అనుకున్నదొక్కటి..!

ABN , First Publish Date - 2022-04-08T16:11:11+05:30 IST

‘ఏ పని చేయమన్నా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అగ్రిమెంట్‌ జరిగినా పనులు చేయడం లేదు. బకాయిలు చెల్లించే ప్రయత్నం చేయండి

అనుకున్నదొక్కటి..!

కౌన్సిల్‌ కోసం సమావేశం

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్న కార్పొరేటర్లు

సర్దిచెప్పిన మేయర్‌ విజయలక్ష్మి


హైదరాబాద్‌ సిటీ: ‘ఏ పని చేయమన్నా బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అగ్రిమెంట్‌ జరిగినా పనులు చేయడం లేదు. బకాయిలు చెల్లించే ప్రయత్నం చేయండి’ అని పలువురు కార్పొరేటర్లు మేయర్‌ విజయలక్ష్మికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12న గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో గురువారం జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో ఆమె సమావేశమయ్యారు. కౌన్సిల్‌ మీటింగ్‌లో ఎలా మాట్లాడాలి, బడ్జెట్‌పై చర్చ జరిగే సమయంలో అధికార పక్షంగా మన వాణి ఎలా వినిపించాలనే దానిపై అవగాహన కల్పించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6,150 కోట్లతో బడ్జెట్‌ ప్రవేశ పెడ్తున్నామని, ఇందులో రహదారులు, పారిశుధ్య నిర్వహణ, హరితహారం తదితర అంశాలకు ఎన్ని నిధులు కేటాయించామనేది వివరించారు.


 కౌన్సిల్‌లో ప్రతిపక్ష పార్టీల సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు సమర్థవంతంగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మేయర్‌ ముందస్తు సమావేశం ఏర్పాటు చేయగా.. సొంత పార్టీ కార్పొరేటర్లు తమ గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, లింక్‌/మిస్సింగ్‌ రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నారు కానీ.. ఆస్తుల సేకరణ కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయని, దీంతో పనులపై ప్రభావం పడుతుందని ఓ కార్పొరేటర్‌ పేర్కొన్నారు. కొన్ని నెలలకు సంబంధించిన బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన అనంతరం హైదరాబాద్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఆ నిధులొస్తే ఆర్థిక కష్టాలు తీరుతాయని విజయలక్ష్మి సర్ధిచెప్పినట్టు సమాచారం. 


పార్టీ సమావేశానికి అధికారులు

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్ల సమావేశానికి అధికారులు హాజరవడం చర్చనీయాంశమైంది. కమిషనర్‌ లోకే్‌షకుమార్‌తోపాటు ఆర్థిక విభాగం అదనపు కమిషనర్‌ సంస్థలోని ఏడు అంతస్తులో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లకు బడ్జెట్‌పై అవగాహన కల్పించేందుకు తమ వంతు సాయం చేశారు. కాగా, పార్టీ కార్పొరేటర్ల సమావేశంలో అధికారులు పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-04-08T16:11:11+05:30 IST