Hyderabad : జోగిని ఇంట్లో 90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల గొలుసు చోరీ..

ABN , First Publish Date - 2021-12-03T16:51:56+05:30 IST

90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల బంగారు గొలుసుతోపాటు, రూ.4 లక్షల నగదు అపహరణకు గురైంది...

Hyderabad : జోగిని ఇంట్లో 90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల గొలుసు చోరీ..

  • మాణికేశ్వర్‌ నగర్‌లో భారీ దొంగతనం
  • వారసత్వంగా వచ్చిన ఆభరణాలు మాయం

హైదరాబాద్ సిటీ/తార్నాక : ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న మాణికేశ్వర్‌ నగర్‌ (వడ్డెర బస్తీ)లో గురువారం భారీ దొంగతనం జరిగింది. 90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల బంగారు గొలుసుతోపాటు, రూ.4 లక్షల నగదు అపహరణకు గురైంది. సంఘటనకు సంబంధించి బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాణికేశ్వర్‌ నగర్‌కు చెందిన జోగిని రంగమ్మ అనే మహిళ గతంలోనే దుర్గా అనే ఓ అమ్మాయిని పెంచుకుంది. లక్ష్మణ్‌ అనే యువకుడితో వివాహం జరిపించింది. గత వారం కాశీ తీర్ధయాత్రకు వెళ్లి మంగళవారం ఇంటికి చేరుకున్న రంగమ్మ బీరువా లాకర్‌ను తెరిచింది. అందులోని నగలు, నగదు మాయకావడంతో వెంటనే ఓయూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇంటి దొంగపనేనా..?

సీసీ కెమెరాల వైర్లు కట్‌చేసి, లాకర్‌ స్ర్కూలు ఇప్పి నగలు కాజేసి యథావిధిగా లాకర్‌ను అమర్చిన తీరును బట్టి, ఇది ఇంటి దొంగ చేసిన పనేనా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుల్ని పోలీసులు పట్టుకుని విచారణ చేస్తున్నట్లు బస్తీ వాసులు తెలిపారు.

Updated Date - 2021-12-03T16:51:56+05:30 IST