చెరువుల్లో మట్టి మాయం..

ABN , First Publish Date - 2022-05-26T04:28:54+05:30 IST

జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు చెలరేగిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా రూ.కోట్ల విలువైన మట్టి చెరువుల్లో నుంచి తరలిపోతోంది. తమ వెనుక పెద్దదిక్కు ఉన్నారని, తమకేమీ కాదంటూ కొందరు అక్రమార్కులు బాహాటంగానే మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డొచ్చిన అధికారులను, లారీలు తీసుకెళ్లిన పోలీసులను సైతం బెదిరించి వారి పనిని షరా మామూలుగానే కొనసాగిస్తున్నారు.

చెరువుల్లో మట్టి మాయం..
వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామ చెరువులో మట్టి తీస్తున్న దృశ్యం (ఫైల్‌)

నీటిపారుదల శాఖ అధికారుల చర్యలేవి..?

అధికార పార్టీ అండదండలతోనే దందా..

భూగర్భ జలాలకు పొంచివున్న ప్రమాదం


వర్ధన్నపేట, మే 25 : జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు చెలరేగిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా రూ.కోట్ల విలువైన మట్టి చెరువుల్లో నుంచి తరలిపోతోంది. తమ వెనుక పెద్దదిక్కు ఉన్నారని, తమకేమీ కాదంటూ కొందరు అక్రమార్కులు బాహాటంగానే మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డొచ్చిన అధికారులను, లారీలు తీసుకెళ్లిన పోలీసులను సైతం బెదిరించి వారి పనిని షరా మామూలుగానే కొనసాగిస్తున్నారు. వారి మాటలు విన్నవారికి ఎంతో కొంత ముట్టజెప్పి లారీలను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఈ తతంగమంతా నెల రోజులుగా నడుస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కింది స్థాయి అధికారుల తీరుపై ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి మాఫియాకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో ఉన్నతాధికారులను సైతం బెదిరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలోని చెరువుల్లో మట్టిని తీస్తున్న జేసీబీ, టిప్పర్లను స్వాధీనం చేసుకుని నామమాత్రంగా పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

అనుమతికి మించి తవ్వకాలు..

చెరువుల్లో మట్టి తీసేందుకు మట్టి మాఫియా నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అనుమతులు పొందుతున్నారు. ఇటీవల మండలంలోని ఉప్పరపల్లి చెరువులో మట్టి తీసేందుకు అనుమతి పొందిన పత్రాలు చూపించారు. అందులో 0.6మీటర్ల వరకు మట్టిని తీసే విధంగా, అది కూడా సర్వే నంబరు 100లో తీసేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఈ మట్టిని తరలించేందుకు 17 వాహనాలకు అనుమతిచ్చినట్లు ఆర్డర్‌ కాపీలో చూపించారు. కానీ, మాఫియా చూపించిన సర్వే నంబరు కాకుండా మట్టిని తీస్తూ ఎక్కువ మీటర్ల వరకు తవ్వుతున్నారు. ఇక మట్టి తరలించేందుకు 50 వరకు వాహనాలు పెట్టి తీసుకెళ్తున్నారు. ఇదంతా నీటిపారుదల శాఖ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ వర్ధన్నపేట కోనారెడ్డి చెరువులో మట్టి తరలిస్తుండగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకోవడంతో ఆ కాంట్రాక్టర్‌ ఉప్పరపెల్లి మరో చెరువులో స్థానిక ప్రజాప్రతినిధులను, అధికార పార్టీ నాయకులను మచ్చిక చేసుకుని 15 రోజుల నుంచి వందలాది లారీల్లో చెరువు మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయంపై నీటిపారుదల శాఖ ఈఈ ఆంజనేయులును వివరణ కోరగా మట్టి తీసేందుకు అనుమతిచ్చామని, ఆ పనులను పర్యవేక్షించడానికి కిందిస్థాయి అధికారులు చూసుకుంటున్నారని దాటవేశారు. అనుమతి లేకుండా తీస్తున్న విషయంపై ప్రశ్నించగా కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతూ మాట్లాడారు.

