వైసీపీపై మొహం మొత్తిందా!?

ABN , First Publish Date - 2022-06-25T09:08:10+05:30 IST

మూడేళ్లకే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు మొహం మొత్తిందా.

వైసీపీపై మొహం మొత్తిందా!?

  • ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీగా తగ్గిన ఓటింగ్‌
  • 64.26 శాతమే పోలింగ్‌.. గత ఎన్నికల్లో 82% నమోదు
  • సుమారు 18% తగ్గుదల.. వైసీపీ వర్గాల్లో విస్మయం
  • ప్రభుత్వంపై వ్యతిరేకత సుస్పష్టం.. టీడీపీ పోటీలో లేకున్నా కనిపించని ఊపు
  • నిక్కచ్చిగా ఎన్నికల సిబ్బంది, పోలీసులు.. ఒత్తిళ్లకు తలొగ్గని వైనం

(నెల్లూరు-ఆంధ్రజ్యోతి): మూడేళ్లకే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు మొహం మొత్తిందా..? ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఉద్యోగులు ఆత్మకూరు ఉప ఎన్నికను వేదికగా వాడుకున్నారా..? ఆత్మకూరులో గురువారం ఓటింగ్‌ సరళిని, ఆ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల వ్యవహారశైలిని గమనిస్తే ఇది నిజమేనన్న విపక్షాల వాదనకు బలం చేకూరుతోంది. నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో జరిగిన ఈ ఉప ఎన్నికలో సానుభూతి కనిపించలేదు సరికదా.. అధికార పార్టీ హోదాలో ఎన్నికల బరిలోకి దిగిన వైసీపీని ఎన్నికల సిబ్బంది సైతం లెక్కచేయకపోవడం.. డబ్బు పంచినా పోలింగ్‌ కేంద్రాలకు జనం రాకపోవడం గమనార్హం.  సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ హవాయే కనిపిస్తుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆ పార్టీ నాయకుల హడావిడి కనిపిస్తుంది. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఆ పార్టీకే వత్తాసు పలుకుతుంటారు. ప్రధాన ప్రతిపక్షం బరిలో లేకపోతే అడ్డూఅదుపు లేకుండా పాలక పక్షానికి మరింతగా సహకరిస్తారు. గురువారం జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో ఇవేమీ కనిపించలేదు. 


భారీ మెజారిటీ కోసం..

టీడీపీ పోటీ చేయలేదు కాబట్టి ఓట్లన్నీ తమకే పడతాయని వైసీపీ నాయకులు భావించారు. నియోజకవర్గంలో ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని, ఒక్కో ఎమ్మెల్యేను ఇన్‌చార్జులుగా నియమించి 10 రోజులపాటు వీరంతా ఆయా మండలాల్లో తిష్ఠవేసి వ్యూహరచనలు చేశారు. అయితే.. ప్రచారంలోనే ప్రజల మూడ్‌ తెలిసిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేల రోడ్‌ షోలు, ప్రచారాలకు ముఖం చాటేశారు. ధాన్యం బకాయిలు అందని రైతులు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన మంత్రులు.. నెల్లూరు జిల్లాలోని మిగతా నియోజకవర్గాలను పక్కనబెట్టి ఒక్క ఆత్మకూరు నియోజకవర్గ రైతులకు మాత్రమే ధాన్యం తోలిన వెనువెంటనే బకాయిలు చెల్లించారు. అంతేకాదు.. చిన్న చితకా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు సైతం మంజూరు చేశారు. అయినా ప్రజల్లో స్పందన కనిపించకపోవడంతో పోలింగ్‌ తేదీకి వారం ముందు నుంచే  పార్టీలకతీతంగా ఓటుకు రూ.500 చొప్పున లక్ష మంది ఓటర్లకు డబ్బులు పంచారని విపక్షాల ఆరోపణ. నోట్ల పంపిణీకి వలంటీర్ల వ్యవస్థను వాడుకున్నారు. 


వారి చేతులమీదుగా డబ్బు పంపిణీయే వైసీపీని ఎంతో కొంత ఆదుకుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే పోలింగ్‌ 80 శాతం దాటించాలని వైసీపీ నాయకులు ఎంత కష్టపడినా సాధ్యం కాలేదు. 2019 ఎన్నికల్లో 82.44 శాతం కాగా ఈ ఉప ఎన్నికలో 64.26 శాతానికే పరిమితమైంది. అంటే సుమారు 18 శాతం తగ్గింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి సొంత మండలం మర్రిపాడులో 2019లో 80.34 శాతం పోలింగ్‌ జరుగగా.. ఈ దఫా 59.73 శాతమే  నమోదు కావడం గమనార్హం. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి.  ఇక, జగన్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రదర్శించడానికి ఉద్యోగులు ఈ ఉపఎన్నికను వేదికగా చేసుకున్నారేమోనని అనిపించింది. దొంగఓట్లను చాలా వరకు కట్టడి చేశారు. వృద్ధులకు సహాయకులుగా వస్తామన్నా వైసీపీ నేతలను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించలేదు. పోలింగ్‌ శాతం తక్కువగా ఉండడంతో పెంచుకోవడానికి సహకరించాలని అధికార పార్టీ నేతలు ఎంత ఒత్తిడి తెచ్చినా సిబ్బంది లెక్క చేయలేదు. కొన్ని చోట్ల కొందరు ఒత్తిళ్లకు తలొగ్గినా.. మెజారిటీ సిబ్బంది మాత్రం నిక్కచ్చిగానే విధులు నిర్వర్తించడం విశేషం.

Updated Date - 2022-06-25T09:08:10+05:30 IST