మాంసాహారంతో మస్త్‌ ఖుషీ!

ABN , First Publish Date - 2022-06-25T10:03:46+05:30 IST

వీకెండ్‌లో నాన్‌వెజ్‌ ఘుమఘుమలు మామూలే. అయితే ఈ సారి నాటుకోడి కూర, పొట్టేలు మాంసం ఇగురు, రాజుగారి కోడి పలావు, అరటి ఆకు ఖీమా, నీలగిరి చేపల వేవుడు వంటలను ట్రై చేయండి.

మాంసాహారంతో మస్త్‌ ఖుషీ!

పందెం కోడి బాదం కూర

కావలసినవి: నాటు కోడి - ఒక కేజీ, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, త్రీ మ్యాంగో కారం - రెండు టేబుల్‌స్పూన్లు,  ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - రెండు, జీడిపప్పు - 50గ్రా, ఎండుకొబ్బరి పొడి - 50గ్రా, గరంమసాల - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర - ఒకకట్ట, జీలకర్రపొడి - అర టేబుల్‌స్పూన్‌, పసుపు - అర టేబుల్‌స్పూన్‌, నల్లమిరియాల పొడి - చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, కరివేపాకు - రెండు రెమ్మలు, పచ్చిమిర్చి - నాలుగు.


తయారీ విధానం:

ఉల్లిపాయలు తరగాలి. టొమాటోలు కట్‌ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్‌ చేసుకోవాలి.

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి ఉప్పు, కారం పట్టించి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

ఎండుకొబ్బరి పొడి, జీడిపప్పును నానబెట్టి పేస్టులా తయారుచేసుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి. పసుపు జీలకర్రపొడి వేసుకోవాలి.

తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరికాసేపు వేయించాలి. టొమాటోలు వేయాలి. ఇప్పుడు మారినేట్‌ చేసుకున్న చికెన్‌ వేసి కలియబెట్టుకోవాలి.

కారం, తగినంత ఉప్పు, త్రీ మ్యాంగో కారం, జీడిపప్పు పేస్టు, నల్లమిరియాలపొడి వేసి కలుపుకోవాలి

మూతపెట్టి పదినిమిషాల పాటు ఉడికించాలి. గరంమసాల వేస్తే గ్రేవీ చిక్కగా అవుతుంది. 

స్టవ్‌పై నుంచి దింపుకొని కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


అరటి ఆకు ఖీమా

కావలసినవి:

మటన్‌ ఖీమా - 150గ్రా, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, త్రీ మ్యాంగో కారం - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - అర టేబుల్‌స్పూన్‌, నూనె - సరిపడా, గరంమసాల - ఒక టేబుల్‌స్పూన్‌, అరటి ఆకు - ఒకటి, మొక్కజొన్న పిండి - రెండు టేబుల్‌స్పూన్లు, మైదా - రెండు టేబుల్‌స్పూన్లు, టొమాటో - రెండు. 

తయారీ విధానం:

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి.

తరువాత మటన్‌ ఖీమా, తరిగిన టొమాటో, కారం, త్రీ మ్యాంగో కారం, ఉప్పు, గరం మసాల వేసి కలుపుకొని పదినిమిషాలు ఉడికించుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌ పైనుంచి దింపుకొని కాస్త చల్లారిన తరువాత మొక్కజొన్న పిండి, మైదా వేసి కలుపుకోవాలి.

అరటి ఆకును పరిచి ఖీమా అందులో వేసి ఆకును చుట్టాలి.

మటన్‌ ఖీమాతో నింపిన ఆకును ఆవిరిపై పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే అరటి ఆకు ఖీమా రెడీ.


పొట్టేలు మాంసం ఇగురు

కావలసినవి:

మాంసం - 150గ్రాములు, ఉప్పు - తగినంత, కారం - ఒకటేబుల్‌స్పూన్‌, త్రీ మ్యాంగో కారం - రెండు టీస్పూన్లు, ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - రెండు, జీడిపప్పు - 50గ్రా, ఎండుకొబ్బరి - 40గ్రా, గరంమసాల - ఒక టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒక కట్ట, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కరివేపాకు - ఐదు రెమ్మలు, పచ్చిమిర్చి - పది.

తయారీ విధానం:

ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలియబెట్టి మారినేట్‌ చేసుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. జీలకర్రపొడి వేయాలి.

