మాయాజాలం

ABN , First Publish Date - 2021-04-11T06:16:09+05:30 IST

బియ్యం వ్యాపారుల మాయాజాలంతో ప్రజలు మోసపోతున్నారు. నాణ్యత తక్కువ ఉన్న బియ్యానికి వివిధ బ్రాండ్‌ పేర్లతో ఎక్కువ ధరకు విక్రయించడం, తూకంలో ప్రమాణాలు పాటించకపోవడంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

మాయాజాలం

- నాణ్యత తక్కువ.. ధర ఎక్కువ

- తూకంలో మోసం

- బియ్యం వ్యాపారుల దగా

జగిత్యాల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): కొందరు బియ్యం వ్యాపారుల మాయాజాలంతో ప్రజలు మోసపోతున్నారు. నాణ్యత తక్కువ ఉన్న బియ్యానికి వివిధ బ్రాండ్‌ పేర్లతో ఎక్కువ ధరకు విక్రయించడం, తూకంలో ప్రమాణాలు పాటించకపోవడంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొంతమంది వ్యాపారులు నాణ్యమైన బియ్యం పేరిట సాధారణ బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మార్కెట్లో మంచి పేరున్న బ్రాండెడ్‌ కవర్లలో ఈ బియ్యాన్ని నింపి విక్రయాలు జరుపుతున్నారు. 

తూకంలో తేడాలు

 సాధారణంగా 25 కిలోల చొప్పన బస్తాలో నింపి విక్రయాలు జరుపుతుంటారు. ఇందులో సుమారు కిలో నుంచి రెండు కిలోల తూకం తక్కువగా  వస్తోందని వినయోగదారులు ఆరోపిస్తున్నారు. సన్నరకాల బియ్యం సుమారుగా క్వింటాలుకు రూ.4,000 నుంచి రూ. 5,000 వరకు ధర పలుకుతోంది. 25 కిలోల బస్తాకు రూ.1000 నుంచి రూ.1250 వరకు ఉంటుంది. ఇందులో కిలో నుంచి రెండు కిలోలు తక్కువ వస్తుండడంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. తూకంలో మోసాన్ని గుర్తించాలనుకున్నా బియ్యం బస్తాలపై బ్యాచ్‌ నంబరు, ధర, ప్యాకేజీ డేట్‌, రైస్‌ మిల్లు పేరు, ఇతర వివరాలు ముంద్రించి ఉండటం లేదు. తూకంలో మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నప్పటికీ తూనికలు, కొలతల శాఖాధికారులు గానీ, ఇతర అధికారులు గానీ చర్యలు తీసుకుంటున్న సందర్భాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 

బియ్యం ఒకటే... పేర్లు వేరు..

స్థానికంగా మర పట్టించిన ధాన్యాన్ని వివిధ బ్రాండ్ల పేరుతో ముంద్రించిన సంచుల్లో బియ్యం నింపి ప్యాక్‌ చేస్తున్నారు. ఆ బియ్యాన్ని వ్యాపారులు చెప్పిన బ్రాండ్‌ చెందినవిగా నమ్మి మోసపోవాల్సి వస్తోంది. పదుల సంఖ్యలో హోల్‌సేల్‌ వ్యాపారం చేస్తున్న కొందరు వ్యక్తులు ఇటువంటి మాయాజాలానికి పాల్పడుతున్నారు. 

 నాణ్యతలోనూ తేడా

కొందరు వ్యాపారులు దొడ్డు రకం బియ్యాన్ని సన్నరకాలుగా అమ్మి వినియోగదారుల నెత్తిన కుచ్చుటోపి పెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు వ్యాపారులు తక్కువ ధర ఉన్న బియ్యంను ఎక్కువ ధర ఉన్న వాటితో కలిపి విక్రయిస్తున్నారు. మరో వైపు కొందరు హైబ్రిడ్‌ ధాన్యం బీపీటీ బియ్యంలాగా చెలామణి చేస్తున్నారు. హైబ్రిడ్‌ బియ్యాన్ని మరపట్టించిన తరువాత చూడటానికి బీపీటీ బియ్యంలా కనిపించినా వాస్తవానికి వీటి ధర బీపీటీ బియ్యంతో పోల్చితే క్వింటాలుకు రూ.400 నుంచి రూ.500 వరకు తక్కువగా ఉంటుంది. 

Updated Date - 2021-04-11T06:16:09+05:30 IST