Abn logo
Feb 17 2020 @ 05:05AM

ప్రాక్టీస్‌ ఓకే..

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీ్‌సకు ముందు భారత జట్టుకు చక్కని మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించినట్టయుంది. మొదటి రోజు బ్యాటింగ్‌లో విఫలమైనా ఆ తర్వాత ట్రాక్‌లోకి వచ్చిన జట్టు అన్ని రంగాల్లో అదరగొట్టింది. బౌలర్లు మురిపించినట్టే ఆఖరి రోజు బ్యాట్స్‌మెన్‌ కూడా నిలకడ ప్రదర్శించారు. ముఖ్యంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ‘బర్త్‌డే బాయ్‌’ మయాంక్‌ అగర్వాల్‌, రిషభ్‌ పంత్‌ పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ అర్ధసెంచరీలు సాధించడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఊరటనిచ్చింది.


మయాంక్‌, పంత్‌ అర్ధసెంచరీలు

భారత్‌-కివీ్‌స లెవెన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా


హామిల్టన్‌: న్యూజిలాండ్‌ లెవెన్‌తో జరిగిన మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌ను భారత్‌ డ్రాగా ముగించింది. ఆదివారం మూడో, చివరి రోజు ఆటలో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (81 రిటైర్డ్‌ అవుట్‌), రిషభ్‌ పంత్‌ (70) బ్యాట్లు ఝుళిపించారు. దీంతో ఆట ముగిసేసరికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో 4 వికెట్లకు 252 పరుగులు చేసింది. గత వరుస 11 ఇన్నింగ్స్‌ల్లో (లిస్ట్‌-ఎ, ఫస్ట్‌క్లాస్‌, వన్డేలు) కనీసం 40 పరుగుల మార్క్‌ను కూడా దాటని మయాంక్‌కు తాజా ఇన్నింగ్స్‌తో ఆత్మవిశ్వాసం లభించినట్టయింది. మిచెల్‌కు మూడు వికెట్లు దక్కాయి. కెప్టెన్‌ కోహ్లీ రెండు సెషన్లలోనూ బ్యాటింగ్‌కు దిగలేదు.


శతక భాగస్వామ్యం: 59/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఆరంభంలోనే చకచకా రెండు వికెట్లను కోల్పోయింది. తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాక పదో ఓవర్‌లో ఓపెనర్‌ పృథ్వీ షా (39)ను మిచెల్‌ బౌల్డ్‌ చేయగా కొద్దిసేపటికే శుభ్‌మన్‌ గిల్‌ (8)ను కూడా అతడే ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌లో విఫలమైన గిల్‌ ఓపెనింగ్‌ పోటీ నుంచి తప్పుకొన్నట్టే. ఈ దశలో ఆదివారం 29వ పుట్టిన రోజు జరుపుకొన్న మయాంక్‌ చక్కటి ఫుట్‌వర్క్‌తో బ్యాటింగ్‌ కొనసాగించాడు. పేసర్ల బౌలింగ్‌లో డ్రైవ్స్‌, పుల్‌ షాట్లతో ఆకట్టుకున్నాడు. అతడికి పంత్‌ చక్కటి ఆటతీరుతో అండగా నిలిచారు. ఆరంభంలో పంత్‌ నిదానం ప్రదర్శించినా అటు మయాంక్‌ బౌండరీలతో చెలరేగి 56 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కాస్త కుదురుకున్నాక పంత్‌ కూడా తన సహజశైలిలో బ్యాట్‌ ఝుళిపిస్తూ సోధీ వేసిన ఇన్నింగ్స్‌ 27వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. మూడో వికెట్‌కు మయాంక్‌, పంత్‌ 100 పరుగులు జోడించారు. అయితే లంచ్‌ విరామం తర్వాత మయాంక్‌ పెవిలియన్‌కే పరిమితం కాగా సాహా బరిలోకి దిగాడు. అటు పంత్‌ మాత్రం తన దూకుడును కొనసాగిస్తూ రెండో సెషన్‌ ఆరంభ ఓవర్‌లోనే మరోసారి రెండు వరుస సిక్సర్లతో 53 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే మిచెల్‌ ఓవర్‌లోనే క్లీవర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. చివరకు రెండో సెషన్‌లో 16 ఓవర్ల ఆట తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు డ్రాగాకు అంగీకరించడంతో మ్యాచ్‌ ముగిసింది. సాహా (30), అశ్విన్‌ (16) అజేయంగా మిగిలారు. 


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 263

కివీస్‌ లెవెన్‌ తొలి ఇన్నింగ్స్‌: 235

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) మిచెల్‌ 39; మయాంక్‌ (రిటైర్డ్‌అవుట్‌) 81; శుభ్‌మన్‌ గిల్‌ (ఎల్బీ) మిచెల్‌ 8; రిషభ్‌ పంత్‌ (సి) క్లీవర్‌ (బి) మిచెల్‌ 70; సాహా (నాటౌట్‌) 30; అశ్విన్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 48 ఓవర్లలో 252/4. వికెట్ల పతనం: 1-72, 2-82, 3-182, 4-216. 

బౌలింగ్‌: టిక్నెర్‌ 3-0-19-0; కుగెలిన్‌ 12-0-81-0; జాన్‌స్టన్‌ 4-0-18-0; మిచెల్‌ 9-2-33-3; నీషమ్‌ 6-1-29-0; సోధీ 5-0-32-0; కూపర్‌ 3-0-27-0; బ్రూస్‌ 5-1-8-0; ఆలెన్‌ 1-1-0-0.

Advertisement
Advertisement
Advertisement