మళ్లీ మొదలు..!

ABN , First Publish Date - 2021-06-20T05:30:00+05:30 IST

మళ్లీ మొదలు..!

మళ్లీ మొదలు..!
చెరువుల తవ్వకాలను అధికారులు నిలిపి వేయించినా ఎక్స్‌కవేటర్లను తరలించకుండా అక్కడే ఉంచిన దృశ్యం

పుట్టగుంటలో ఆగని అక్రమ చేపల చెరువుల తవ్వకాలు 

ప్రభుత్వ స్థలాలకు వీడని ఆక్రమణల చెర

పనులు నిలిపి వేయించిన అధికారులు

రాత్రికి రాత్రే మళ్లీ తవ్వుకున్న అక్రమార్కులు

నందివాడ రూరల్‌ (గుడివాడ) : నందివాడ మండలం పుట్టగుంటలో బుడమేరు వద్ద అక్రమ చేపల చెరువుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రభుత్వ భూమికి పట్టా పుట్టించి అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రాగా, రెవెన్యూ అధికారులు శనివారం ఆ పనులు నిలిపి వేయించారు. అంతటితో ఆగని ఆక్రమణదారులు రాత్రికి రాత్రే పనులు మళ్లీ ప్రారంభించారు. ఆదివారం రాత్రి కూడా పనులు జరిగాయి. పనులు ఆపాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినా.. వాటిని బేఖాతరు చేస్తూ తవ్వకాలకు తెరతీశారు. అధికారులు ఆక్రమణదారులతో లాలూచీ పడటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పుట్టగుంటలో ఆక్రమణలకు మూల కారణమైన అధికారపక్ష నాయకుడు రాష్ట్రస్థాయి అధికారుల అండతో తవ్వకాలను ముందుకు తీసుకెళ్తున్నారని సమాచారం.  

అక్రమాలను సక్రమం చేసేందుకే..

మండలంలోనే తిష్టవేసి చక్రం తిప్పుతున్న వీఆర్వోలు దొంగ పాస్‌ పుస్తకాలు పుట్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఎవరు ఉంటే ఆ రాజకీయ పక్షంలో చేరిపోతూ పబ్బం గడుపుకొంటున్న కొందరు నేతలు ఈ పనులకు పూనుకుంటున్నారు.  పుట్టగుంటకు సరిహద్దుగా ఉన్న ఒద్దులమెరకలో ప్రభుత్వ డొంక భూమిని కబ్జా చేసిన ఒక రాజకీయ నాయకుడు అక్కడ పాస్‌ పుస్తకాలు పుట్టించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తాజా ఆక్రమణల పర్వం వెలుగులోకి వచ్చింది. జగనన్న శాశ్వత భూ హక్కు పథకం రీసర్వే తెరపైకి వచ్చేలోపు అక్రమాలను సక్రమం చేసే దిశగా నాయకులందరూ సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చేపల చెరువుల తవ్వకాల దిశగా పావులు కదిపారని రెవెన్యూ రంగ నిపుణులు చెబుతున్నారు. చేపల చెరువుల తవ్వకానికి రెవెన్యూ, మత్స్య, ఇరిగేషన్‌, డ్రెయినేజీ తదితర శాఖల నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉన్నా, కనీసం దరఖాస్తు చేయకపోవడం గమనార్హం. రెవెన్యూ, డ్రెయినేజీ అధికారులు గతంలో మాదిరే నిద్ర నటిస్తే భవిష్యత్తులో బుడమేరు పరివాహక ప్రాంతంలో మరిన్ని ఆక్రమణల బాగోతాలు వెలుగు చూస్తాయని తెలుస్తోంది. రీసర్వే ప్రక్రియతో అన్యాక్రాంతమైన ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల ఆక్రమణ పర్వం తెరమీదకు వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సహించేది లేదు..

వీఆర్వోను పంపి చేపల చెరువుల తవ్వకాలను ఆపివేయిస్తాం. ఆక్రమణదారులు ఎంతటి వారైనా ప్రభుత్వ భూమిలోకి వస్తే సహించేది లేదు. పుట్టగుంటలోని వివాదాస్పదమైన భూముల్లో ఇప్పటికే సర్వే మొదలు పెట్టాం. - రెహ్మాన్‌, తహసీల్దార్‌


Updated Date - 2021-06-20T05:30:00+05:30 IST