వైసీపీ దాడులపై భారీ ఎత్తున నిరసనలు

ABN , First Publish Date - 2021-10-21T06:41:37+05:30 IST

రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా ఎలమంచిలిలో బుధవారం చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా సాగింది.

వైసీపీ దాడులపై భారీ ఎత్తున నిరసనలు
ఎలమంచిలి పోలీస్‌ స్టేషన్‌ వద్ద మాజీ ఎమ్మెల్సీ చలపతిరావు తదితరుల నినాదాలు

 

ఎలమంచిలి, అక్టోబరు 20: రాష్ట్రంలోని పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా ఎలమంచిలిలో బుధవారం చేపట్టిన బంద్‌ ప్రశాంతంగా సాగింది. పోతిరెడ్డిపాలెం జంక్షన్‌ జాతీయ రహదారిపై ఆ పార్టీ నాయకులు విజయ్‌బాబు, ఇత్తం శెట్టి రాజు, రాజాన వెంకునాయుడు భైఠాయించి నినదించారు.  పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావుతో పాటు పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, ఆడారి ఆదిమూర్తి, కొఠారు సాంబ, ఆర్‌.ఎస్‌.నాగేశ్వరరావు, బొద్దపు నాగేశ్వరరావు తదితరులంతా  బంద్‌లో పాల్గొన్నారు. పలు చోట్ల ప్రైవేటు పాఠశాలలు, దుకాణాలు మూతపడ్డాయి.  చలపతిరావుతో పాటు పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని టౌన్‌, రూరల్‌ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చలపతిరావు మాట్లాడుతూ టీడీపీ కార్యాలయాలపై దాడి దారుణమన్నారు. కౌన్సిలర్‌ మజ్జి రామకృష్ణ, నేతలు, రమణబాబు, గంగాధర్‌, పెదపల్లి రమణ పాల్గొన్నారు. 

 అచ్యుతాపురం/రూరల్‌ : టీడీపీ తలపెట్టిన బంద్‌ అచ్యుతాపురంలో విజయవంతమైంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌కుమార్‌, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మిరెడ్డి నాయుడుబాబు, మండల అధ్యక్షుడు జనపరెడ్డి నర్శింగరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా అచ్యుతాపురం జంక్షన్‌ నిర్బంధిం చారు. సెజ్‌ కర్మాగారాలకు ఉద్యోగులను తీసుకువచ్చే వాహనాలతో పాటు కర్మాగారాలకు ముడి సరుకును తీసుకువచ్చే భారీ వాహనాలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అచ్యుతాపురం- ఎలమంచిలి రోడ్డునుంచి వస్తున్న వాహనాలను మార్టూరు రోడ్డుమీదుగా మళ్లించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.  టీడీపీ నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, రాజాన రమేష్‌ కుమార్‌, ధర్మిరెడ్డి నాయుడుబాబు తదితరులను  పోలీసులను అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు. అచ్యుతాపురం తెలుగుయువత మండల ప్రధాన కార్యదర్శి కర్రి ఆదిబాబు ఆధ్వర్యంలో తిమ్మరాజుపేటలో టీడీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వైపు వెళ్లే వాహనాలను నిలిపివేసి నినా దాలు చేశారు. కర్రి నాయుడు, మళ్ల చిన్నబాబు, య్లల్లపు గోవింద పాల్గొన్నారు. 


మునగపాక : టీడీపీ శ్రేణులు మునగపాక మండలంలో  ఆందోళనలు చేపట్టారు. తెల్లవారుజామునే నాగులాపల్లిలో గల టీడీపీ మండల  అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మునగపాకలో ఉన్నత పాఠశాలలను మూయించివేసి మునగపాక మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న టీడీపీ నాయకులు దాడి ముసిలినాయుడు, కడియం అనూరాధ, శరగడం యోగి నాగేశ్వరరావు, ఆడారి జనార్థనరావులను బలవంతంగా జీపు ఎక్కించి అరెస్టు చేశారు. చూచుకొండలో తెలుగుదేశంపార్టీ నాయకులు శంకర్‌, ఆడారి ప్రసాద్‌ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు.  


రాంబిల్లి : టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు చేపట్టిన ఆందోళన రాంబిల్లిలో విజయవంతమైంది. ఇక్కడి జంక్షన్‌లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ధూళి రంగనాయకులు,  మండల శాఖ అద్యక్షుడు వి.దిన్‌బాబు మాట్లాడుతూ టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులను ఖండించారు. అనంతరం టీడీపీ నాయకులు రంగనాయకులు, దిన్‌బాబు, మంగరాజు, సత్యనారాయణ, ఎరిపిల్లి చిట్టిబాబు, ఎరిపిల్లి అజయ్‌, కె.ప్రసాద్‌, దేముడు పాటు  మద్దతు తెలిపిన సీపీఎం నాయకులు జి.దేముడునాయుడు అరెస్టు చేశారు. 


Updated Date - 2021-10-21T06:41:37+05:30 IST