కారం, త్రీ మ్యాంగో కారం వేయాలి. కాసేపు వేగిన  తరువాత మారినేట్‌ చేసుకున్న మాంసం వేయాలి.

తగినంత ఉప్పు వేసి, కట్‌చేసిన టొమాటో ముక్కలు వేయాలి. కొన్ని నీళ్లు పోసి పావుగంట పాటు ఉడికించాలి. ఎండుకొబ్బరి, జీడిపప్పును పొడి చేసి వేయాలి. 

గరంమసాల వేసి మరికాసేపు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


నీలగిరి చేప వేపుడు


కావలసినవి:

ముర్రెల్‌ చేప - 150గ్రా, ఉప్పు - రుచికి తగినంత, పాలకూర - ఒకకట్ట, పుదీనా - ఒకకట్ట, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, త్రీ మ్యాంగో కారం పొడి - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, టొమాటోలు - రెండు, గరంమసాల - ఒకటీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒకకట్ట, పసుపు - అర టీస్పూన్‌, కరివేపాకు - నాలుగు రెమ్మలు, పచ్చిమిర్చి - పది.

తయారీ విధానం:

పాలకూర, పుదీనా, కొత్తిమీరను పేస్టులా తయారుచేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. పచ్చిమిర్చి  పొడవుగా కట్‌ చేసుకోవాలి. 

చేపను ముక్కలుగా కట్‌  చేసి శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా అల్లంవెల్లుల్లి పేస్టు, త్రీ మ్యాంగో కారం వేసి మారినేట్‌ చేసుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆ చేప ముక్కలను వేసి వేయించుకోవాలి.

స్టవ్‌పై మరోపాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేయాలి. పాలకూర, కొత్తిమీర పేస్టు, టొమాటో ముక్కలు వేయాలి. 

కాసేపు వేగిన తరువాత ఫ్రై చేసిన చేప ముక్కలను వేయాలి. తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేయించాలి.

గరంమసాల వేసి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే నీలగిరి చేపల వేపుడు రెడీ.


రాజుగారి కోడి పలావ

కావలసినవి:

చికెన్‌ - ఒకకేజీ, బాస్మతి బియ్యం - ఒకకేజీ, క్యాప్సికం గ్రీన్‌ - ఒకటి, క్యాప్సికం రెడ్‌ - ఒకటి, అల్లం వెల్లుల్లిపేస్టు - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి పేస్టు - 100గ్రా, గరంమసాల - రెండు టీస్పూన్లు, పసుపు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా - ఒకకట్ట, పెరుగు - 180గ్రా, ధనియాల పొడి - ఒకటీస్పూన్‌, కసూరీ మేతి - చిటికెడు, ఉల్లిపాయలు - రెండు, జీడిపప్పు - పదిపలుకులు.


తయారీ విధానం:

బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.

చికెన్‌ను శభ్రంగా కడగాలి. ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్టు వేసి వేయించాలి.

తరువాత అల్లం వెల్లుల్లిపేస్టు వేయాలి. గ్రీన్‌ క్యాప్సికం, రెడ్‌క్యాప్సికం ముక్కలు వేయాలి. పసుపు వేసుకోవాలి.

ఇప్పుడు చికెన్‌ ముక్కలు వేసి కలుపుకోవాలి. జీడిపప్పు దంచి వేసుకోవాలి. ధనియాల పొడి, గరంమసాల వేసి కలుపుకోవాలి. 

పెరుగు వేసి కాసేపు ఉడికించుకోవాలి.

ఇప్పుడు సరిపడా నీళ్లు పోయాలి. కసూరిమేతి వేయాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి.

చిన్నమంటపై నెమ్మదిగా ఉడికించుకుంటే కోడి పలావు రెడీ.

స్టవ్‌పై నుంచి దింపుకొని కొత్తిమీర, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


వీకెండ్‌లో నాన్‌వెజ్‌ ఘుమఘుమలు మామూలే. అయితే ఈ సారి నాటుకోడి కూర, పొట్టేలు మాంసం ఇగురు, రాజుగారి కోడి పలావు, అరటి ఆకు ఖీమా, నీలగిరి చేపల వేవుడు వంటలను ట్రై చేయండి. ఈ రెసిపీలతో వీకెండ్‌ ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు.

Updated Date - 2022-06-25T10:03:46+05:30 IST