మావోలకు గట్టి దెబ్బ

ABN , First Publish Date - 2022-06-29T05:35:25+05:30 IST

ఏజెన్సీలో గతంలో జీకేవీధి, చింతపల్లి, మండలాల్లో మావోయిస్టు కార్యకలాపాలను కోరుకొండ ఏరియా కమిటీ, అలాగే పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల్లో కార్యకలాపాలను పెదబయలు ఏరియా కమిటీ నిర్వహిస్తుండేవి.

మావోలకు గట్టి దెబ్బ
డీఐజీ హరికృష్ణ వద్ద లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు, సానుభూతిపరులు

- ఏవోబీలో ఉనికి కోల్పోయిన పెదబయలు ఏరియా కమిటీ 

- విశాఖ రేంజ్‌ డీఐజీ ముందు 33 మంది మావోయిస్టు సభ్యులు, 27 మంది మిలీషియా సభ్యులు లొంగుబాటు 

- పెదబయలు- కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి అశోక్‌ అరెస్టు 

- మావోయిస్టులకు స్థావరంగా ఉన్న కోండ్రూంపై పట్టు సాధించిన పోలీసులు 

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా ఉండే పెదబయలు ఏరియా కమిటీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ కమిటీ ఇప్పుడు ఉనికి కోల్పోయే స్థితికి చేరింది. ప్రస్తుతం పెదబయలు- కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్న వంతాల రామకృష్ణ అలియాస్‌ అశోక్‌ అరెస్టు కావడంతోపాటు పెదబయలు ఏరియా కమిటీ సభ్యులైన 33 మంది, వారికి సహకరిస్తున్న మరో 27 మంది సానుభూతిపరులు సైతం మంగళవారం విశాఖ రేంజ్‌ డీఐజీ హరికృష్ణ వద్ద లొంగిపోయారు. దీంతో పెదబయలు- కోరుకొండ ఏరియా కమిటీ పరిధిలో మావోయిస్టులకు చెందిన వారే లేని పరిస్థితిని పోలీసులు కల్పించారు. 

                     (పాడేరు- ఆంధ్రజ్యోతి) 

ఏజెన్సీలో గతంలో జీకేవీధి, చింతపల్లి, మండలాల్లో మావోయిస్టు కార్యకలాపాలను కోరుకొండ ఏరియా కమిటీ, అలాగే పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల్లో కార్యకలాపాలను పెదబయలు ఏరియా కమిటీ నిర్వహిస్తుండేవి. మూడేళ్ల క్రితమే కోరుకొండ ఏరియా కమిటీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో పెదబయలు- కోరుకొండ ఏరియా పేరిట పెదబయలు ఏరియా కమిటీ కార్యకలాపాలు సాగిస్తున్నది. దీంతో పోలీసులు పెదబయలు- కోరుకొండ ఏరియా కమిటీపై ప్రత్యేక దృష్టిసారించడంలో భాగంగా గాలింపులు, మావోయిస్టుల కదలికపై నిఘా పెంచారు. గ్రామ సందర్శనలు, పరివర్తన వంటి కార్యక్రమాలతో పోలీసులు గిరిజనులకు చేరువ కావడంతో, క్రమంగా వారంతా మావోయిస్టులకు దూరమవుతున్నారు. అందువల్లే ఎన్నడూ లేని విధంగా పెదబయలు మండలం ఇంజెరి పంచాయతీ పరిసర ప్రాంతానికి చెందిన మావోయిస్టు సభ్యులు, సానుభూతిపరులు 60 మంది పోలీసులకు లొంగిపోయారని తెలుస్తున్నది.

కోండ్రూం గ్రామంపై పోలీసుల పట్టు 

పెదబయలు మండలం ఇంజెరి పంచాయతీ పరిధి కోండ్రూం గ్రామం ఏవోబీలోని మావోయిస్టులకు కంచుకోట వంటిది. అటువంటి గ్రామంపై ప్రస్తుతం పోలీసులు పూర్తిగా పట్టుసాధించారు. పెదబయలు(కోరుకొండ) ఏరియా కమిటీ కార్యదర్శిగా దశాబ్దకాలం పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన చిక్కుడు చిన్నారావు అలియాస్‌ సుధీర్‌ స్వగ్రామం కోండ్రూం కావడంతో అదే గ్రామం నుంచి పదుల సంఖ్యలో గిరిజనులు మావోయిస్టు పార్టీలో పని చేస్తున్నారు. అలాగే కోండ్రూం గ్రామంతోపాటు సమీపంలోని ననాబరి, జుముడాం, రసరాయి, జడిగుడ, బొరికపసన, తగ్గుపాడు గ్రామాలకు చెందిన గిరిజనులు సైతం మావోయిస్టు పార్టీలో సభ్యులు, కీలక మిలీషియా సభ్యులుగా ఉన్నారు. దీంతో పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లో మావోయిస్టు కార్యకలాపాలను ఉధృతం చేశారు. చింతపల్లి వైపున్న కోరుకొండ ఏరియా కమిటీ నిర్వీర్యం కావడంతో అక్కడ కార్యకలాపాలను పెదబయలు ఏరియా కమిటీకే అప్పగించారు. దీంతో కార్యదర్శి సుధీర్‌ ఏజెన్సీలో కీలక నేతగా మారాడు. సుధీర్‌ను కట్టడి చేస్తేనే విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు పార్టీకి అడ్డుకట్ట వేయగలమని భావించిన పోలీసులు అతనిని టార్గెట్‌ చేశారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం పెదబయలు ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్న చిక్కుడు చిన్నారావు అలియాస్‌ సుధీర్‌ అనూహ్యంగా పోలీసులకు లొంగిపోయారు. అది మొదలు పెదబయలు- కోరుకొండ ఏరియా కమిటీ పరిధిలోని మావోయిస్టులు, వారి సానుభూతిపరులు క్రమంగా లొంగుబాట పడుతున్నారు. అప్పటి వరకు ఏరియా కమిటీలో సీనియర్‌ సభ్యుడిగా ఉన్న వంతాల రామకృష్ణ అలియాస్‌ అశోక్‌ పెదబయలు- కోరుకొండ ఏరియా కమిటీకి  కార్యదర్శిగా నియమితులయ్యాడు. దీంతో పోలీసులు అశోక్‌పై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలో తాజాగా అశోక్‌ను అరెస్టు చేయడం, పెదబయలు ప్రాంతానికి చెందిన మావోయిస్టు పార్టీకి సభ్యులుగా, సానుభూతిపరులుగా ఉంటున్న 60 మంది గిరిజనులు పోలీసులకు లొంగిపోవడంతో ఆ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-06-29T05:35:25+05:30 IST