కెనడాలో భారీగా ఉద్యోగావకాశాలు.. ఇలా చేస్తే బంపర్ ఆఫర్ దక్కించుకోవచ్చు.. !

ABN , First Publish Date - 2022-06-04T01:52:56+05:30 IST

నడాలో భారీగా ఉద్యోగావకాశాలు.. ఇలా చేస్తే బంపర్ ఆఫర్ దక్కించుకోవచ్చు.. !

కెనడాలో భారీగా ఉద్యోగావకాశాలు.. ఇలా చేస్తే బంపర్ ఆఫర్ దక్కించుకోవచ్చు.. !

ఎన్నారై డెస్క్: విదేశీ కొలువులు కోరుకునే వారికి ఓ బంపర్ ఆఫర్..! కెనడాలో భారీ స్థాయిలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. కార్మికుల కొరత కారణంగా వివిధ రంగాల్లో ఏకంగా 10 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య రికార్డు స్థాయిలో 10,12,900కు చేరుకుంది. గతేడాది సెప్టంబర్‌లో 9,88,300 ఖాళీలు ఉండగా తాజాగా ఈ సంఖ్య మరింత పెరిగింది. వైద్యం, ఆతిథ్యం, సోషల్ అసిస్టెన్స్, రిటైల్ తదితర రంగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మరోవైపు.. కార్మికుల కొరతను అధికమించేందుకు కెనడా ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీయులను దేశంలోకి ఆహ్వానించేందుకు నిర్ణయించుకుంది. వివిధ రకాల వీసాల ద్వారా దేశంలోకి వలసలను ప్రోత్సహిస్తోంది. నిపుణుల ప్రకారం..ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ, ప్రామిన్షియల్ నామినేషన్ ప్రోగ్రామ్ తదితర మార్గాల్లో విదేశీయులు కెనడా ఉద్యోగాలు సంపాదించొచ్చు. ఈ వీసాల పూర్తి వివరాలేంటంటే.. 


1. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ.. 

కెనడాకు వలసపోయేందుకు ఉన్న ప్రధాన మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పథకం ఒకటి. ఇందులో మూడు కేటగిరీలు ఉన్నాయి. 

ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్: ప్రభుత్వం పేర్కొన్న భాషా నైపుణ్యాలు, విద్యార్హతలు, ఉద్యోగానుభవం ఉన్న వారికి ఈ ప్రోగ్రామ్ ద్వారా కెనడా వీసా లభిస్తుంది. నేషనల్ ఆక్యూపేషనల్ క్లాసిఫికేషన్ రూపంలో ప్రభుత్వం ఉద్యోగానుభవాన్ని వివిధ కేటగిరీలుగా విభజించింది. 

ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్స్ ప్రోగ్రామ్‌: ఏదైనా వృత్తిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు ఈ ప్రోగ్రామ్ ద్వారా కెనడా ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. అంతేకాకుండా.. ఈ ప్రోగ్రామ్ ద్వారా కెనడాకు వెళ్లాలనుకునే వారు దరఖాస్తు చేసుకునే నాటికి ఐదేళ్లుగా ఆ వృత్తిలో కొనసాగుతుండాలి. ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ భాషపై పట్టు ఉండాలి. 

కెనడా ఎక్స్‌పీరియన్స్ క్లాస్: గతంలో కెనడాలో కనీసం ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉన్న వారు ఈ మార్గం గుండా మళ్లీ కెనడా వీసా పొందవచ్చు. 

2. ప్రొవిన్షియల్ నామినేషన్ ప్రోగ్రామ్:

కెనడా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ స్కీమ్‌కు ఇది అదనం. కెనడాలోని వివిధ ప్రావిన్సుల ప్రభుత్వాలు స్వతంత్రంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంటాయి. వివిధ ప్రావిన్స్‌లకు సంబంధించి మొత్తం 80 రకాల ప్రోవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రోవిన్షియల్ ప్రోగ్రాముల్లో కొన్నింటిని స్థానిక ప్రభుత్వాలు ఫెడరల్ ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌కు అనుబంధంగా నిర్వహిస్తుండగా మిగిలిన వాటిని స్వతంత్రంగా పర్యవేక్షిస్తుంటాయి. 

3 క్యూబెక్..

కెనడా ఫెడరల్ ప్రభుత్వంతో క్యూబెక్ ప్రోవిన్స్‌కున్న ప్రత్యేక ఒప్పందం కారణంగా..అక్కడి ప్రభుత్వం స్వతంత్రగా వివిధ వీసా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. అవేంటంటే.. 

  1. క్యూబెక్ రెగ్యులర్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్.
  2. క్యూబెక్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్
  3. క్యూబెక్ పర్మెనెంట్ ఇమ్మిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్
  4. క్యూబెక్ బిజినెస్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్


Updated Date - 2022-06-04T01:52:56+05:30 IST