కొలువు రాలేదన్న బెంగతో ‘చితికి’ పోయాడు!

ABN , First Publish Date - 2021-11-17T13:56:29+05:30 IST

ఉద్యోగాలు రాక, నోటిఫికేషన్లు లేక..

కొలువు రాలేదన్న బెంగతో ‘చితికి’ పోయాడు!

ఎంబీఏ చదివినా ఉద్యోగం దొరక్క ఒకరు.. 

డిగ్రీ చదివి.. అప్పులపాలై మరొకరు..

పురుగుల మందు తాగి ఆత్మహత్య

జగిత్యాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఘటనలు


జగిత్యాలరూరల్‌/గండీడ్‌: ఉద్యోగాలు రాక, నోటిఫికేషన్లు లేక.. మనోవేదనతో ఇద్దరు యువకులు బలవంతంగా తనువులు చాలించారు. వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన చిర్ర లవణ్‌ కుమార్‌ (27) ఎంబీఏ చదివాడు.. మంచి ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏడాది కిందట దుబాయ్‌ కూడా వెళ్లాడు.. అక్కడా తన చదువుకు తగ్గ కొలువు దొరక్కపోవడంతో నిరాశగా వెనక్కి వచ్చేశాడు. ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నోటిఫికేషన్లూ జారీ చేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇటీవలే లవణ్‌ సోదరికి వివాహం చేయడంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదని లవణ్‌ ఈ నెల 14న తన కూరగాయల తోట వద్ద పురుగుల మందు తాగాడు. ఆ విషయాన్ని ఫోన్‌ ద్వారా బాబాయికి తెలిపాడు. వెంటనే లవణ్‌ను జగిత్యాలలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో కాంట్రాక్టు పద్ధతిలో అటెండర్‌ ఉద్యోగం చేస్తుండగా తల్లి లక్ష్మి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది.


మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం వెన్నచేడుకు చెందిన శ్రీకృష్ణ (24) నాయీబ్రాహ్మణుడు. కులవృత్తితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. తన డిగ్రీ చదువు కోసం, నాలుగేళ్ల కిందట తండ్రికి వైద్య చికిత్స నిమిత్తం మొత్తం రూ.4 లక్షలు అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదంటూ అన్న బందెయ్యతో చెప్పుకొని వాపోయేవాడు. తనకు ఉద్యోగం రాదని, అప్పులు తీరవని వేదన చెందేవాడు. ఆదివారం రాత్రి అన్నతో కలిసి భోజనం చేసి పొలానికి వెళ్లాడు. అదే రాత్రి 12 గంటల సమయంలో పురుగుల మందు తాగాడు. విషయాన్ని స్నేహితుడికి ఫోన్‌ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లగా.. అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీకృష్ణను వెంటనే గండీడ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుని అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-17T13:56:29+05:30 IST