ముక్కకు మస్త్‌ గిరాకీ

ABN , First Publish Date - 2021-01-18T07:00:45+05:30 IST

చికెన్‌, మటన్‌ దుకాణాలు ఆదివారం కిక్కిరిసిపోయాయి.

ముక్కకు మస్త్‌ గిరాకీ

చికెన్‌, మటన్‌ దుకాణాలు కిటకిట 

గతవారం కంటే పెరిగిన విక్రయాలు 

హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): చికెన్‌, మటన్‌ దుకాణాలు ఆదివారం కిక్కిరిసిపోయాయి. సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం కావడంతో జనం చికెన్‌, మటన్‌ కొనుగోలుకు ఆసక్తి చూపారు. దీంతో పలు మటన్‌ దుకాణాల వద్ద క్యూలు కనిపించాయి. గత ఆదివారం కంటే ఈసారి 15 శాతం అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. చికెన్‌ అమ్మకాలు కూడా 15 నుంచి 20 శాతం పెరిగినట్లు వివరించారు. సాధారణంగా ఆదివారం గ్రేటర్‌లో కోటి కోళ్ల అమ్మకాలు జరుగుతాయి. గ్రేటర్‌లో గత ఆదివారం 65 నుంచి 75 శాతం మధ్యలోనే మటన్‌, చికెన్‌ విక్రయాలు జరగగా, ఈసారి అవి 80 నుంచి 90 శాతానికి చేరుకున్నాయని వ్యాపారులు వివరించారు. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో గతవారం చికెన్‌ అమ్మకాలపై ప్రభావం పడింది. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదని, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద చికెన్‌ ఉడికించడం వల్ల ఎలాంటి వైరస్‌ ఉండదనే అవగాహన కలగడంతో ఈ వారం చికెన్‌ విక్రయాలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మరో వైపు సంక్రాంతి నుంచి మూడు రోజుల పాటు వరసగా గురు, శుక్ర, శనివారాలు రావడంతో చాలా మంది తమతమ విశ్వా సాల కారణంగా చికెన్‌ తినలేదు. సాధారణంగా కొందరు సంక్రాంతి, మరుసటి రోజు నాన్‌వెజ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ఈసారి ఆ రెండు రోజులు గురు, శుక్రవారాలు కావడంతో తక్కువ మంది మాత్రమే మాంసాహారాన్ని తీసుకున్నారు. అప్పుడు తినలేని వారు ఆదివారం దుకాణాలకు క్యూ కట్టారు. ఆదివారం స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ. 160 నుంచి రూ. 170 వరకు విక్రయించారు.  

Updated Date - 2021-01-18T07:00:45+05:30 IST