సాకారమయ్యేనా!

ABN , First Publish Date - 2022-05-19T05:07:43+05:30 IST

తెల్ల కాగితంపై రాసుకున్న భూ క్రయ, విక్రయాలకు చట్టబద్ధత కల్పించేందుకు స్వీకరించిన దరఖాస్తులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

సాకారమయ్యేనా!


  • సాదా బైనామాలపై కదలిక ఎప్పుడో?
  • దరఖాస్తు చేసి 18 నెలలు  
  • ఇంకా జారీ కాని మార్గదర్శకాలు
  • దరఖాస్తుదారులకు తప్పని ఎదురు చూపులు

తెల్ల కాగితంపై రాసుకున్న భూ క్రయ, విక్రయాలకు చట్టబద్ధత కల్పించేందుకు స్వీకరించిన దరఖాస్తులపై  ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తీసుకున్న దరఖాస్తులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. దీంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. 

వికారాబాద్‌, మే18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెల్ల కాగితాల(సాదాబైనామా)పై జరిగిన భూముల కొనుగోళ్లు, విక్రయాలకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబరు, నవంబరు నెలల్లో దరఖాస్తులు స్వీకరించింది. అయితే సాదాబైనామాల దరఖాస్తులకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం ఇంతవరకు మార్గదర్శకాలు జారీ చేయలేదు. తెల్ల కాగితాలపై రాసుకున్న భూక్రయ, విక్రయాలకు చట్టబద్ధత కల్పించి రిజిస్ట్రేషన్లు చేసి పట్టాపాసు పుస్తకాలు జారీ చేయాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఏడాదిన్నర కావస్తున్నా ఇంత వరకూ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీసుకున్న దరఖాస్తులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. దీంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. రాష్ట్రంలో పాత రెవెన్యూ చట్టం స్థానంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంతో సాదాబైనామాల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనేది దరఖాస్తుదారులను పట్టి పీడిస్తోంది. క్రమబద్ధీకరణ కోసం వచ్చిన సాదాబైనామాల  దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. సాదాబైనామాలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈ ప్రక్రియ త్వరితగతిన చేపట్టేందుకు వీలుగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వ, అటవీ భూములతో పాటు ఇది వరకు తిరస్కరణకు గురైన సాదాబైనామాల దరఖాస్తులను అధికారులు పక్కన బెట్టినట్లు తెలుస్తోంది. జిల్లాలో సాదాబైనామా క్రమబద్ధ్దీకరణ కోసం 4443 దరఖాస్తులు రాగా, వాటిలో వివాదాలు ఉన్న దరఖాస్తులు మినహా ఎలాంటి సమస్యలు లేని దరఖాస్తులను ప్రభుత్వ పరిశీలనకు సిద్ధంగా ఉంచారు. భూ క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలను ధరణి పోర్టల్‌ ద్వారానే నిర్వహిస్తున్నారు. సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించే అంశంలో ఉన్న అడ్డంకులను పరిష్కరించడంతో పాటు ధరణి పోర్టల్‌లో ప్రత్యేక ఆప్షన్‌ ఇస్తేనే సాదాబైనామాల క్రమబద్ధీ కరణ, పట్టాపాస్‌ పుస్తకాల జారీకి మార్గం సుగమమవుతుందని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు.  

తొలిసారిగా ఆరేళ్ల్ల కిందట

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా 2016లో సాదాబైనామాల క్రమబద్ధీరణ చేపట్టింది. ఐదెకరాల లోపు వ్యవసాయ భూములకు ఉచితంగా పట్టామార్పిడి చేశారు. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తీసుకోలేదు. అయితే ఐదెకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూములకు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు తీసుకుని క్రమబద్ధ్దీకరించి పట్టామార్పిడి చేశారు. భూ క్రయవిక్రయాలకు సంబంధించి  తెల్ల కాగితంపై రాసుకున్న రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోతే క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైనట్లుగా భావించాలి. పట్టాదారు కుటుంబ సభ్యులు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మాత్రం పొలం సరిహద్దుల్లో ఉండే రైతుల వాంగ్మూలం నమోదు చేసుకుని ఫారం -8 నోటీసులు జారీ చేసి సంబంధిత గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. ఎవరి నుంచైనా అభ్యంతరాలు వస్తే వాటిపై సమగ్ర విచారణ జరిపించి నిబంధనల మేరకు అర్హులకు పట్టా జారీ చేస్తారు. 

కులకచర్లలో అధికం.. బంట్వారంలో అత్యల్పం

జిల్లాలో సాదామైనామాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ 4,443 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కులకచర్ల మండలంలో 505 దరఖాస్తులు రాగా, తక్కువగా బంట్వారం మండలంలో 81 దరఖాస్తులు వచ్చాయి. బషీరాబాద్‌ మండలంలో 181, బొంరా్‌సపేటలో 315, ధారూరులో 203, దోమలో 417, దౌల్తాబాద్‌లో 315, కొడంగల్‌లో 151 దరఖాస్తులు వచ్చాయి. కోట్‌పల్లిలో 139, మర్పల్లిలో 211, మోమిన్‌పేటలో 298, నవాబుపేటలో 136, పరిగిలో 223, పెద్దేముల్‌లో 315, పూడూరులో 136, తాండూరులో 246, వికారాబాద్‌లో 405, యాలాల్‌లో 166 దరఖాస్తులు వచ్చాయి. 2014, జూన్‌ 2వ తేదీలోగా సాదా కాగితాలపై భూములను కొనుగోలు చేసిన రైతుల దరఖాస్తులకు చట్టబద్ధత కల్పించి వారికి పట్టా పాసు పుస్తకాలు జారీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2020, నవంబర్‌ 10వ తేదీ వరకు సాదాబైనామాల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తే తప్ప సాదాబైనామాల దరఖాస్తుల్లో కదలిక వచ్చే అవకాశం కనిపించడం లేదు.  

Updated Date - 2022-05-19T05:07:43+05:30 IST