బీఎస్పీ తదుపరి చీఫ్‌పై మాయావతి క్లారిటీ

ABN , First Publish Date - 2021-08-30T18:28:56+05:30 IST

శుక్రవారం పార్టీ విలేకర్లతో ఆమె మాట్లాడారు. బీఎస్పీకి కాబోయే అధ్యక్షులు సతీష్ చంద్ర మిశ్రాయేనా అని ప్రశ్నించగా కాబోయే అధినేత దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయి ఉంటారని, పార్టీకి, తనకు అన్ని సమయాల్లో అండగా ఉంటూ పార్టీని

బీఎస్పీ తదుపరి చీఫ్‌పై మాయావతి క్లారిటీ

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీకి మాయావతి తర్వాత కాబోయే అధినేత ఎవరనే దానిపై రెండేళ్లుగా చర్చ జరుగుతోంది. మాయావతి తొందరలోనే అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని నూతన అధినేతను ప్రకటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీఎస్పీకి తదుపరి నేతను, ప్రకటించున్నారా? ప్రకటిస్తే ఎవరిని ప్రకటిస్తారనే ప్రశ్నలకు పార్టీ సుప్రెమో మాయావతి సమాధానం ఇచ్చారు. తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని, తన ఆరోగ్యం సహకరించని రోజున పార్టీకి నూతన అధినేతను ప్రకటించనున్నట్లు ఆమె క్లారిటీ ఇచ్చారు. పార్టీ స్థాపకులు కాన్షీరాం సైతం తన ఆరోగ్యం సహకరించని సమయంలోనే తనను పార్టీ అధినేతగా ప్రకటించారని ఆమె గుర్తు చేశారు.


శుక్రవారం పార్టీ విలేకర్లతో ఆమె మాట్లాడారు. బీఎస్పీకి కాబోయే అధ్యక్షులు సతీష్ చంద్ర మిశ్రాయేనా అని ప్రశ్నించగా కాబోయే అధినేత దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయి ఉంటారని, పార్టీకి, తనకు అన్ని సమయాల్లో అండగా ఉంటూ పార్టీని నడిపించే సమర్థులకు పగ్గాలు అప్పగించనున్నట్లు ఆమె స్పష్టతనిచ్చారు. ‘‘నా ఆరోగ్యం బాగుంది. ఇలాంటి సమయంలో అధ్యక్ష స్థానం నుంచి నేను తప్పుకుని ఇంకొకరిని ప్రకటించాల్సిన అవసరం ఏముంది? నా ఆరోగ్యం సహకరించనప్పుడు నూతన అధినేత వస్తారు. పగ్గాలు ఎవరికి ఇవ్వాలనేది కూడా అప్పుడే నిర్ణయం అవుతుంది. కాబోయే అధినేత ఎవరనేది పబ్లిక్‌గా ముందుగానే చెప్తాం. నా ఆరోగ్యం సహరించినంత వరకు పార్టీ కోసం పని చేస్తూనే ఉంటాను. దానికి చాలా సంవత్సరాల సమయం పట్టొచ్చు’’ అని మాయావతి అన్నారు.


ప్రస్తుతం మాయావతి వయసు 65 సంవత్సరాలు. అయితే ఆమెకు వయసైందని, త్వరలోనే బహుజన్ సమాజ్ పార్టీకి నూతన అధ్యక్షులు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా పార్టీ పగ్గాలు తీసుకోనున్నారనే ప్రచారం కూడా ఓవైపు కొనసాగుతోంది. మరోపక్క ఆమె మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ముందుకు తీసుకురానున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, పార్టీని నడిపించగల సమర్థులకే పగ్గాలు అప్పగిస్తామని, అది కూడా దళిత వర్గాల వారికే ఇస్తామని మాయావతి స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-30T18:28:56+05:30 IST