మేయర్‌ అభ్యర్థి?

ABN , First Publish Date - 2021-03-04T06:50:32+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. మేయర్‌ అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించకపోవడంతో ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు.

మేయర్‌ అభ్యర్థి?

వైసీపీలో చర్చ
ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వని అధిష్ఠానం
బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో పెరిగిన ఆశావహులు
రేస్‌లో వంశీకృష్ణ, శరగడం, తిప్పల వంశీరెడ్డి
మహిళ అభ్యర్థిని పరిశీలించే అవకాశం ఉందంటున్న మరో వర్గం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. మేయర్‌ అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించకపోవడంతో ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు. మేయర్‌ పీఠం ఈసారి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆ వర్గానికి చెందిన సీనియర్‌ నేతలు కొంతమంది తమకు అవకాశం వస్తుందనే ఆశతో ఉండగా, ఉన్నత విద్యనభ్యసించిన బీసీ మహిళను అధిష్ఠానం పరిశీలిస్తోందనే ప్రచారం కొత్తగా మొదలైంది.
జీవీఎంసీకి 14 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. మేయర్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. దీంతో వైసీపీలో ఆ కేటగిరీకి చెందిన కీలక నేతలు కొందరు మేయర్‌ పదవిపై కన్నేశారు. అందుకోసమే కార్పొరేటర్లుగా బరిలోకి దిగుతున్నారు. అయితే 98 వార్డులకు కార్పొరేటర్‌ అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం మేయర్‌ అభ్యర్థి ఎవరనే విషయం వెల్లడించలేదు. కార్పొరేటర్‌ అభ్యర్థుల్లో ఆర్థిక స్థోమత లేని వారికి సహాయం చేయాలని ఎవరికీ సూచించలేదు. దీంతో ఎవరికీ కూడా భరోసా దక్కలేదనే పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ జనరల్‌ కావడంతో ఆ కేటగిరీకి చెందిన సీహెచ్‌ వంశీకృష్ణశ్రీనివాస్‌ (21వ వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థి), శరగడం చిన్నఅప్పలనాయుడు (96వ వార్డు అభ్యర్థి), తిప్పల వంశీరెడ్డి (74వ వార్డు అభ్యర్థి) వంటి వారంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరికి అధిష్ఠానం నుంచి ఎలాంటి సంకేతాలు ఇప్పటివరకూ అందకపోవడంతో తమకు అవకా శం దక్కుతుందో...లేదోనన్న ఆందోళనతో ఉన్నారు. ఇదిలావుండగా ఉన్నత
విద్యనభ్యసించిన బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం వున్నట్టు ఒక వర్గం నేతలు చెబుతున్నారు. ఆ కోణంలో పరిశీలిస్తే తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేస్తున్న కోరుకొండ వెంకటరత్నస్వాతితోపాటు 12వ వార్డు నుంచి
పోటీ చేస్తున్న అక్కరమాని రోహిణి, 75వ వార్డు నుంచి పోటీచేస్తున్న తిప్పల ఎమిలీ జ్వాల
రేసులోకి వస్తారంటున్నారు. మరొకవర్గం మాత్రం బీసీ కేటగిరిలో సీనియర్‌ నేతకు మేయర్‌ పీఠం
కట్టబెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా మేయర్‌ అభ్యర్థి ఎవరనే దానిపై
అధికార పార్టీలో నేతలు, అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొందనే చెప్పుకోవచ్చు.

Updated Date - 2021-03-04T06:50:32+05:30 IST