భారీ చోరీ కేసు : కారు డ్రైవరే కొట్టేశాడు.. 24 గంటల్లో ఛేదన

ABN , First Publish Date - 2021-01-18T12:01:38+05:30 IST

సికింద్రాబాద్‌, పాట్‌మార్కెట్‌లోని జ్యుయెల్లరీ షాపు చోరీ కేసును

భారీ చోరీ కేసు : కారు డ్రైవరే కొట్టేశాడు.. 24 గంటల్లో ఛేదన

  • పైపుల ఆధారంగా బిల్డింగ్‌ పైకి... 
  • గ్రిల్స్‌ తొలగించి షాపులోకి
  • రూ. 39.14లక్షల విలువైన సొత్తు చోరీ.. రికవరీ... నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌, పాట్‌మార్కెట్‌లోని జ్యుయెల్లరీ షాపు చోరీ కేసును మార్కెట్‌ పోలీసులు 24గంటల వ్యవధిలో ఛేదించారు. చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ. 39.15లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి... ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. వివరాలను మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.


సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌ నివాసి ఎన్‌ అనిల్‌ జైన్‌ (46) స్థానికంగా మెస్సర్స్‌ అనిల్‌ జైన్‌ పాన్‌ బ్రోకర్స్‌, నేమీచంద్‌ జైన్‌ జ్యుయెల్లర్స్‌ నిర్వహిస్తుంటారు. ఈనెల 14న సాయంత్రం 4.30గంటలకు షాపు మూసేసిన తర్వాత మరుసటి రోజు (ఈ నెల 15న) 11.10 గంటలకు తన ఉద్యోగి సునీల్‌ షాపు తెరిచారు. లోపల వస్తువులు చిందరవందరంగా పడి ఉండటం... కర్రతో తయారు చేసి ఉన్న గల్లా పెట్ట (డ్రాయర్‌) ధ్వంసమై ఉండటంతో యజమానికి సమాచారం ఇచ్చాడు. వెంటనే షాపు వద్దకు చేరుకున్న అనిల్‌జైన్‌ చోరీ జరిగిందని గ్రహించారు. కస్టమర్లు తనఖా పెట్టిన 111 తులాల బంగారు అభరణాలు, 209 గ్రాముల వెండి, రూ.50వేల నగదు చోరీ గురైందని, వాటి విలువ మొత్తం రూ. 39.15లక్షలు ఉందని గుర్తించారు. షాపులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా తెల్లవారు జాము 3.10గంటలకు షాపు పై ఉన్న ఇనుప గ్రిల్‌ను తొలగించి ఓ వ్యక్తి లోనికి ప్రవేశించి చోరీ చేసినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.




24గంటల్లో నిందితుడి అరెస్టు

మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ వై.నాగేశ్వర్‌రావు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించారు. బన్సీలాల్‌పేట్‌, చాచా నెహ్రూనగర్‌ నివాసి మహమ్మద్‌ ఆదిల్‌ (28)ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి చోరీ సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఆదిల్‌ 2015 నుంచి 2017 వరకు జ్యుయెల్లరీ షాపు యజమాని అనిల్‌ జైన్‌ వద్ద కారు డ్రైవర్‌గా పని చేశాడు.

Updated Date - 2021-01-18T12:01:38+05:30 IST