28 మందికి గాయాలు...ఆసుపత్రికి తరలింపు
ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో శనివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో 28 మంది గాయపడ్డారు. ముంబై నగరంలోని భాటియా ఆసుపత్రికి సమీపంలోని బహుళ అంతస్తుల భవనంలో మంటలు రాజుకున్నాయి. గౌలియా ట్యాంక్ ఏరియాలోని నానాచౌక్ కమలా బిల్డింగ్ 18వ అంతస్తులో శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే 17 అగ్నిమాపక వాహనాలు, 5 అంబులెన్సులను సంఘటన స్థలానికి తరలించారు.అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన 28 మందిని సమీపంలోని భాటియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి