Oct 27 2021 @ 08:47AM

తమన్నాకు మాస్టర్ చెఫ్ నిర్వాహకులు షాక్ ..!

మాస్టర్ చెఫ్ నిర్వాహకులు హీరోయిన్ తమన్నాకు షాకిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ కుకరీ షోను సౌత్ భాషల్లోకి కూడా తీసుకొచ్చింది సన్ నెట్వర్క్. ఈ క్రమంలోనే జెమినీ టీవీలో తమన్నా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ మొదలైంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ప్రసారమైన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇటీవల తమన్నాను తొలగించి మరో పాపులర్ యాంకర్ అనసూయను తీసుకున్నారు. దీనితో తమన్నా నిర్వాహకులకు నోటీసులు పంపింది. దీనికి స్పందించిన నిర్వాకులు తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

తమన్నాను హోస్ట్‌గా ఎంచుకున్నప్పుడు రూ.2కోట్లు రెమ్యునరేషన్‌కు అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. జూన్ 24 నుంచి సెప్టెంబర్ నెల చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆమె సైన్ చేశారు. కానీ ఆమెకున్న కమిట్‌మెంట్స్ వల్ల కమిటయిన 18 రోజుల్లో 16 రోజులు మాత్రమే షూటింగ్‌కు హాజరయ్యారు. మిగిలిన రెండు రోజులు ఆమె షూటింగ్‌కు రాలేదు. అప్పటికే రూ. 1.56 లక్షలు పేమెంట్స్ ఇచ్చేశాము. ఆమె రెండు రోజులు షూటింగ్‌కు హాజరవకపోవడంతో దాదాపు 300 మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్‌కు రూ. 5 కోట్లకు పైగానే నష్టం వచ్చింది. అగ్రిమెంట్ చేసుకున్నదాని ప్రకారం ఆమె రెండు రోజులు షూటింగ్ గనక పూర్తి చేసి ఉంటే బ్యాలెన్స్ ఉన్న రూ. 50 లక్షల పేమెంట్ కూడా చేసేవాళ్ళము. కానీ అది పూర్తి చేయకుండానే..సెకండ్ సీజన్‌కు అడ్వాన్స్ కావాలని తమన్నా డిమాండ్ చేస్తున్నారు. మేము అసలు సెకండ్ సీజన్‌కు హోస్ట్‌గా ఆమెను అనుకోలేదు..అని నోట్‌లో పేర్కొన్నారు. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి వార్తలు రాయాలనుకున్నా మమ్మలిని సంప్రదించండి.. అని కూడా నిర్వాహకులు కోరారు.