ఎందుకింత ఆలస్యం!

ABN , First Publish Date - 2020-09-25T09:15:09+05:30 IST

యూఏఈలో మ్యాచ్‌లు జరుగుతుండడం.. అదీ ఓ అర్ధగంట ముందుగానే ఆరంభిస్తుండడంతో అర్ధరాత్రుల వరకు మేల్కోవాల్సిన

ఎందుకింత ఆలస్యం!

యూఏఈలో మ్యాచ్‌ల తీరు

ముంబై: యూఏఈలో మ్యాచ్‌లు జరుగుతుండడం.. అదీ ఓ అర్ధగంట ముందుగానే ఆరంభిస్తుండడంతో అర్ధరాత్రుల వరకు మేల్కోవాల్సిన పనిలేదని అభిమానులంతా భావించారు. కానీ జరుగుతున్నది వేరు. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌ కూడా భారత్‌లో సాగినట్టుగానే అనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ నిర్ణీత సమయానికన్నా 40 నిమిషాలు ఆలస్యంగా ముగిసింది. ఐపీఎల్‌ నిబంధన ప్రకారం.. ఐదు నిమిషాల వ్యూహాత్మక విరామాన్ని కలిపి కూడా ఓ ఇన్నింగ్స్‌ గంటా 25 నిమిషాల్లో ముగియాలి. కానీ ముంబై మాత్రం ఏకంగా రెండు గంటల ఐదు నిమిషాల సేపు ఆడింది. అంటే ఈ జట్టు 40 నిమిషాల అదనపు సమయం తీసుకుంది. దీంతో ఓవరాల్‌గా మ్యాచ్‌ రాత్రి 11.46 గంటలకు ముగిసింది. ఇందులో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పాటు ఆటగాళ్లు తమ కిట్లను కూడా మార్చుకోలేదు. అయితే మూడు సిక్సర్లు స్టేడియం ఆవలకు వెళ్లడంతో బంతుల్ని మార్చడం.. ఫీల్డర్‌ విసిరిన త్రో రోహిత్‌ శర్మకు తగలడం మ్యాచ్‌ ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. కానీ బంతిని మారిస్తే నిమిషం, రెండు నిమిషాలతో ముగుస్తుందని, మరి 40 నిమిషాల ఆలస్యం ఎందుకనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రస్తు తం యూఏఈలో  అధిక  వేడి వల్ల కూడా ఇలా అవుతోందని భావిస్తున్నారు. కానీ భారత్‌లోనూ ఏప్రిల్‌, మేలో విపరీతంగా ఎండల మధ్యే ఐపీఎల్‌ జరుగుతుందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరోవైపు ఇలా ఆలస్యం జరిగినప్పుడు రెఫరీ రెండో ఇన్నింగ్స్‌ కోసం 20 నిమిషాల విశ్రాంతి తగ్గించి ముందే ఆరంభించాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌ 20 నిమిషాలు ఆలస్యంగా ఇన్నింగ్స్‌ ముగించింది. 

Updated Date - 2020-09-25T09:15:09+05:30 IST