Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాతగోడలు

మట్టి రాలిపోయి ఇటుకలూడిపోయి

కూలిపోకుండ నిలబడ్డ

నినాదాల పిడికిళ్లు - పాతగోడలు


శిథిలగోడలే అనుకుంటాం కానీ

నినాదాలు హోరెత్తిన ప్రచార కేంద్రాలు -


అడివిలెక్కడో పుట్టిన నినాదం

ఊర్లకొచ్చి వాడలకొచ్చి సిటీ మెయిన్‌ రోడ్‌ 

     గోడలమీద


ఎరుపెక్కిన అక్షరమై

సమాంతర శాసనమై హడలెత్తించిన గోడలవి -


ఆ గోడలమీది రాతలు పోస్టర్లు 

వార్నింగ్లు బ్యానర్లు

ఇట్టే క్షణాల్లో పాకిపోయి

అప్రకటిత యుద్ధమేదో ముందస్తు ప్రకటించిన 

          యుద్ధ వాతావరణాన్ని తలపించేది!

ప్రజలమౌనం రాజ్యమేలేది -

అంతటా భయం కాని భయం

గుబులు కాని గుబులు

ఎప్పుడేమైతదో చెప్పలేని

ఉక్కిరిబిక్కిరి ఉత్సుకత ఉత్కంఠ -


గతాన్ని సమాధిచేసిన వర్తమానం

భవిష్యత్తుకై పరుగుపెడ్తున్న రోడ్డుపక్కన

పిట్టల రెట్టలతో అట్టుకట్టిన గోడలు

రెట్టల్లోంచి మొలుచుకొచ్చిన మర్రిమొక్కలు

మొక్కల కొమ్మలకు ఏలాడుతున్న పక్షుల గూళ్లు

రంగు ఎలిసి కూలిన సగం గోడమీద

సగం సగం కనిపిస్తున్న మలిగీ మలగని నినాదం

దశాబ్దాల పురా విప్లవాన్ని 

          ఇంకా యాద్‌ జేస్తున్నది -


పాతగోడ

దుమ్ముపట్టి తూట్లుపడి 

పెచ్చులూడి మట్టిరాలుతూ

ఎన్కౌంటరైన వీరుని శిథిలదేహం లెక్క

పూర్తిగా సమాధికాని ఊపిరి -

అన్వర్‌

98660 89066


Advertisement
Advertisement