సంగంగోపాలపురంలో.. ఆగని మట్టి దందా

ABN , First Publish Date - 2021-06-16T05:21:24+05:30 IST

యడ్లపాడు మండలంలో గ్రావెల్‌ మాఫియా చెలరేగిపోతోంది. ప్రజాప్రతినిధుల అండతో పాటు అధికార యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడంతో మండలంలో మట్టి దందా ఆగడం లేదు.

సంగంగోపాలపురంలో.. ఆగని మట్టి దందా
సంగంగోపాలపురం ప్రభుత్వ భూముల్లో తాజాగా తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రాంతం

చోద్యం చూస్తున్న అధికారులు

సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు

యడ్లపాడు, జూన్‌ 15 : యడ్లపాడు మండలంలో గ్రావెల్‌ మాఫియా చెలరేగిపోతోంది. ప్రజాప్రతినిధుల అండతో పాటు అధికార యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడంతో మండలంలో మట్టి దందా ఆగడం లేదు. మట్టి తవ్వకాలను లాభసాటి వ్యాపారంగా మార్చుకున్న కొందరు అధికార పార్టీ నాయకులు నిరంతరం తవ్వకాలు చేస్తూ భారీగా సొమ్ముచేసుకుంటున్నారు.


తవ్వకాలతో చెరువులుగా మారుతున్న భూములు..

మండలంలోని పలు ప్రాంతాల్లో తరచూ మట్టి తవ్వకాలు సాగిస్తున్నా సంగంగోపాలపురం గ్రామపరిధిలో తవ్వకాలు అధికంగా సాగుతున్నాయి. ఇక్కడ వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిలో సింహభాగం దశాబ్దాల కిందట ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని పేదలకు ప్రభుత్వం పంపిణీచేసింది. నాణ్యమైన ఎర్ర గరప నేలలు కావడంతో అధికారపార్టీలోని కొందరి నేతల చూపు వాటిపై పడింది. భూ యజమానులకు నామమాత్రపు సొమ్ము చెల్లించి భూములను స్వాధీనం చేసుకోగా, ఇష్టపడని వారి భూములను బెదిరించి మరీ తవ్వకాలు సాగిస్తున్నారు. వందల సంఖ్యలో టిప్పర్ల కొద్దీ గ్రావెల్‌ను తవ్వి తరలిస్తుండడంతో ఇక్కడి ప్రభుత్వ భూములు చెరువులుగా మారుతున్నాయి. సుమారు పదెకరాల విస్తీర్ణంలో ఇప్పటికే తవ్వకాలు నిర్వహించిన అక్రమార్కులు తాజాగా మరో ఐదెకరాలలో 25నుంచి 30 అడుగుల లోతున తవ్వకాలు సాగిస్తున్నారు. అధికారులకు ఇబ్బంది లేకుండా రాత్రివేళల్లో, సెలవు దినాల్లో తవ్వకాలు అధికంగా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


టిప్పర్‌ గ్రావెల్‌ ప్రస్తుతం రూ.7,500

గతంలో టిప్పర్‌ గ్రావెల్‌ను దూరాన్ని బట్టి రూ.4వేల నుంచి రూ.6 వేలకు విక్రయించేవారు. ప్రస్తుతం రూ.6వేల నుంచి రూ.7,500లకు విక్రయిస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోరు, ఎలాంటి రాయల్టీ చెల్లించరు. దీనితో విలువైన ప్రభుత్వ భూములు చెరువులుగా మారడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.


ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే తవ్వకాలు..

నియోజకవర్గంలోని పలు ప్రాంతాలతోపాటు మండలంలోని సంగంగోపాలపురం ప్రభుత్వ భూముల్లో నిర్వహిస్తున్న తవ్వకాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. సంగంగోపాలపురంలో తవ్వకాలు యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థి ముక్తా వాసు ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు పైకి చెబుతున్నా తెరవెనుక అసలు సూత్రధారి ఇటీవల చిలకలూరిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలుపొందిన ఎమ్మెల్యే బంధువు ఉన్నట్లు సమాచారం. ఆయన కనుసన్నల్లోనే ఈ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  మట్టి విక్రయాలతో వచ్చిన ఆదాయంలో అధికభాగం ప్రజాప్రతినిధి బంధువుకే చేరుతోందని, చెడ్డపేరు మాత్రం తనకు వస్తోందని తెర ముందుండి నడిపిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధి ఇటీవల తన స్నేహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. 


ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు: విష్ణువర్ధనరావు, మైనింగ్‌ ఏడీ

యడ్లపాడు మండలంలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. పని ఒత్తిడి, సిబ్బంది లేకపోవడంతో చర్యలు తీసుకోలేకపోతున్నాం. తవ్వకాలు అడ్డుకుని, సీజ్‌ చేసే అధికారం స్థానిక రెవెన్యూ అధికారులకూ ఉంది. సీజ్‌ చేసి సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. 


విచారించి చర్యలు తీసుకుంటాం: శ్రీనివాసరావు, తహసీల్దార్‌, యడ్లపాడు 

సంగంగోపాలపురంలో తవ్వకాలు నిర్వహిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం.

  

కరకట్టకే ముప్పు!

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

ముక్తేశ్వరస్వామి ఆలయం సమీపంలో మట్టి తరలింపు

గతంలో వరదల సమయంలో కరకట్టకు కోత

పట్టించుకోని ఆర్‌సీ అధికారులు


రేపల్లె, జూన్‌ 15: తీర ప్రాంతంలోని కృష్ణానది ఒడ్డున దక్షిణకాశీగా పేరొందిన మోర్తోట ముక్తేశ్వరస్వామి ఆలయం సమీపంలో అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రేపల్లె మండలంలోని కృష్ణానది ఒడ్డున మోర్తోట, చోడాయపాలెం, బొబ్బర్లంక ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీని కారణంగా వరదల సమయంలో కరకట్ట కోతలకు గురయ్యే ప్రమాదం ఉంది. గతంలో ఓలేరు పల్లెపాలెం సమీపంలో కృష్ణా కరకట్టతెగి లక్షలాది ఎకరాలు, గృహాలు నీట మునిగాయి. వరదలు వచ్చిన సమయంలోనే కృష్ణారివర్‌ అధారిటీ అదికారులు హడావుడిచేసి తర్వాత  పట్టించుకోలేదు. గత నెల రోజులుగా పెనుమూడి నుంచి గంగడిపాలెం మధ్యలో పలు ప్రాంతాల్లో కృష్ణానది ఒడ్డున అధికార పార్టీ నాయకులు వేలాది ట్రాక్టర్ల మట్టి తవ్వకాలు జరుపుతూ లక్షలాది రూపాయాలు సొమ్ము చేసుకుంటున్నారు. కృష్ణా కరకట్ట వెంబడి పెట్రోలింగ్‌ చేస్తూ పటిష్టతను పట్టించుకోవలసిన ఆర్‌సీ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా రివర్‌ ఏఈ పల్నాడు ప్రాంతంలో నివాసం ఉంటూ రెండు నెలలకు, మూడు నెలలకు ఒకసారి వచ్చి చూసి వెళుతుంటారు. ఫోన్‌ ద్వారా ఆర్‌సీ ఏఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదంటూ ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. ఇలా తవ్వుకుంటూ పోతే రానున్న రోజులలో మోర్తోట ముక్తేశ్వరస్వామి దేవాలయాయానికి, కృష్ణా కరకట్టకు పెనుప్రమాదం సంభవించే పరిస్థితి నెలకొందంటూ ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. మట్టి ట్రాక్టర్‌ రూ.1200 నుంచి రూ.1500 వరకు అమ్ముకంటూ జగనన్నకాలనీకి ఈ మట్టినే తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై కృష్ణా రివర్‌ డీఈ భానుబాబు ను వివరణ కోరగా మట్టి తవ్వకాలు తమ దృష్టికి వచ్చాయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Updated Date - 2021-06-16T05:21:24+05:30 IST