HYD : మ్యాట్రిమోనిలో ప్రొఫైల్‌.. పెళ్లి చేసుకుని, America తీసుకెళ్తానని నమ్మించి.. ఏం చేశాడంటే..!

ABN , First Publish Date - 2021-08-29T17:03:09+05:30 IST

పెళ్లయిన వెంటనే అమెరికా వచ్చేయాలని, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని...

HYD : మ్యాట్రిమోనిలో ప్రొఫైల్‌.. పెళ్లి చేసుకుని, America తీసుకెళ్తానని నమ్మించి.. ఏం చేశాడంటే..!

  • పెళ్లి పేరుతో మోసం
  • మ్యాట్రిమోని సైట్లలో నకిలీ ప్రొఫైల్‌
  • నలుగురిని మోసం చేసి జైలుకు
  • తాజాగా మరో యువతికి కుచ్చుటోపీ
  • రూ.9లక్షలు కాజేసిన సైబర్‌ కేటుగాడు

హైదరాబాద్‌ సిటీ : మ్యాట్రిమోని సైట్లో నకిలీ ప్రొఫైల్‌. ఎన్‌ఆర్‌ఐగా ఫోజు. పెళ్లి చేసుకుని, అమెరికాకు తీసుకెళ్తానని బురిడీ కొట్టించి లక్షల్లో డబ్బులు కొట్టేయడం అతడి నైజం. ఇలా ఐదుగురిని మోసం చేసి రూ. లక్షల్లో కుచ్చుటోపి పెట్టిన సైబర్‌ కేటుగాడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. అతనినుంచి రూ.3.20 లక్షల నగదు, రెండు మొబైల్‌ ఫోన్స్‌, మూడు చెక్‌బుక్స్‌, ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. క్రికెట్‌ బెట్టింగ్స్‌, గుర్రపు పందాలకు తోడు చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. భార్య విడాకులిచ్చింది. పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. వాటినుంచి గట్టెక్కడానికి సైబర్‌ మోసాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.


ఎన్‌ఆర్‌ఐగా బురిడీ...

ఖమ్మం బురాన్‌పూర్‌ కాలనీలో ఉంటున్న వంశీకృష్ణ.. పలు మ్యాట్రిమోని సైట్లలో నకిలీ ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేశాడు. ఎన్‌ఆర్‌ఐగా, అమెరికాలో వ్యాపారవేత్తగా చెప్పుకున్నాడు. సంపన్నవర్గాలకు చెందిన అమ్మాయిల ప్రొఫైల్స్‌ను టార్గెట్‌ చేసేవాడు. వారితో ఫోన్‌ మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. పెళ్లయిన వెంటనే అమెరికా వచ్చేయాలని, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని నమ్మబలికేవాడు. వీసా ప్రాసెసింగ్‌ ఫీజులు చెల్లించాలని నమ్మించి వారి నుంచి రూ. లక్షల్లో వసూలు చేసేవాడు. డబ్బులు చేతికందగానే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేవాడు. 2020లో సైబరాబాద్‌, హైదరాబాద్‌, రాచకొండ పరిధిలో నలుగురు యువతులను మోసం చేయగా, హైదరాబాద్‌ సీసీఎస్‌, చైతన్యపురి, సైబరాబాద్‌ పోలీసులు వంశీకృష్ణను వేర్వేరు కేసుల్లో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.


ఆమె పత్రాలతో రుణం..

బెయిల్‌పై వచ్చిన వంశీకృష్ణ ఈ ఏడాది ఏప్రిల్‌లో సాయిప్రణవ్‌ పేరుతో నకిలీ ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేశాడు. చౌటుప్పల్‌కు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశారు. ఇంటర్నేషనల్‌ బ్యాంకు ఖాతా తీయాలని ఆమె ఆధార్‌కార్డు, పాన్‌కార్డుతోపాటు అవసరమైన ఇతర ధ్రువపత్రాలు తీసుకున్నాడు. ప్రాసెసింగ్‌ చార్జీలు చెల్లించాలని రూ.90 వేలు తీసుకున్నాడు. ఆమె ఆధార్‌, పాన్‌కార్డుతోపాటు ఉద్యోగ ధ్రువపత్రాలతో  ఓ ప్రభుత్వ బ్యాంక్‌ యాప్‌లో రూ.8లక్షలు రుణం తీసుకున్నాడు. ఆ డబ్బులు తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చేశాడు. ఆ తర్వాత  ఆమెతో  కాంటాక్టు కట్‌ చేశాడు. మోసపోయానని గుర్తించిన యువతి రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. ఏసీపీ హరినాథ్‌, డీసీపీ క్రైమ్స్‌ యాదగిరి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు వంశీకృష్ణను అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-08-29T17:03:09+05:30 IST