చేతులు మారుతున్న సొమ్ము

చెరువుల్లోని మట్టి ముఖ్యంగా ఇటుకల తయారీకి మాత్రమే పనికివస్తుంది. ప్రస్తుతం ఇటుక లోడుకు మంచి గిరాకీ ఉంది. ఒక ట్రాక్టర్‌ ట్రిప్పునకు సుమారు రూ.15వేల వరకు ఉండడంతో ఇటుక తయారీదారులు మట్టికి ఎంత డబ్బులైనా కొనుగోలు చేస్తున్నారు. ఒక టిప్పర్‌ మట్టి లోడు ప్రస్తుతం రూ.25వేల వరకు ఉండడంతో మట్టిని తరలించే మాఫియా ఏ చెరువునూ వదిలిపెట్టడం లేదు. మట్టి నాణ్యత బాగుంటే ఇక వారు చెప్పిందే రేటు. దీంతో వందలాది ట్రిప్పులు చెరువుల్లో నుంచి తరలిస్తూ లక్షల్లో వెనకేసుకుంటున్నారు. ఆ గ్రామంలో చెరువు మట్టి బాగా ఉందంటే చాలు అక్కడికి టిప్పర్లు, పొక్లెయిన్లతో దిగిపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను, పలు సంఘాల నాయకులను మచ్చిక చేసుకోవడం, గ్రామానికి ఏమైనా చేస్తామని చెబుతూ రూ.లక్షల్లో ఇచ్చేందుకు సైతం వెనుకాడడం లేదు. 

ఇటీవల వర్ధన్నపేట అక్కకుంట చెరువులో మట్టి తీసేందుకు రూ.8లక్షలు ఇస్తామని అంబేద్కర్‌ నగర్‌ మాజీ సర్పంచ్‌ స్థానిక నాయకులకు కాగితాలపై రాసిచ్చారు. గతంలో బండౌతపురంలో సైతం రూ.70వేలు చెల్లించేందుకు సర్పంచ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మండలంలోని ఉప్పరపెల్లి, చెన్నారం గ్రామాల్లో సైతం చెరువుల్లో మట్టి తీసేందుకు రూ.లక్షలను అక్కడి ప్రజాప్రతినిధులకు అందించారు. ఒక్క వర్ధన్నపేటే కాదు.. చుట్టుపక్కల ఉన్న ఐనవోలు, పర్వతగిరి, సంగెం, గీసుగొండ మండలాల నుంచి వందలాది ట్రిప్పుల మట్టి తరలిపోతోంది. పర్వతగిరిలో చేపట్టిన తవ్వకాల్లో భారీ ఎత్తున మట్టి తరలివెళ్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాని కోసం ఏకంగా బడా ప్రజాప్రతినిధే స్వయంగా డీల్‌ మాట్లాడి అధికారులకు, ఇతరులకు లక్షల్లో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో మట్టిని కాజేసి సొమ్ము చేసుకుంటున్న మాఫియా వెనక ఉన్న ఆ అధికార పార్టీ నేతలకు కమీషన్‌ వెళ్తున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

నోరు మెదపని ఉన్నతాధికారులు..

జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతున్నప్పటికీ ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. స్వయంగా ప్రతిపక్షాలు జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ, పోలీసులు సైతం మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయొచ్చు. కానీ, ప్రజాప్రతినిధుల చెప్పుచేతుల్లో మెదులుతూ సహకరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇలా చూస్తూ కూర్చుంటే ఎండాకాలం పూర్తయ్యే వరకు ఏ చెరువులోనూ మట్టి ఉండదని, తద్వారా భవిష్యతులో ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్నారు.

 


Updated Date - 2022-05-26T04:28:54+05:30 IST