పోలీసు అధికారి ఇంట్లో భారీ చోరీ.. కుమార్తె పెళ్లి కోసం తెచ్చిన నగలు, నగదు అపహరణ

ABN , First Publish Date - 2022-04-30T11:44:24+05:30 IST

ASI ఇంట్లో భారీ చోరీ.. కుమార్తె పెళ్లి కోసం తెచ్చిన నగలు, నగదు అపహరణ

పోలీసు అధికారి ఇంట్లో భారీ చోరీ.. కుమార్తె పెళ్లి కోసం తెచ్చిన నగలు, నగదు అపహరణ

హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : మీర్‌పేట్‌ విజయపురి కాలనీలో ఉంటున్న ఓ ఏఎస్‌ఐ ఇంట్లో గురువారం భారీ చోరీ జరిగింది. కుమార్తె పెళ్లికోసం తెచ్చిన 35 తులాల బంగారు ఆభరణాలు, రూ.17 లక్షలు దోచుకున్నారు. వీటి విలువ సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లోని కలకొండకు చెందిన ముదావత్‌ శంకర్‌, లక్ష్మి కుటుంబం విజయపురి కాలనీలో నివసిస్తోంది. శంకర్‌ నగరంలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. వచ్చే నెలలో వారి కుమార్తె వివాహం ఉండడంతో ఇటీవల బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. వివాహ ఖర్చుల నిమిత్తం నగదు సైతం ఇంట్లో దాచుకున్నారు. 


గురువారం ఉదయం శంకర్‌, లక్ష్మి దంపతులు స్వగ్రామానికి వెళ్లగా, కుమార్తె గ్రూప్స్‌కు శిక్షణ నిమిత్తం నగరానికి వెళ్లింది. కుమారుడు రాజేశ్‌ ఇంటికి తాళం వేసి కాలేజీకి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి వచ్చిన శంకర్‌, లక్ష్మి దంపతులు ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. దాంతో ఇంట్లోని నగలు, నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నంలోపే జరగగా, బాధితులు మాత్రం రాత్రి పది గంటల ప్రాంతంలో మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-30T11:44:24+05:30 IST