Petrol and Diesel Price : రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి : మాయావతి

ABN , First Publish Date - 2022-05-22T18:32:53+05:30 IST

పెట్రోలు, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాన్ని

Petrol and Diesel Price : రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి : మాయావతి

లక్నో : పెట్రోలు, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ను తక్షణమే తగ్గించడం ఉత్తర ప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాల కర్తవ్యమని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి అన్నారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగంతో బాధపడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలం తర్వాత కాస్త ఉపశమనం కల్పించిందని చెప్పారు. 


పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తున్నామని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) శనివారం చెప్పిన సంగతి తెలిసిందే. పెట్రోలుపై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.8 చొప్పున, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు., రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం వల్ల ఇంధనం ధరలు పెరుగుతున్నాయని, ఆ ధరలకు కళ్ళెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించాలని నిర్ణయించిందని చెప్పారు.  పెట్రోలియం ఉత్పత్తులపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT)ని తగ్గించి, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 2021 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినప్పటికీ సామాన్య ప్రజలకు ఆ మేరకు ఉపశమనం కల్పించని రాష్ట్రాలు కూడా ఈసారి ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయాలని కోరారు. 


ఈ నేపథ్యంలో మాయావతి (Mayawati) ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, చాలా కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించిందన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఒత్తిడి కారణంగా దయనీయమైన జీవితాలను గడపక తప్పని పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు పెట్రోలు, డీజిల్‌లపై సుంకాలను తగ్గించడం ద్వారా కాస్త ఉపశమనం కల్పించిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ సలహాను పాటిస్తూ, వీటిపై వ్యాట్‌ను తక్షణమే తగ్గించడం ఉత్తర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు. 


అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలను త్యాగం చేసి, జాతీయ సమస్యలపై దృష్టి పెట్టాలని మరొక ట్వీట్‌లో మాయావతి కోరారు. జాతీయ సమస్యలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయన్నారు. జీవనం సాధారణ స్థితికి చేరుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-05-22T18:32:53+05:30 IST