Abn logo
Oct 23 2021 @ 00:14AM

రూ.అరకోటి కాజేసిన ఏటీఎం ఆపరేటర్లు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

 ఏటీఎంను తగులపెట్టించి.. సీసీ కెమెరాలో చిక్కిన దొంగలు

 రూ.6.70లక్షల నగదు... రూ.23 లక్షల ప్లాట్‌ల పత్రాల స్వాధీనం

 ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడి

మహబూబాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వినూత్న విధానాల దొంగతనాలు ఆరంభమయ్యాయి. అందులో భాగంగానే మహబూబాబాద్‌ జిల్లాలోని ప్రైవేట్‌ రైటర్‌ బిజినెస్‌ సర్వీస్‌ కంపెనీలో ఆపరేటర్లుగా చేరిన ముగ్గురు వివిధ ఏటీఎంలలో నగదు పెట్టే పనులు చేస్తూ చేతివాటం చూపారు. అవకాశం దొరికినప్పుడల్లా కొంత చొప్పున కొట్టెస్తూ దాదాపు రూ.అరకోటికి పైగా కాజేశారు. చివరికి ఈ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు జిల్లా కేంద్రంలోని ఓ ఏటీఎంను ఇతరులచే దగ్ధం చేయించి అధికారుల కళ్లల్లో దుమ్ము కొట్టాలని ప్రయత్నించారు. దగ్ధానికి పాల్పడ్డ వారు సీసీ కెమెరాలకు చిక్కడంతో విచారణలో అసలు దొంగల బండారం బయటపడింది. వారి నుంచి రూ.6.70 లక్షల నగదు, రూ.23 లక్షల విలువ చేసే ప్లాట్‌ కొనుగోలు చేసిన పత్రా లు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఈ వినూత్న దొంగతనం కేసు వివరాలను వెల్లడించారు. 

ఏటీఎంలో నగదు పెట్టే ముగ్గురు..

మహబూబాబాద్‌ మిలీ్ట్ర కాలనీకి చెందిన జడల నాగరాజు, ఽగూడూరు మండలం తీగలవేణికి చెందిన దరావత్‌ మహేష్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండల పెద్దకోర్పోలు గ్రామానికి చెందిన గై రాజేందర్‌లు జిల్లాలోని ప్రైవేట్‌ రైటర్‌ బిజినెస్‌ సర్వీస్‌ ఏటీఎం ఆపరేటర్లుగా పనుల్లో చేరారు. మహబూబాబాద్‌, కేసముద్రంలలోని యాక్సిస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ, ఎల్‌వీబీ, ఇండిక్యాష్‌, ఇండియా 1 ఏటీఎంలలో నగదు నింపేవారు. జడ ల నాగరాజు. గై రాజేందర్‌, నాలుగు సంవత్సరాల నుంచి, మహేష్‌ సంవత్సరం నుంచి ఏటీఎంలలో క్యాష్‌ నింపుతున్నారు. ప్రతినిత్యం పెద్దమొత్తంలో నగదు ఏటీఎంలలో ఫిల్‌ చేస్తున్న క్రమంలో అత్యాశకు పోయి వివి ధ ఏటీఎంలలో నగదు ఫిల్‌ చేస్తున్నప్పుడు కొంతకొంత సొంతానికి వాడుకుంటూ వచ్చారు. అలా రూ.52,59, 500లను కాజేశారు. ఇందులో అత్యధికంగా జడల నాగరాజు రూ.42 లక్షలు, గై రాజేందర్‌ రూ.9 లక్ష లు, దరావత్‌ మహేష్‌ రూ.1,59,500 సొంతానికి వాడుకున్నారు. 

కాజేసిన నేరం నుంచి తప్పుకోవడానికి..

ఏటీఎంలలో ప్రైవేట్‌ కంపెనీ ద్వారా నగదు భర్తీకి సంబంధించి మూడు నెలలకొకసారి ఆడిట్‌ జరుగుతుంది. అందులో కాజేసిన డబ్బు విషయం బయటపడకుండా ఎప్పటికప్పుడు ఈ ముగ్గురు జాగ్రత్త పడుతూ... వచ్చారు. తాజాగా ఆర్భీఐ బ్యాంకులకు ఇచ్చిన గైడ్‌లైన్స్‌లలో నో క్యాష్‌ బోర్డు పెట్టినప్పటి నుంచి 10 గంటల వరకు ఏటీఎంలకు సంబంధించిన బ్యాంకులకు ఫైన్‌ వేస్తామని స్పష్టం చేయడంతో ఈ దిశగా అధికారులు ఆడిట్‌ చేయడం ఆరంభించారు. ఈ క్రమంలోనే తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి ఈ నెల 13న మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి సమీపంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంను ఐదుగురికి కొంత నగదు ముట్టచెప్పి దగ్ధం చేయించారు. గుర్తుతెలియని వ్యక్తులచే ఏటీఎం దగకశం జరిగినట్టు బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో మహబూబాబాద్‌ టౌన్‌ సీఐ జె.వెంకటరత్నం, సీసీఎస్‌ సీఐ ఎ.వెంకటేశ్వర్‌రావు, టౌన్‌ ఎస్సై రమాదేవి, సిబ్బంది రంగంలో దిగారు. 

సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ఇలా..

మహబూబాబాద్‌లో ఏటీఎం దగ్ధం కేసులో విచారణ చేపట్టిన పోలీసులు ఏటీఎం సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. అందులో తెల్లవారుజామున ఐదుగురు వ్యక్తులు పెట్రోల్‌ నింపిన కవర్లను యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో పెట్టి దగ్ధం చేసినట్లు గుర్తించారు. ఈ కోణంలో దర్యాప్తు చేసి ఏటీఎం దగ్ధానికి పాల్పడిన జిల్లాలోని చిన్నగూడూరు మండలకేంద్రానికి చెందిన దాసరి కృష్ణప్రకాష్‌, స్థానిక ధర్మన్న కాలనీకి చెందిన లోకల్‌బోయిన సాయికుమార్‌, శనిగపురానికి చెందిన ఎడ్ల రాంచరణ్‌, తాళ్లపూసపల్లికి చెందిన గంగరబోయిన యశ్వంత్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా ఏటీఎం ఆపరేటర్లుగా పనిచేస్తూ రూ. అరకోటికి పైగా కొట్టేసిన అసలు దొంగల గుట్టు రట్టయింది. ఈ క్రమంలోనే ఈ నలుగురితో పాటు స్థానిక మిలీ్ట్ర కాలనీకి చెందిన ఏటీఎం ఆపరేటర్‌ జడల నాగరాజును అరెస్టు చేసి ఇతడి వద్ద నుంచి రూ.6.70లక్షల నగదు, రూ.23లక్షలు విలువ చేసే రెండు ప్లాట్‌ల ఖరీదు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎంలో డబ్బు కాజేసిన ఇతడి సహచరులు గూడూరు మండలం తీగలవేణికి చెందిన దరావత్‌ మహేష్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండల పెద్దకోర్పోలు గ్రామానికి చెందిన గై రాజేందర్‌తో పాటు ఏటీఎం దగ్ధానికి పాల్పడిన మరో నిందితుడు ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ప్రసాద్‌లు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును డీఎస్పీ సదయ్య నేతృత్వంలో చాకచక్యంగా ఛేదించిన టౌన్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం, సీసీఎస్‌ సీఐ ఎ.వెంకటేశ్వర్‌రావు, ఎస్సై రమాదేవితో పాటు సిబ్బంది ఉప్పలయ్య, సలీమ్‌, సుధాకర్‌లకు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి రివార్డులను అందజేసి అభినందించారు.