Advertisement
Advertisement
Abn logo
Advertisement

పట్టపగలే భారీ చోరీ

పెద్దమొత్తంలో నగదు, బంగారం, వెండి అపహరణ?

గోపాలపట్నం, నవంబరు 27: ఇక్కడి వెంకటాపురం జనతా కాలనీలో గల ఓ ఇంట్లో శనివారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండి అపహరణకు గురైనట్టు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గోపాలపట్నం ప్రధాన రహదారిలో పూజా సామగ్రి దుకాణం నిర్వహించే పసుమర్తి వైకుంఠం జనతా కాలనీలో నివాసముంటున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆయన దుకాణానికి వెళ్లిపోయారు. ఆయన భార్య నాగమణి తన కుమార్తెను పాఠశాలకు పంపిన తరువాత ఇంటి పనులు ముగించుకుని ఉదయం 11 గంటల సమయంలో దుకాణానికి వెళ్లారు. కాగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వడానికి డెలివరీ బాయ్‌ వారి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు తెరిచి వున్నప్పటికీ ఇంట్లో ఎవరూ లేకపోవడంలో వైకుంఠరావుకు ఫోన్‌ చేశాడు. వెంటనే ఆయన భార్య ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన ద్వారం తలుపులు పెకలించి ఉన్నాయి. బీరువా తెరిచి ఉంది. అందులోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలతో పాటు పెద్దమొత్తంలో నగదు అపహరణకు గురైనట్టు ఆమె గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్రైమ్‌ డీసీపీ శ్రావణ్‌కుమార్‌, ఏసీపీ పెంటారావు, సీఐ లూథర్‌బాబులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. ఓ స్థలం కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో ఉంచామని, ఆ నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు కూడా చోరీకి గురైనట్టు బాధితుడు తెలిపినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై పోలీసులు మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. కేసు దర్యాప్తులో వున్నందున వివరాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement