ఎటువైపు వెళ్లాలి?

ABN , First Publish Date - 2020-03-04T05:56:54+05:30 IST

నేను ఎం.బీ.ఏ పూర్తి చేసి మూడేళ్లవుతోంది. మొదటి నుంచీ ఏదో ఒక వ్యాపారం చేయాలే తప్ప, ఉద్యోగం చేయకూడదనుకున్నా. కార్పొరేట్‌ వ్యవస్థలను చూస్తుంటే భయమేస్తోంది.

ఎటువైపు వెళ్లాలి?

నేను ఎం.బీ.ఏ పూర్తి చేసి మూడేళ్లవుతోంది. మొదటి నుంచీ ఏదో ఒక వ్యాపారం చేయాలే తప్ప, ఉద్యోగం చేయకూడదనుకున్నా. కార్పొరేట్‌ వ్యవస్థలను చూస్తుంటే భయమేస్తోంది. అన్ని రంగాల్లోకి ఈ వ్యవస్థలు చొరబడుతున్నాయి. ఈ స్థితిలో నాలాంటి ఒక సామాన్యురాలు వ్యాపార రంగంలోకి ప్రవేశించడం గానీ, అందులో నిలదొక్కుకోవడం గానీ సాఽధ్యమయ్యే పనేనా? ఏదో అనుకోవడమే తప్ప వ్యాపారపరంగా ఏమీ చేయలేనేమోనన్న ఆత్మన్యూనత క్రమక్రమంగా నాలో గూడుకట్టుకుంటోంది. దిగులూ, ఆందోళన పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక రకమైన స్తబ్దత నన్ను ఆవరించింది. ఎంతకూ కొలిక్కిరాని అంతర్మథనంతో ఏళ్లు గడిచిపోతున్నాయి. పైగా ఇంటా బయటా నెగెటివ్‌ వ్యాఖ్యలు చేస్తున్నారు. నాలోని స్తబ్ధతకు కారణమేమిటో, నేను వెళ్లాల్సిన మార్గమేమిటో మీరే సూచించండి.


- జి. సారిక, వైజాగ్‌


మీరన్నట్లు కార్పొరేట్‌ వ్యవస్థలు దూకుడుగా అన్ని రంగాల్లోకీ చొచ్చుకు వస్తున్నాయి. కాకపోతే వాటికి  తమదైన ఒక ఆలోచనా విధానం ఉంటుంది.  అయితే ఎక్కువ మంది తక్కువ ఉత్పత్తి చేసే రంగాల్లోకి గానీ, ఎక్కువ శ్రమతో తక్కువ లాభం వచ్చే రంగాల్లోకి గానీ కార్పొరేట్‌ సంస్థలు వెళ్లవు. వెళ్లలేవు కూడా. ఉదాహరణకు చేనేత వస్త్రాల పనిలోకి అవి ఎప్పుడూ వెళ్లవు. ఎందుకంటే అక్కడ ఎక్కువ శ్రమ... తక్కువ ఉత్పత్తి, తక్కువ లాభం ఉంటాయి. అలాగే సృజనాత్మకతే ప్రధాన స్థానంలో ఉండే రంగాల్లోకి కూడా వెళ్లవు. వాటిల్లోకి వెళితే పెద్దగా లాభాలు ఉండవనీ, ఆ మాటకొస్తే నష్టాల పాలయ్యే అవకాశాలే ఎక్కువనీ వాటికి బాగా తెలుసు. అయితే కార్పొరేట్‌ వ్యవస్థలు దూరంగా ఉంచే అలాంటి రంగాల్లోకి  ప్రవేశించడంలోనే సామాన్యుల వివేకం ఉంది. భారీ లాభాలు ఆశించకపోవడమే కాదు, సాధారణ జీవనం లభించినా చాలనుకోవడం వల్ల  వీరు ఇక్కడ నిలబడతారు. తక్కువ ఉత్పత్తి, తక్కువ లాభాలు వచ్చినా సరిపెట్టుకుంటారు. ఆ తత్వమే ఈ రంగాల్లో నిలదొక్కుకునేలా చేస్తుంది. అందువల్ల కార్పొరేట్‌ రంగాలు దూసుకు వచ్చేస్తున్నాయని కంగారు పడకుండా, తమకు అందుబాటుటో ఉన్న రంగాల్లో అడుగుమోపాలి. మీరు ఏ రకమైన వ్యాపారం చేయాలనుకుంటున్నారో స్పష్టత ఉందా? ఒకవేళ మీకు స్పష్టత ఉంటే, ఆ రంగంలో కొంత అనుభవం సంపాదించడం ముఖ్యం. ఆ అనుభవం కోసమైనా, అదే తరహా వ్యాపారం చేసే ఏదైనా ఒక కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేయక తప్పదు మరి!!   


- డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి

కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - 2020-03-04T05:56:54+05:30 IST