు వెంట దాదాపు కిలోమీటరు పొడవున ధా న్యం లోడుతో వాహనాలు నిలిచిపోయాయి. మార్కెట్‌ గేటు తెరిచి వాహనాలను మార్కెట్‌లోకి పంపించాలని రాత్రి నుంచి రైతులు కోరినప్పటికీ గేట్లు తెరవలేదు. మార్కెట్‌ షెడ్లు నిండితే రోజువారీ విక్రయానికి వచ్చే రైతుల సరుకులకు షెడ్లు సరిపోవనే కారణంతో గేట్లు తెరవలేదని తెలుస్తోంది. రాత్రంతా రోడ్డువెంట వాహనాలను నిలుపుకొని మూసి ఉన్న షాపుల అరుగులపై రైతులు నిద్రించారు. ఉదయం 10 గంటల వరకు మార్కెట్‌ గేట్లు తెరవకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తూ మొదటి గేటు ఎదుట రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. 

ఈ సందర్భంగా  రైతులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎండా, వానలతో ఇబ్బందులు పడ్డామని, తీరా ధాన్యం దిగుమతి వద్ద కూడా పడిగాపులు తప్పడంలేదని అన్నారు. వెంటనే గేట్లు తెరిచి ధాన్యం దిగుమతి చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ రాస్తారోకోతో ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు. మార్కెట్‌ వర్గాలతో మాట్లాడి గేట్లు తెరిపించడంతో వాహనాలన్నీ యార్డులోనికి వెళ్లడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

Updated Date - 2021-06-13T05:49:11+05:30 IST