మేయర్స్‌ మెరుపుల్‌..

ABN , First Publish Date - 2022-08-03T09:53:58+05:30 IST

భారత్‌తో మూడో టీ20లో వెస్టిండీస్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73) అర్ధసెంచరీతో రాణించడంతో పాటు కీలక భాగస్వామ్యాలతో జట్టు భారీ స్కోరుకు..

మేయర్స్‌ మెరుపుల్‌..

50 బంతుల్లో 73

విండీస్‌ 164/5

భారత్‌తో మూడో టీ20


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: భారత్‌తో మూడో టీ20లో వెస్టిండీస్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73) అర్ధసెంచరీతో రాణించడంతో పాటు కీలక భాగస్వామ్యాలతో జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా విండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.  భువనేశ్వర్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ఛేదనలో భారత్‌ దీటుగానే స్పందిస్తోంది. కడపటి వార్తలందేసరికి 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. క్రీజులో పంత్‌ (26), హార్దిక్‌ పాండ్యా (4) ఉన్నారు. సూర్యకుమార్‌ 76, శ్రేయాస్‌ 24 పరుగులు చేశారు. కెప్టెన్‌ రోహిత్‌ రెండో ఓవర్‌లోనే గాయంతో వెనుదిరిగాడు.


శుభారంభం: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ ఇన్నింగ్స్‌ ధాటిగా సాగింది. ఓపెనర్‌ మేయర్స్‌ భారత బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ బౌండరీలతో హోరెత్తించాడు. అయితే మధ్యలో తడబడినా.. ఆఖర్లో చెలరేగిన విండీస్‌ స్కోరును 160 దాటించగలిగింది. హుడా, భువీ ధాటికి తొలి రెండు ఓవర్లలో ఆరు పరుగులే వచ్చినా.. అవేశ్‌ను లక్ష్యంగా చేసుకున్న మేయర్స్‌ మూడో ఓవర్‌లో 4,6తో 15 రన్స్‌ సాధించడంతో స్కోరులో కదలిక వచ్చింది. తర్వాతి ఓవర్‌లోనే అతడు మరో రెండు ఫోర్లతో సత్తా చాటాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు సాధించింది. అటు బంతికో పరుగు చొప్పున సాధించిన మరో ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (20) 8వ ఓవర్‌లో హార్దిక్‌కు చిక్కడంతో తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం హార్దిక్‌, అశ్విన్‌ మధ్య ఓవర్లలో ఎక్స్‌ట్రా బౌన్స్‌ను వినియోగించుకుంటూ పరుగులను కట్టడి చేశారు. 13వ ఓవర్‌లో సిక్సర్‌తో మేయర్స్‌ 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.


అవేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో పూరన్‌ (22) ఫోర్‌, మేయర్స్‌ రెండు ఫోర్లతో విండీస్‌ కాస్త పుంజుకుంది. అటు సిక్సర్‌తో జోరు మీదున్న పూరన్‌ను భువనేశ్వర్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈక్రమంలో డెత్‌ ఓవర్లలో మేయర్స్‌ వేగం పెంచి 17వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌ బాదినా.. అదే ఓవర్‌లో అవుటయ్యాడు. భువీ ఈ కీలక వికెట్‌ తీశాడు. అయితే చివరి రెండు ఓవర్లలో   హెట్‌మయెర్‌ (20), పావెల్‌ (23) జోడీ చెలరేగింది. 19వ ఓవర్‌ (అవేశ్‌)లో హెట్‌మయెర్‌ రెండు సిక్సర్లతో 17 రన్స్‌ రాబట్టగా.. ఆఖరి ఓవర్‌లో పావెల్‌ తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచి అవుటయ్యాడు. అలాగే ఐదో బంతికి హెట్‌మయెర్‌ రనౌట్‌ కాగా మొత్తం పది పరుగులు రావడంతో విండీస్‌ ఈ పిచ్‌పై పటిష్ట స్కోరునే సాధించగలిగింది. 


Updated Date - 2022-08-03T09:53:58+05:30 IST