దర్గాల వద్ద మాతం

ABN , First Publish Date - 2022-08-10T04:41:05+05:30 IST

మండలంలోని కాగితాలపూరు దర్గాలవద్ద మంగళవారం మొహర్రం సందర్భంగా ముస్లింలు మాతం ( బేడ్లులు, కత్తులతో ఎదపై కొట్టుకోవడం) నిర్వహించారు.

దర్గాల వద్ద మాతం
కాగితాలపూరులో దర్గాల వద్ద మాతం నిర్వహిస్తున్న షియా ముస్లింలు

మనుబోలు, ఆగస్టు 9 : మండలంలోని  కాగితాలపూరు దర్గాలవద్ద మంగళవారం మొహర్రం సందర్భంగా ముస్లింలు మాతం ( బేడ్లులు, కత్తులతో ఎదపై కొట్టుకోవడం) నిర్వహించారు. అంజుమన్‌ జాఫారియా కమిటీ అధ్యక్షుడు జాకీర్‌ హుస్సేన్‌ ముఖ్య అతిథిగా మాట్లాడారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా ముస్లింలు ప్రార్థనలు చేస్తూ కత్తులు, బ్లేడులతో గుండెలపై ,వీపుపై హత్తుకున్నారు. ఇలా చేయడంతో దర్గా ప్రాంగణం అంతా రక్తంతో తడిసి ముద్ద అయింది . అంతకు మునుపు మస్లిం మహిళలు విలపిస్తూ ప్రార్థలను చేశారు. ఒక్క కాగితాలపూరులోని వారే కాదు, విజయవాడ,విశాఖ పట్టణం, హైదరాబాదు, చెన్నై, కేరళ, కర్ణాటక, జిల్లా నలుమూలల ఉన్న  షియా మస్లింలు వచ్చి మాతం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలవారు వందలసంఖ్యలో చేరుకున్నారు. సెల్‌ఫోన్లలో మాతం దృశ్యాలను బంధించారు. మాతం అనంతరం కొలువు ఉంచిన పీర్లను గ్రామంలో ఊరేగించారు.

రాపూరు : రాపూరు, మండలంలోని పలు గ్రామాల్లో మొహర్రం వేడుకలు మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. అన్నీ చోట్లా నిప్పుల గుండంలో నిప్పులను తొక్కి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ పీర్లు ఊరేగింపు జరిగింది. డప్పులు శబ్దాలతో హోరెత్తింది. రాత్రికి పీర్లను నీళ్లల్లో శుభ్రం చేసి వేడుకలను ముగించారు.  ఓబులాయపల్లి గ్రామంలో పీర్ల పండుగ వేడుకలు కొనసాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి ఇక్కడి చావిడిలోని మస్తానయ్య పీరుకు వేలం నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన ముగ్గురు రూ. లక్షా 83వేలకు పాటపాడి పీరును ఎత్తారు. అర్థరాత్రే వేడుకలను ఆడంబరంగా నిర్వహించారు. బుధవారం కూడా వేడుకలను జరగనున్నాయి. ఓబులాయపల్లిలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

వెంకటాచలం,  మండలంలోని సర్వేపల్లి, కసుమూరు తదితర గ్రామాల్లో మంగళవారం మొహరం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి ఆయా గ్రామాల్లో పీర్ల చావిటీల వద్ద అగ్ని గుండ ప్రవేశాలు చేశారు.  ఆయా గ్రామాల్లో కులమతాలకు అతీతంగా పీర్ల పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. 

అనంతసాగరం, ఆగస్టు 9: మండలంలోని పలుగ్రామాల్లో మూడు రోజులుగా జరుగుతున్న మొహర్రం వేడుకలు మంగళవారం ముగిశాయి. భక్తులు పీర్లచావిడి వద్ద ప్రతేక ఫాతేహాను నిర్వహించారు. తెల్లవారుజామున భక్తులు అగ్పిగుండం తొక్కి తమ మొక్కులు తీర్చుకున్నారు. షహదత్‌ కార్యక్రమంలో భాగంగా పీర్లను బావికి తరలించండతో వేడుకలు ముగిశాయి.

ఆత్మకూరు : పట్టణంలోని ఎల్‌ఆర్‌పల్లి పీర్ల చావిడి వద్ద భక్తిశ్రద్ధలతో వైభవంగా మోహరం వేడుకలను నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున పలువురు ముస్లింలు యువకులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మండలంలోని కరటంపాడు, మహిమ లూరు ,అశ్వినీపురం గ్రామాల్లో మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీర్లచావిడి వద్ద పూలతో అలంకరించిన పీర్లకు ప్రత్యేక పూజలు చేశారు.  రాత్రికి పీర్లను పూలతో అలంకరించి గ్రామాల్లో  మేళతాలతో, డప్పులతో తబుక్‌లో పీర్లను ఊరేగించి స్నానాల బావికి తీసుకెళ్లి స్నానాలు చేయించి పీర్లచావిడిలో పీర్లను భద్రపరిచనున్నట్లు ముస్లింలు తెలిపారు. 


Updated Date - 2022-08-10T04:41:05+05:30 IST